TDP: అధికారం చేతిలో ఉన్నా టీడీపీ, జనసేన మౌనం.. ఉక్కు కోసం నోరెత్తరేం?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కేవలం ఆర్థిక నష్టాల సమస్య మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని నిబద్ధత లేమికి, వ్యూహాత్మక మౌనానికి నిలువెత్తు నిదర్శనం.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కేవలం ఆర్థిక నష్టాల సమస్య మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని నిబద్ధత లేమికి, వ్యూహాత్మక మౌనానికి నిలువెత్తు నిదర్శనం. 2017-20 మధ్య కేంద్రం దేశవ్యాప్తంగా ఐదు స్టీల్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు నిర్ణయించగా, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నాయకులు పార్టీలకతీతంగా ఏకమై పోరాడారు. ఆ నాలుగు రాష్ట్రాలు విజయం సాధించగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్కటే ప్రైవేటీకరణ ముప్పు నుంచి బయటపడలేక, నేటికీ ఆ పీడకల నుంచి బయటపడలేకపోతోంది.
కేంద్రంలో భాగమైనా మౌనమెందుకు?
కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వైజాగ్ ఉక్కు కోసం టీడీపీ, జనసేన ఎంపీలు నోరు మెదపకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ‘కేంద్రం మా మాట వింటుంది’ అని చెప్పుకునే నేతలు, రాష్ట్రానికి జీవనాడి లాంటి స్టీల్ ప్లాంట్ విషయంలో మౌనం వహించడం దేనికి సంకేతం? రాజకీయ బలం ఉన్నా ఒత్తిడి తీసుకురాలేకపోవడం వారి అసమర్థతా? లేక కేంద్ర పెద్దల ప్రైవేటీకరణ ప్రణాళికలో వీరూ భాగస్వాములా? అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం అంతంత మాత్రంగానే పార్లమెంట్‌లో కాకుండా బయట మాత్రమే హడావుడి చేస్తున్నారు.

వైట్ ఎలిఫెంట్ వెనుక వ్యూహం
ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను పతాక స్థాయికి చేర్చాయి. సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ముగింపులో ఆయన స్టీల్ ప్లాంట్‌ను ‘తెల్ల ఏనుగు’ తో పోల్చడం, ఉద్యోగులు ఇంట్లో కూర్చుని జీతాలు తీసుకుంటున్నారని విమర్శించడం సంచలనం సృష్టించింది. వేల కోట్లు (2024లో రూ.4వేల కోట్లు నష్టం) తెచ్చి పోసినా లాభాలు రాకుండా పోతే ఎంతకాలం భరించాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఎప్పటికీ డబ్బు ఇస్తుందా? ఉద్యోగులు కష్టపడి పని చేసి లాభాలు తెచ్చి, ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఉద్యోగులపై ఒత్తిడి పెంచి, ప్లాంట్‌ను ప్రొఫెషనల్‌గా నడపాలని కోరుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, విపక్షాలు, యూనియన్లు దీన్ని ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసే ముందస్తు సంకేతాలుగా చూస్తున్నాయి.
ఉద్యోగుల చేతుల్లోనే భవితవ్యం
నష్టాలు వస్తున్నంత కాలం ప్రజల పన్నుల సొమ్మును ధారబోయలేమనే చంద్రబాబు భావన సరైనదే కావచ్చు. కానీ, ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వంటి మౌలిక లోపాలను సరిదిద్దకుండా, నష్టాలకు కేవలం ఉద్యోగుల పనితీరునే కారణంగా చూపడం ఉద్దేశపూర్వక నిర్వీర్యం కాదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం, విశాఖ ఉక్కు భవితవ్యం ఉద్యోగుల చేతుల్లోనే ఉందన్నది చంద్రబాబు మాటల్లోని సారాంశం. వారు కష్టపడి పని చేసి లాభాల్లోకి తీసుకురాగలిగితేనే ప్రైవేటీకరణ ఆగుతుంది. లేదంటే, పార్టీ నేతలు మౌనంగా ఉండి, కేంద్రం వైపు ఒత్తిడి తేకుండా ఉంటే, వైజాగ్ ఉక్కు ప్రైవేటుపరం కావడం ఎంతో దూరంలో లేదన్నది ఉక్కు లాంటి నిజం!