Politics

Telangana: క్యాబినెట్‌లో హై టెన్షన్.. రాజా వర్సెస్ రాములక్క.. ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లో అధికారం, పదవుల పంపకంపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి (CM Revanth Reddy)తో కలిపి 16 స్థానాలు భర్తీ అయిన నేపథ్యంలో, మిగిలిన రెండు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ హైకమాండ్ (AICC) దృష్టి సారించింది.

Telangana: క్యాబినెట్‌లో హై టెన్షన్.. రాజా వర్సెస్ రాములక్క.. ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?

అవును.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లో అధికారం, పదవుల పంపకంపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి (CM Revanth Reddy)తో కలిపి 16 స్థానాలు భర్తీ అయిన నేపథ్యంలో, మిగిలిన రెండు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ హైకమాండ్ (AICC) దృష్టి సారించింది. రాష్ట్ర పార్టీల సూచన మేరకు ఏఐసీసీ ఈ అధ్యయనాన్ని ప్రారంభించింది. అయితే, ఈ విస్తరణ కేవలం ఖాళీలను పూరించడం మాత్రమే కాదు, కుటుంబ సమీకరణాలు, బీసీ ప్రాతినిధ్యం, సీనియర్ల బుజ్జగింపుల మధ్య అగ్నిపరీక్షగా మారింది. ప్రధానంగా రేసులో ఉన్నవారిలో నటి, సీనియర్ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) అలియాస్ రాములక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఉన్నారు. వీరిద్దరినీ ఏఐసీసీ కోటాలో భర్తీ చేయాలని చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఇద్దరికీ మంత్రి పదవి ఇవ్వాలనేది ఏఐసీసీ ఉద్దేశం.

ఇద్దరిలో ఔట్ ఎవరు?

కోమటిరెడ్డి ఫ్యామిలీలోనే ఇద్దరికి మంత్రి పదవులు అవుతున్న నేపథ్యంలో, ఇద్దరిలో ఒకరు ఛాన్స్ వదులుకోవాలని ఏఐసీసీ కోరుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి స్థానానికి బదులుగా క్యాబినెట్ ర్యాంక్‌తో కార్పొరేషన్ పదవి కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజా మాత్రం ఈ అంశంపై గట్టి పట్టుదలతో ఉన్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలను ఇచ్చిన ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు, 11 మంది ఎమ్మెల్యేలున్న నల్లగొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేమీ లేదనే అంశాన్ని ఆయన బలంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో రాష్ట్ర పార్టీ, ఏఐసీసీ తీవ్ర తర్జన భర్జన పడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ క్యాబినెట్ భర్తీ అంశాన్ని పూర్తిగా హైకమాండ్‌కే వదిలేసినట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. దీంతో అన్న కోసం తమ్ముడు తగ్గుతాడా..? లేదంటే ఎలాగో దాదాపు రెండేళ్లు పదవి అనుభవించిన అన్న.. తమ్ముడి కోసం తగ్గుతాడా? అన్నది చూడాలి.

విజయశాంతికి హోం శాఖ?

విజయశాంతికి మంత్రి పదవి వరిస్తే, కీలకమైన హోం శాఖ ఇస్తారనే చర్చ పార్టీలో గట్టిగానే జరుగుతున్నది. ఏఐసీసీ వ్యూహంలో భాగంగానే ఆమెకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో అతి సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆమెకు అనూహ్యంగా ఎమ్మెల్సీతో పాటు త్వరలో మంత్రి పదవీ వరించనున్నదని గాంధీభవన్ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి మంత్రి ప్రాతినిథ్యం అవకాశం ఎలా కల్పిస్తారనేది సస్పెన్స్‌గా మారింది. రాములమ్మను రంగారెడ్డి కోటా కింద కన్సిడర్ చేస్తారనే చర్చ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి లాంటి సీనియర్ నేత గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సీనియర్ నేతను ఎలా సంతృప్తి పరుస్తారనేది త్వరలోనే తేలనున్నది.

పీసీసీ చీఫ్ ఛేంజ్!

ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఛేంజ్ అవుతున్నారనే వార్తలు పార్టీలో ఊపందుకున్నాయి. మహేశ్‌ను క్యాబినెట్‌లో తీసుకొని బీసీ కోటాలో డిప్యూటీ సీఎంను చేయాలని ఏఐసీసీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో నిజామాబాద్ జిల్లాకు కూడా మంత్రి పదవి అవకాశం కల్పించినట్లు అవుతుందనేది పార్టీ ఆలోచన. అందుకే ఇంతకాలం మంత్రి పదవి కోసం ప్రయత్నించిన సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్‌ను ఇచ్చారని పార్టీలో టాక్. పీసీసీ చీఫ్‌గానే కొనసాగాలని మహేశ్‌కు ఉన్నప్పటికీ, ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తానని చెబుతున్నారు. మహేశ్ గౌడ్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవాలంటే ఒక మంత్రిని తప్పించాల్సి ఉంటుంది. ఇందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పీసీసీ ఇవ్వాలని ఏఐసీసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. వీటిపై అతి త్వరలోనే నిర్ణయం జరగనున్నది. ఇక మంత్రుల శాఖలవారీగా రిపోర్ట్ తీసుకున్న ఏఐసీసీ శాఖల మార్పునకు కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నదనే చర్చ జరుగుతున్నది.

ప్రజావాణి చీదిరాల

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 17, 2025 4:47 AM