Politics

KCR: బీఆర్ఎస్ ‘గాథ’ ముగిసినట్టే.. మళ్లీ ‘టీఆర్ఎస్’ కథ మొదలు!

‘గోడకు తగిలించిన తుపాకీ’ ఎట్టకేలకు గూడు దాటి బయటకొచ్చింది. రెండేళ్ల అజ్ఞాతం తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గొంతు సవరించారు. అయితే ఈసారి ఆయన మాటల్లో జాతీయ వాదం కంటే ప్రాంతీయ సెంటిమెంటే ఎక్కువగా ధ్వనిస్తోంది.

KCR: బీఆర్ఎస్ ‘గాథ’ ముగిసినట్టే.. మళ్లీ ‘టీఆర్ఎస్’ కథ మొదలు!

‘గోడకు తగిలించిన తుపాకీ’ ఎట్టకేలకు గూడు దాటి బయటకొచ్చింది. రెండేళ్ల అజ్ఞాతం తర్వాత బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) గొంతు సవరించారు. అయితే ఈసారి ఆయన మాటల్లో జాతీయ వాదం కంటే ప్రాంతీయ సెంటిమెంటే ఎక్కువగా ధ్వనిస్తోంది. బీఆర్ఎస్ అని పిలవాల్సిన చోట పదే పదే టీఆర్ఎస్ అని ఉచ్చరించడం చూస్తుంటే.. గులాబీ బాస్‌కు 'ఒళ్లు వంగితే కానీ తప్పు తెలియదు' అన్న సామెత గుర్తొస్తోంది. ఒకప్పుడు తెలంగాణలో తిరుగులేని శక్తిగా వెలిగిన టీఆర్ఎస్ (TRS).. కేసీఆర్ జాతీయ రాజకీయాల కలల వల్ల బీఆర్ఎస్ (BRS)గా మారింది. "దేశ్ కీ నేత" అనిపించుకోవాలన్న ఆరాటంలో ‘తెలంగాణ’ అనే అస్తిత్వాన్ని పక్కన పెట్టారు. తీరా చూస్తే, అటు దేశం ముచ్చట దేవుడెరుగు.. ఇటు కంచుకోట లాంటి తెలంగాణే చేజారిపోయింది. బీఆర్ఎస్ అనే పేరు ప్రజలకు, పార్టీకి మధ్య ఉన్న ‘పేగు బంధాన్ని’ తెంచేసిందని.. అప్పుడే చాలామంది మొత్తుకున్నారు. కానీ, ‘చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు’ కేసీఆర్ ఎవరి మాట వినకుండా ముందుకెళ్లారు. ఇప్పుడు ఓటమి దెబ్బతో నేల మీదకొచ్చిన గులాబీ దళపతి.. మళ్లీ పాత దారినే వెతుక్కుంటున్నారు.

నోట వచ్చిన మాట.. కావాలని చేసిన ప్లానా?

ఇటీవల జరిగిన ఎల్పీ సమావేశంలో కేసీఆర్ నోటి నుంచి ‘టీఆర్ఎస్ ఎల్పీ (TRSLP) మీటింగ్’ అనే పదం దొర్లింది. ఇది పొరపాటా? లేక కావాలని వదిలిన బాణమా? రాజకీయాల్లో కేసీఆర్ మాట తూటాలాంటిది. ఆయన ఏదీ ఊరికే అనరు. బీఆర్ఎస్ అనే పేరు మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టాలంటే.. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అనే పాత మందునే వాడాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. పాత పగలు.. కొత్త పాటలు అన్నట్లుగా.. మళ్లీ ఏపీ సీఎం చంద్రబాబును, ఆంధ్రా పాలకులను టార్గెట్ చేయడం దీనికి సంకేతం. బయట ప్రత్యర్థుల కంటే పార్టీ లోపల జరుగుతున్న ‘కురుక్షేత్రం’ కేసీఆర్‌ను ఎక్కువ కలవరపెడుతోంది. కొడుకు కేటీఆర్, కూతురు కవిత మధ్య ఆధిపత్య పోరు ఒకవైపు పార్టీని నమ్ముకున్న హరీశ్ రావు ‘కట్టప్ప’లా మారిపోతారేమో అన్న భయం మరోవైపు. ‘ఇంట్లో ఈగలు తోలలేనోడు.. బయట గెద్దలు తోలుతానన్నాడట’ అన్నట్లుగా.. పార్టీలోనే విభేదాలు ముదురుతుంటే జాతీయ రాజకీయాలు ఎందుకనే ఆలోచనలో ఆయన పడ్డారు. అందుకే, మళ్లీ తెలంగాణ అస్థిత్వం వైపు అడుగులు వేస్తున్నారు.

ప్రాంతీయ వాదమే ఏకైక అస్త్రమా?

పాలమూరు ఎత్తిపోతల దగ్గర మొదలైన కేసీఆర్ ప్రసంగం.. ఆంధ్రాలో జరిగిన ఎంవోయూల వరకు వెళ్లింది. 2014 నాటి బాబు పాలనను కించపరుస్తూ మాట్లాడటం వెనుక ఒకటే వ్యూహం.. ‘ఆంధ్రా నాయకులు వస్తున్నారు.. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు.. మళ్లీ నేను రావాలి’ అని జనాన్ని నమ్మించడం. విభజన జరిగి పదేళ్లయినా, పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఇంకా ఆంధ్రా పాలకుల మీద ఏడవటం చూస్తుంటే ‘తప్పు నాది కాదు.. ఎదుటోడిది’ అని నెట్టేసే పాత తంతే కనిపిస్తోంది.

పేరు మార్చితే కారు పరుగు తీస్తుందా?

బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చడం అంటే కేవలం బోర్డు మార్చడం కాదు.. కోల్పోయిన నమ్మకాన్ని వెనక్కి తెచ్చుకోవడం. అయితే, ప్రజలు ఇప్పుడు అన్నీ గమనిస్తున్నారు. ‘గోడ మీద పిల్లి’ లాంటి వైఖరిని జనం హర్షించరు. జాతీయ రాజకీయాల కోసం తెలంగాణను వదిలేసి, ఇప్పుడు అవసరం వచ్చేసరికి మళ్లీ 'తెలంగాణ తల్లి' అని పాట పాడితే జనం నమ్ముతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మొత్తానికి కేసీఆర్ ప్రసంగం వెనుక ఉన్నది బీఆర్ఎస్ 'గాథ' కాదు.. టీఆర్ఎస్ ను మళ్లీ బతికించాలనే 'కథ'. పేరు మార్చడం వల్ల అదృష్టం మారుతుందో లేదో తెలియదు కానీ.. కేసీఆర్ మాత్రం తన పాత ‘ప్రాంతీయ’ అస్త్రానికి పదును పెడుతున్నారు. "ఓడితే బుద్ధి వస్తుంది.. గెలిస్తే గర్వం వస్తుంది" అంటారు.. మరి కేసీఆర్ కు వచ్చిన ఈ బుద్ధి పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి!

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 26, 2025 3:13 AM