Telagana News: ఇంత దారుణమా? మనుషులేనా?
నోరు లేని జీవాల పట్ల తెలంగాణలోని మూడు గ్రామాల్లో జరిగిన దారుణం తెలిస్తే విస్తుబోతారు. కుక్కలను పెంచుకునే వారికి అవేంటనేది తెలుస్తుంది. మనుషుల్లో కొందరి మాదిరిగానే కుక్కల్లోనూ కొన్ని తేడాగా ఉంటాయి.
నోరు లేని జీవాల పట్ల తెలంగాణలోని మూడు గ్రామాల్లో జరిగిన దారుణం తెలిస్తే విస్తుబోతారు. కుక్కలను పెంచుకునే వారికి అవేంటనేది తెలుస్తుంది. మనుషుల్లో కొందరి మాదిరిగానే కుక్కల్లోనూ కొన్ని తేడాగా ఉంటాయి. అవి వాటి అనారోగ్య కారణంగానో.. మరో కారణంగానో అవి అలా తయారవుతాయి. మనుషులపై దాడి చేస్తాయి. వాటికి ఏది మంచి.. ఏది చెడు అనేది తెలియదు. అన్నీ తెలిసిన మనుషులే తోటి మనుషులను దారుణంగా పీక్కుతుంటుంటే ఎక్కడో ఒకచోట నోరు లేని జీవి దాడి చేయడంలో వింతేముంది? ఇదంతా ఎందుకంటే.. ఇంతకంటే దారుణమైన పనిని మనుషులు చేశారు కాబట్టి.
ఎన్నికల వేళ హామీలు ఇవ్వడం అనేది సర్వసాధారణం. అలాగే తెలంగాణలోని మూడు గ్రామాల్లో కుక్కల బెడద లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత హామీని నిలబెట్టుకోవాలనుకున్నారు. అంతే కుక్కలన్నింటిని రాత్రికి రాత్రే చంపేసి పూడ్చి పెట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు.. 600 కుక్కలను దారుణంగా హతమార్చారు. పైగా తాము ఎన్నికల హామీని నిలబెట్టుకున్నామంటూ గొప్పగా చెప్పుకున్నారు. ఆ గొప్పలే వారిని న్యాయస్థానాల ముందు నిలబెట్టాయి.
తెలిసిన వారంతా షాక్..
కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండల పరిధిలో ఉన్న ఫరీద్‌పేట్, బండరామేశ్వర్‌పల్లి, భవానీపేట వాడి గ్రామాల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. తమను గెలిపిస్తే వీధి కుక్కల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ప్రజల్లో గట్టిగా పడింది. ఈ మాటలే ఆయా అభ్యర్థులకు గెలుపును తెచ్చి పెట్టడంతో ఆయా అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికలు పూర్తయ్యాక ఊరి ప్రజలు తమ సమస్యను తీర్చాలని కోరారు. అంతే నాలుగు గ్రామాల్లోనూ రాత్రికి రాత్రే వీధి కుక్కలు కనిపించకుండా పోవడంతో గ్రామస్తులైతే ఊపిరి పీల్చుకున్నారు. కానీ జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తల్లో అనుమానం మొదలవడంతో కుక్కలు ఎక్కడికి వెళ్లాయనే విషయమై ఆరా తీయడం ప్రారంభించారు. విచారణలో బయటపడిన విషయాలు వారిని విస్తుబోయేలా చేశాయి. పోలీసులు, జంతు ప్రేమికుల సహాయంతో మొత్తం 642 వీధి కుక్కల కళేబరాలను వెలికి తీశారు. అది తెలిసిన వారంతా షాక్ అయ్యారు. వారసలు మనుషులేనా? అన్న అనుమానం తలెత్తింది.
ఎంతటి దుస్సాహసానికైనా ఒడిగడతారా?
ఇదంతా కొత్తగా ఎన్నికైన సర్పంచుల పనేనని ప్రాథమికంగా నిర్ధారించారు. వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పండుగ సమయం అయినా అరెస్టులు తప్పవని తెలుస్తోంది. అధికారం కోసం ఎంతటి దుస్సాహసానికైనా ఒడిగడతారా? వీధి కుక్కల సమస్య నిజమే కానీ దానికి ఇదా పరిష్కారం? మూగ జీవాలకు మంచి, చెడులు అనేది తెలియవు. తెలిసిన మనుషులు అంతకు మించి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. దేశంలో ఎక్కడో ఒక కుక్క జనాలపై దాడి చేస్తేనే నానా హంగామా చేసే జనాలు.. ఇన్ని వందల కుక్కలను దారుణంగా హతమారిస్తే గొంతు విప్పరా? ఇంతకు మించిన దారుణం మరొకటి ఉందా? అసలు వారు మనుషులేనా?
ప్రజావాణి చీదిరాల