Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం సొంత ఇలాఖాలో జెండా పాతిన టీడీపీ
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. రాష్ట్రంలో ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వాస్తవానికి అధికార పార్టీయే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుంది. అందులో పెద్దగా వింతేమీ లేదు.
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. రాష్ట్రంలో ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వాస్తవానికి అధికార పార్టీయే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుంది. అందులో పెద్దగా వింతేమీ లేదు. కానీ ఒకచోట మాత్రం టీడీపీ జెండా పాతింది. దానిని మాత్రం చెప్పుకుని తీరాల్సిందే. అది కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం కావడం విశేషం.
అవును.. మధిరలో టీడీపీ జెండా ఎగిరింది. మధిరలోని ఒక వార్డు నుంచి టీడీపీ అభ్యర్థి అఖండ విజయం సాధించారు. వార్డే కదా అనుకోవడానికి లేదు. అసలు తెలంగాణలో ఎప్పటికీ టీడీపీ జెండా ఎగరదని అంతా భావించారు. ఈ తరుణంలో రెపరెపలాడింది. ఇది పార్టీకి ఒకరకంగా ఊపిరి పోసినట్టే. చిన్న ఆశ చాలు.. కొండను ఢీకొట్టడానికి. మధిరలోని వార్డులో టీడీపీ విజయం సాధించడానికి కారణమేంటి? అక్కడ సరైన నేత లేరా? చూద్దాం.
రేవతి ఘన విజయం..
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల విషయానికి వస్తే టీడీపీ అధిష్టానం నుంచి పోటీ చేస్తామని కానీ.. చేయబోమని కానీ ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో టీడీపీ తరుఫున పలువురు అభ్యర్థులు బరిలోకి దిగారు. ముఖ్యంగా ఏపీకి సరిహద్దును ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లాలోని మధిర మునిసిపాలిటీ నుంచి ముగ్గురు మహిళా అభ్యర్థులు టీడీపీ తరుఫున రంగంలోకి దిగారు. ముగ్గురిలో ఒకరు విజయం సాధించడం విశేషం. మధిర 10వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసిన బోడేపూడి రేవతి ఘన విజయం సాధించారు. దాదాపుగా రెండో రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచిన రేవతి.. ప్రత్యర్థి అభ్యర్థిపై 166 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కౌంటింగ్ కేంద్రం నుంచి రిటర్నింగ్ అధికారి రేవతి గెలుపును అధికారికంగా ప్రకటించగానే టీడీపీ కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
బీజేపీకి ఏమాత్రం పట్టులేదు..
మధిరలో టీడీపీ అభ్యర్థి విజయానికి కారణం కూడా ఒకరకంగా డిప్యూటీ సీఎం భట్టియే అని చెప్పాలి. వాస్తవానికి సొంత నియోజకవర్గంలో భట్టికి చాలా నెగిటివిటీ ఉంది. వాస్తవానికి భట్టి డిప్యూటీ సీఎం అయినా కూడా సొంత నియోజవర్గంలో ఆయన సతీమణి మల్లు నందినిదే అధికారమంతా. ఎవరికైనా కాంట్రాక్టులు రావాలన్నా.. ఏదైనా పని జరగాలన్నా ఆమెకు కొంత వాటా ఇవ్వాల్సిందే. కాస్ట్లీ పట్టు చీరలు, కాంట్రాక్ట్ అయితే కొంత వాటా ఇలా పనికో రేటు ఉంటుంది. దీంతో భట్టిపై అక్కడ విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. కానీ ఏ చెట్టు లేని చోట ఆముదపు వృక్షమై మహా వృక్షమైనట్టుగా అక్కడ బీఆర్ఎస్, బీజేపీలకు సరైన నాయకుడే లేడు. వాస్తవానికి బీజేపీకి అక్కడ ఏమాత్రం పట్టులేదు కానీ బీఆర్ఎస్‌కు బాగానే ఉంది. కానీ పార్టీ అధిష్టానం లింగాల కమల్‌రాజును మాత్రమే అక్కడి నుంచి బరిలో దింపుతోంది. ఆయనకు నియోజకవర్గంపై ఏమాత్రం పట్టు లేదు సరికదా. బడా నేతలకు మర్యాద ఇవ్వడం కూడా చేతకాదని అక్కడి వారంటారు. అందుకే ఆయన విజయం కోసం పార్టీ నేతలు సహా కేడర్ వరకూ ఎవరూ పని చేయరు.
సాయపడిన కమ్యూనిటీ..
మొత్తానికి విపక్షాలకు అక్కడ గట్టి నాయకుడు లేకపోవడంతో భట్టి చేసిందే శాసనమవుతోంది. భట్టిపై ఉన్న వ్యతిరేకతే టీడీపీకి వరంలా మారింది. మరొక రెండు చోట్ల కూడా అక్కడి అభ్యర్థులు పట్టు బిగించి ఉంటే తప్పక విజయం సాధించేవారు. ఇలాంటి ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటేయకుంటే రావల్సిన ప్రయోజనాలు అందవేమోనన్న భయం ప్రజల్లో ఉంటుంది. దానిని కూడా దాటుకుని టీడీపీ విజయం సాధించడం విశేషం. పైగా కమ్యూనిటీ కూడా రేవతికి బాగా సాయపడిందనే చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మైక్ అందుకుంటే.. అధికార పార్టీ మీద పడిపోవాల్సింది పోయి టీడీపీ మీద పడిపోతుంటారు. మొత్తానికి మధిర కేసీఆర్‌కు మంచి అస్త్రాన్ని అందించినట్టే. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఇలాగే కొనసాగనిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ రాజ్యం వచ్చినా రావొచ్చంటారేమో చూడాలి.
ప్రజావాణి చీదిరాల