Phone Tapping Case: సుప్రీం కీలక ఆదేశాలు.. మరోసారి సంచలనంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..
తెలంగాణ (Telangana)లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం (Phone Tapping Case) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో కేసు దర్యాప్తునకు..

తెలంగాణ (Telangana)లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం (Phone Tapping Case) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో కేసు దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని తెలంగాణ ప్రభుత్వ (Telangana Government) తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలోనే సిట్ అడిగిన సమాచారం ఆయన ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు ఇవాళ (మంగళవారం) ఆదేశాలు జారీ చేసింది. క్లౌడ్ (Cloud), యాపిల్ క్లౌడ్ (Apple Cloud) సమాచారం ఇవ్వాల్సిందేనని జస్టిస్ బీవీ నాగరత్నం (Justice BV Nagaratnam), జస్టిస్ ఆర్ మహదేవన్ (Justice R Mahadevan) ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Tushar Mehta), సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddharth Luthra) వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించడం లేదు.. కాబట్టి ఆయన్ను కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు అప్పగించాలని కోర్టును కోరారు.
కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే నిజాలు బయటికి వస్తాయని ప్రభుత్వ తరుఫు న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్కుల్లోని డేటా ధ్వంసం చేయడమే కాకుండా... వాటి స్థానంలో కొత్తగా 50 హార్డ్ డిస్కులు (Hard Disks) అక్కడ పెట్టారని.. ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ ఇవ్వడం లేదన్నారు. నక్సలైట్ల పేరిట.. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు టాప్ చేశారని.. ఆపై డేటా మొత్తం డిలీట్ చేసి డివైసెస్ ఇచ్చారని కోర్టుకు సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ప్రభాకర్‌రావు తరఫున శేషాద్రి నాయుడు తన వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారంటూ ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటపెట్టడంతో రాష్ట్రాన్ని కుదిపేసింది. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బయటకు వచ్చింది.
తీగ లాగితే డొంక కదిలినట్టుగా.. పోలీసుల విచారణలో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి కొన్ని పరికరాలను కొనుగోలు చేసినట్టు తేలింది. ఫోన్ ట్యాపింగ్ కోసం మాత్రం విచారణలో హైదరాబాద్ టెక్నాలజీనే వాడినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. మొత్తంగా అంటే తెలంగాణ వ్యాప్తంగా 1200 మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నింటినీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన 45 నిమిషాల్లోనే సీసీ కెమెరాలు చెరిపేసినట్టు ఈ కేసులో మరో నిందితుడు ప్రణీత్ రావు వెల్లడించారు. అలాగే కన్జర్వెన్స్ ఇన్నోవేషన్ లాబ్స్‌కి చెందిన వారిని పిలిచి వారిచ్చిన సర్వర్లు, హార్డ్ డిస్క్‌లను వారికి ఇచ్చేసినట్టు తెలిపారు. అలాగే కంప్యూటర్‌కి ఉన్న 50 హార్డ్ డిస్క్‌లను సైతం తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని పెట్టినట్టు ప్రణీత్ రావు పేర్కొన్నారు. మొత్తానికి ఇవాళ సుప్రీం నుంచి ఈ కేసులో కీలక ఆదేశాలు అందాయి.