Politics

YCP Vs TDP: ఏపీలో తెలుగు తమ్ముళ్లు వర్సెస్ వైసీపీ బ్రదర్స్ సోషల్ మీడియా వార్..

పెళ్లి ఒకటే.. కానీ జరిగిన అనర్ధాలే బోలెడు. ఎవరు తీసుకునే అర్థం వారు తీసుకుంటున్నారు. మొత్తానికి రచ్చ రంబోలా. ఇంతకీ ఏ పెళ్లి? ఏంటా అనర్థాలు.. నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే.. అర్థమయ్యీ కానట్టు చెబుతున్నావ్ అంటారా?

YCP Vs TDP: ఏపీలో తెలుగు తమ్ముళ్లు వర్సెస్ వైసీపీ బ్రదర్స్ సోషల్ మీడియా వార్..

పెళ్లి ఒకటే.. కానీ జరిగిన అనర్ధాలే బోలెడు. ఎవరు తీసుకునే అర్థం వారు తీసుకుంటున్నారు. మొత్తానికి రచ్చ రంబోలా. ఇంతకీ ఏ పెళ్లి? ఏంటా అనర్థాలు.. నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే.. అర్థమయ్యీ కానట్టు చెబుతున్నావ్ అంటారా? అదేనండీ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరుడి కుమారుడి వివాహ వేడుక.

చెన్నైలో పారిశ్రామికవేత్త అయిన వైఎస్ సునీల్ రెడ్డి తన కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు తన ఆత్మీయులందరినీ ఆహ్వానించారు. సునీల్ రెడ్డి చెన్నైలో పారిశ్రామిక వేత్త కావడంతో తమిళనాడుకు చెందిన రాజకీయ ప్రముఖులతో పాటు ప్రముఖ నటీనటులు సైతం హాజరయ్యారు. అలాగే ఏపీ నుంచి కూడా కొందరు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆ వివాహ వేడుకకు సంబంధించిన వీడియోనో.. ఫోటోనో ఏదో ఒకటి బయటకు వస్తోంది. అది వచ్చినప్పుడల్లా పెద్ద రచ్చకు దారి తీస్తోంది.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా..

గత రెండు మూడు రోజులుగా టీడీపీ వర్సెస్ వైసీపీ సోషల్ మీడియా వార్ జరుగుతోంది. మా అన్నను తమిళనాడుకు చెందిన రాజకీయ ప్రముఖులంతా వచ్చి హగ్ చేసుకుని మరీ ఆకాశానికి ఎత్తారన్నట్టుగా వైసీపీ.. మీ అన్నకు బొకే ఇచ్చేందుకే తమిళగ వెట్రి కళగం అధినేత, హీరో విజయ్ ఇష్టపడలేదని టీడీపీ.. ప్రూఫ్‌లతో సహా సోషల్ మీడియాలో పెట్టి పెద్ద వార్ నడిపిస్తున్నారు. ఇది చాలదన్నట్టుగా తాజాగా ఒక ఫోటో బయటకు వచ్చింది. ఇంకేముంది? కాస్త చల్లారుతోందనుకున్న అగ్గి మళ్లీ రాజుకోవడం ప్రారంభించింది. తిరిగి సోషల్ మీడియా వార్ స్టార్ట్. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా.. అనిల్ రెడ్డి కుమారుడి వివాహం ఇరు పార్టీల మధ్య పెద్ద దుమారాన్నే రేపుతోంది.

ఫోటో బయటకు వచ్చిందంతే..

గతంలో ఏపీ పాలిటిక్స్ వేరు.. ఇప్పటి పాలిటిక్స్ వేరు. ప్రస్తుతం ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలినా ఇబ్బందే. ఒకప్పుడు అసెంబ్లీకో.. లేదంటే ఎన్నికలకు మాత్రమే రాజకీయాలు పరిమితమయ్యేవి. ఇప్పుడు పెళ్లి, చావు అన్న తేడా లేకుండా ఏపీలో ఎందెందు చూసినా అందందు రాజకీయమే. అసలు విషయం ఏంటంటే.. అనిల్ రెడ్డి కుమారుడి వివాహానికి ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సైతం హాజరయ్యారు. వివాహంలో జగన్ ఎదురు పడటంతో ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తరువాత ఇద్దరూ కాసేపు రాజకీయాలను పక్కనబెట్టి.. పక్క రాష్ట్రంలో ఉన్నామన్న ధ్యాసతో చ్కగా మాట్లాడుకున్నారు. అంతే జగన్, మాగుంట షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ఫోటో బయటకు వచ్చిందంతే. రకరకాల కథలు అల్లి వార్ ప్రారంభించారు తెలుగు తమ్ముళ్లు.. వైసీపీ బ్రదర్స్.

చంద్రబాబు పార్టీ మారుతున్నట్టా?

మాగుంట.. చెన్నైలో పార్టీ మారేందుకు గంట కొట్టేశారు. చెన్నై నుంచి అమరావతికి రావాల్సి ఉండగా రూట్ మార్చేసి బెంగుళూరు జగన్ ఎలహంక ప్యాలెస్‌కి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారంటూ ప్రచారం ప్రారంభమైంది. మూడేళ్లకు పైగానే ఎంపీ పదవి ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చెలాయిస్తోంది. హస్తినలోనూ టీడీపీకి తిరుగులేదు. ఇంక ఆయనెందుకు పార్టీ మారుతారు? మినిమం కామన్‌సెన్స్ లేదు. ఏదో గుడ్డ కాల్చి నెత్తిన వేయాలంతే. అసలే ఏపీలో లడ్డూ కల్తీ వ్యవహారం కాక రేపుతుంటే.. మాగుంట వ్యవహారం మరింత మంట పెట్టింది. మాగుంట చేసిన దానిలో తప్పేమీ లేదు. అంతెందుకు అక్కడికి చంద్రబాబు వెళ్లినా కూడా జగన్ కలిస్తే పక్కాగా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడతారు. అలాగని చంద్రబాబు పార్టీ మారుతున్నట్టా? ఏంటో రచ్చ.

దీనికెందుకు రచ్చ?

మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీకి.. ఆ తరువాత వైసీపీకి తిరిగి టీడీపీకి వచ్చారు. వైసీపీ అధినేతతో ఆమాత్రం చనువు ఉండటం సహజం. దీనికెందుకు రచ్చ? అందునా వివాహ వేడుకకు హాజరైనప్పుడు డీసెంట్‌గా వ్యవహరించాలి. అంతేకానీ ప్రత్యర్థి కనిపించాడు కదాని కత్తులు నూరుతూ కూర్చొంటారా? ఎందుకో టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. మాగుంట ఈ విధంగా జగన్‌తో షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల పార్టీలోని క్యాడర్‌కి తప్పుడు సంకేతాలు వెళ్తాయని టీడీపీలో చర్చ నడుస్తోందట. అసలు అలాంటి చర్చలు ఎక్కడైనా జరిగితే వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టాల్సింది పోయి వారే చర్చించుకోవడమేంటో విడ్డూరం. మొత్తానికి టీడీపీ అయినా.. వైసీపీ అయినా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టకుంటే అన్నీ సవ్యంగానే సాగుతాయి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 11, 2026 6:37 AM