Telangana Politics: ‘గురువు’ కేటీఆర్.. ‘శిష్యుడు’ రేవంత్.. సోషల్ మీడియాలో స్టేటస్ వార్!
తెలంగాణ రాజకీయ యుద్ధం గల్లీ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి ఇప్పుడు ఏకంగా అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి చేరింది. ఒకే అడ్రస్.. ఒకే క్యాంపస్.. కానీ సీన్ కట్ చేస్తే పాత్రల స్థాయిలు మాత్రం ఉత్తర-దక్షిణ ధ్రువాల్లా కనిపిస్తున్నాయి.
తెలంగాణ రాజకీయ యుద్ధం గల్లీ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి ఇప్పుడు ఏకంగా అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి చేరింది. ఒకే అడ్రస్.. ఒకే క్యాంపస్.. కానీ సీన్ కట్ చేస్తే పాత్రల స్థాయిలు మాత్రం ఉత్తర-దక్షిణ ధ్రువాల్లా కనిపిస్తున్నాయి. ఒకరు అక్కడ ప్రపంచ మేధావులకు దిశానిర్దేశం చేసే ‘గురువు’గా వెళ్తుంటే, మరొకరు అక్కడ బెంచి మీద కూర్చుని ఓనమాలు నేర్చుకునే ‘శిష్యుడి’గా వెళ్తున్నారు. ఈ పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో ‘స్టేటస్’ వార్‌కు తెరలేపింది.
అందరికీ ఒక్కటే రూల్..
హార్వర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే అత్యుత్తమ మేధావులకు, నోబెల్ విజేతలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి వేదికపై ప్రసంగించాలంటే కేవలం పదవి ఉంటే సరిపోదు, అపారమైన విజన్, సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి. గత పదేళ్లలో ఐటీ మంత్రిగా కేటీఆర్ పని తీరో లేదంటే మరో కారణమో కానీ హార్వర్డ్ యాజమాన్యం, ఆయన్ని గెస్ట్ లెక్చరర్‌గా సాదరంగా ఆహ్వానించింది. అంటే, అక్కడ కూర్చున్న రేపటి తరం మేథావులకు కేటీఆర్ ‘పాఠాలు’ చెప్పబోతున్నారన్నమాట. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే హార్వర్డ్ బాట పట్టారు. అయితే ఇక్కడే అసలు ‘క్లాస్’ తేడా బయటపడిందనేది బీఆర్ఎస్ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. రేవంత్ అక్కడికి వెళ్తున్నది ప్రసంగించడానికి కాదు, నేర్చుకోవడానికి! వేల డాలర్లు (లక్షల రూపాయలు) ఫీజుగా చెల్లించి, ఐదు రోజుల పాటు నిర్వహించే ఒక స్వల్పకాలిక కోర్సు కోసం ఆయన విద్యార్థిగా వెళ్తున్నారు. తప్పదు కొన్ని కోర్సులకు వేల డాలర్లు ఫీజు చెల్లించాల్సిందే. దానికి సీఎం అయితే ఏంటి? పీఎం అయితే ఏంటి? అందరికీ ఒక్కటే రూల్. ఆమాత్రం ఇంగితం లేని బీఆర్ఎస్ శ్రేణులు దీనిని క్యాష్ చేసుకుంటున్నాయి. ఒకరు తన టాలెంట్‌తో పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగితే, మరొకరు ఇంకా అడ్మిషన్ ఫీజు కట్టి పాఠాలు నేర్చుకునే స్థాయిలోనే ఉన్నారంటూ సెటైర్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
పార్టీని నడిపించే సత్తా ఉన్న నేతే లేరా?
రాజకీయాల్లో ఎవరి స్థాయి ఏమిటో చెప్పడానికి ఒక్కోసారి ఇలాంటి అంతర్జాతీయ వేదికలే సాక్ష్యంగా నిలుస్తాయి. ‘చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం సులభమే కానీ, సొంతంగా తోట పెంచి పండ్లు పండించడం కష్టం’ అన్న సామెత చందంగా.. నిజ జీవితంలో కేటీఆర్ తన తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తుంటే.. రేవంత్ మాత్రం సొంతంగా ఎదిగిన వ్యక్తి. పార్టీని విజయతీరాలకు నడిపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అధికారం అడ్డు పెట్టుకుని గుర్తింపును ‘కొనుక్కోవాలని’ చూస్తున్నారని అంటున్నారంటే అంతకు మించిన అజ్ఞానం మరొకటి ఉంటుందా? పైగా బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఆరోపణలను జీర్ణించుకోలేక రేవంత్‌కు ఇగో దెబ్బతింటోందట. అంతా ఇగోనే ఉంటే అధికారంలోకి వచ్చాక.. మాజీ సీఎం కేసీఆర్ హాస్పిటల్‌లో ఉంటే పరామర్శకు ఎందుకు వెళతారు? అసెంబ్లీలో వెళ్లి మరీ ఎందుకు పలకరిస్తారు? పైగా కేటీఆర్ హార్వర్డ్ పర్యటనకు బ్రేక్ వేయడానికి రేవంత్ సర్కార్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తోందని టాక్. కేటీఆర్ అమెరికా వెళ్లే సమయంలోనే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగించి, ఆయనను రాష్ట్రం దాటకుండా చేయాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ అలాగే చేశారనుకున్నా కేటీఆర్ కాకుండా మునిసిపల్ ఎన్నికల్లో పార్టీని నడిపించే సత్తా ఉన్న నేతే బీఆర్ఎస్‌లో లేరా?
అది మరిస్తే ఎలా?
రాజకీయంగా కేటీఆర్‌ను అడ్డుకోవచ్చు కానీ, ఆయన సంపాదించుకున్న మేధోపరమైన క్రెడిబిలిటీని రేవంత్ అడ్డుకోగలరా? అనేది ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు లేవనెత్తుతున్న ప్రశ్న. కేటీఆర్ లెక్చర్‌ను ఆపాలని చూస్తే రేవంత్‌కే నెగెటివ్ మార్కులు పడతాయని సైతం ఆరోపిస్తున్నారు. తన ప్రత్యర్థి ఎదుగుదలను చూసి ఓర్వలేక, రాష్ట్ర పనుల పేరుతో అడ్డుకట్ట వేయాలని చూడటం రేవంత్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. తల్లికి చీర కొనివ్వలేనోడు.. పినతల్లికి బంగారు గాజులు కొనిచ్చాడట అన్నట్టుగా ఉందీ వ్యవహారం. తెలంగాణలో పార్టీని నడిపించలేక బొక్క బోర్లా పడిన కేటీఆర్ హార్వర్డ్‌లో లెక్చర్ ఇవ్వడానికి వెళుతున్నాడంటూ కాంగ్రెస్ శ్రేణులు సైతం ఎద్దేవా చేస్తున్నాయి. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ప్రతి ఒక్కరూ జీవితమనే పాఠశాలలో నిత్య విద్యార్థే. అది మరిస్తే ఎలా? అంతటి అపార మేథో సంపద కలిగిన కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ఎందుకు గట్టెక్కించలేకపోయినట్టు? సిట్టింగ్ స్థానం కదా. హార్వర్డ్ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వగలరేమో కానీ గల్లీలో పార్టీని గట్టెక్కించగలిగే సత్తా మాత్రం ఆయనకు లేదని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.
గురువుగా ఆ వ్యక్తి అర్హుడేనా?
ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మనుగడే లేదన్న స్థాయి నుంచి పార్టీని గెలిపించి సీఎం పీఠాన్ని అధిరోహించిన వ్యక్తి రేవంత్. అసెంబ్లీ మొహం కూడా చూడనివ్వబోమంటూ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. అలాంటి కేసీఆర్‌ను అసెంబ్లీ మొహం చూడటానికే భయపడేలా చేసిన వ్యక్తి రేవంత్. పైగా కేసీఆర్ ఒకసారి అసెంబ్లీకి వస్తేనే తన స్థాయిని తగ్గించుకుని మరీ వెళ్లి పలకరించిన రేవంత్‌కు భేషజాలు ఉంటాయని ఎలా అనుకోవాలి? హార్వర్డ్ యూనివర్సిటీలో క్లాస్ తీసుకోబోతున్నానని.. శిష్యుడిగా రేవంత్ కూర్చోబోతున్నారని ఒక గురువు స్థాయిలో వెళుతున్న వ్యక్తి ఎద్దేవా చేయడం చూస్తుంటే అసలు గురువుగా ఆ వ్యక్తి అర్హుడేనా అనిపిస్తోంది. ఒకవేళ పార్టీ శ్రేణులు ఇలాంటి ప్రచారానికి ఒడిగట్టినా కూడా ఖండించాలి. కానీ కేటీఆర్ తీరు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంది. ఇదంతా చూస్తుంటే హార్వర్డ్ యూనివర్సిటీలో వన్ డే గురువు కేటీఆర్ అయితే అయ్యుండొచ్చేమో కానీ జీవితం అనే పాఠశాలలో కేటీఆర్ చాలా నిమ్న స్థాయిలో ఉన్నట్టే. ఏదేమైనా, ఒకే యూనివర్సిటీకి విపక్ష నేత లెక్చరర్‌గా, సీఎం స్టూడెంట్‌గా వెళ్లడం అనేది తెలంగాణ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద ఐరనీ!
ప్రజావాణి చీదిరాల