Politics

KCR: కథ మారింది.. ఫామ్‌హౌస్ టు పోరుబాట

‘తుపానుకు ముందు వచ్చే ప్రశాంతత’ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ చేసింది అదేనా? ప్రశాంతతను వీడి.. ఇప్పుడు గర్జనకు సిద్ధమవతున్నారా? ఈ రోజు వ‌ర‌కు ఒక క‌థ‌.. రేప‌టి నుంచి మ‌రో క‌థ‌..

KCR: కథ మారింది.. ఫామ్‌హౌస్ టు పోరుబాట

‘తుపానుకు ముందు వచ్చే ప్రశాంతత’ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ చేసింది అదేనా? ప్రశాంతతను వీడి.. ఇప్పుడు గర్జనకు సిద్ధమవతున్నారా? ఈ రోజు వ‌ర‌కు ఒక క‌థ‌.. రేప‌టి నుంచి మ‌రో క‌థ‌.. అనే వ్యాఖ్యలు దీనిని ఉద్దేశించేనా? లేదంటే.. కొండంత రాగం తీసి చివరకు పిచ్చగుంటల పాట పాడుతారా? ఏమో ఏదైనా జరగవచ్చు. ఏది ఏమైనా కేసీఆర్ తన వైట్ హౌస్‌ అదేనండీ.. ఎరవల్లి ఫామ్‌హౌస్‌ను వీడి కేసీఆర్ బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారంటూ టాక్ గట్టిగానే నడుస్తోంది.

కేసీఆర్ మారిపోయారు.. జనబాహుళ్యంలోకి రాకుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకున్నారు. తాను రంగంలోకి దిగితే తప్ప బీఆర్‌ఎస్‌కు మంచి రోజులు వచ్చే సూచనలు కనుచూపు మేరలో లేవని గ్రహించారో ఏమో కానీ మొత్తానికి అయితే ఫామ్ హౌస్‌ని వీడి.. జనంలోకి రానున్నారు. ఈ క్రమంలోనే హెచ్చరికలు సైతం చేశారు. అటు కేంద్రాన్ని.. ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి జలాల విషయంలో రాజీ పడేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు వ‌ర‌కు ఒక క‌థ‌.. రేప‌టి నుంచి మ‌రో క‌థ‌.. అంటూ తేల్చి చెప్పేశారు.

ఊరూ వాడా ఏకం చేస్తాం..

"తడక చాటున ఉన్నంత సేపే దాగుడు మూతలు.. బయటకు వస్తేనే కదా అసలు ఆట".. కానీ ఎందుకో కేసీఆర్ మాత్రం బయటి ప్రపంచాన్ని చూడలేదు. పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోయారో ఏమో కానీ.. చాలా కాలం పాటు నాలుగు గదులకే పరిమితమయ్యారు. పలు సందర్భాల్లో ఆయన ఫామ్ హౌస్‌ను వీడి బయటకు వచ్చినా కూడా తన పని తాను చేసుకుపోయారే కానీ పెదవి విప్పి మాట్లాడింది లేదు. మౌనమే తన భాష అన్నట్టుగా వ్యవహరించారు. తన పని తాను చేసుకుని పోయారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కథను మార్చి రాసేందుకు సిద్ధమయ్యారు. ‘‘ద‌ద్దమ్మ ప్ర‌భుత్వం(కాంగ్రెస్‌) మాదిరి మేం చూస్తూ కూర్చోలేం. ఉద్య‌మిస్తాం. ఊరూ వాడా ఏకం చేస్తాం. అంద‌రినీ క‌దిలిస్తాం“ అని తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని మీడియాతో కేసీఆర్ ముచ్చటించారు.

బీఆర్ఎస్‌ బొందల గడ్డకే..

ప్రధానంగా కేసీఆర్ పాలమూరు జిల్లాతో తన సమర శంఖాన్ని పూరించనున్నట్టుగా తెలుస్తోంది. ఆగితే అంతటితో ఖేల్ ఖతమే.. అడుగు వేస్తేనే కదా.. కేసీఆర్ ఒకరు ఉన్నారని ప్రపంచానికి తెలిసేది. ఇప్పటి వరకూ తెలంగాణలో ప్రతిపక్షం ఉందా? లేదా? అన్నట్టుగా ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమైనా వ్యాఖ్యలు చేసినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. మాజీ మంత్రి హరీష్ రావు గట్టిగానే పోరాడుతున్నారు కానీ ఆ పోరాటానికి తగిన మైలేజ్ అయితే రావడం లేదు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. ఎన్నికలు ఏవొచ్చినా గతంలో అయితే ఇతర పార్టీలను చావుదెబ్బ రుచి చూపించిన పార్టీ.. ఇప్పుడు తన పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇకపై కేసీఆర్ బయటకు రాకుంటే ఆయన భాషలోనే చెప్పాలంటే.. బీఆర్ఎస్‌ బొందల గడ్డకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒకరకంగా చెప్పాలంటే తొలిసారిగా మాటల తూటాలను వదిలారు.

సందకాడ మాటలు కాకుంటే..

ముందు వెళ్ళే ముసలమ్మకు వెనక వెళ్ళే ముసలమ్మే సాక్షి అన్నట్టుగా ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ తెలంగాణ‌కు ద్రోహం చేసింద‌ని.. ఇప్పుడు కూడా అదే చేస్తోందని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. అసలు రాష్ట్రానికి వ‌చ్చే నీళ్ల‌లో వాటాను తెగ్గోసుకోవడమేంటని ధ్వజమెత్తారు. అది తెలంగాణకు అన్యాయం చేయ‌డం కాదా? అని ప్రశ్నించారు. గోదావ‌రిలో 40టీఎంసీల వాటా చాల‌ని కేంద్రానికి ఎలా లేఖ రాస్తార‌ని పేరు ఎత్త‌కుండానే సీఎం రేవంత్ రెడ్డిని కేసీఆర్ కడిగి పారేశారు. కాంగ్రెస్ స‌ర్కారును ద‌ద్ద‌మ్మ ప్ర‌భుత్వంగా అభివర్ణించారు. ఈ క్రమంలోనే పాలమూరుపై కేసీఆర్ ఎక్కడి లేని ప్రేమను కుమ్మరించేశారు. పాలమూరు ప్రజలు ఏం అన్యాయం చేశారని వారిని పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. చాలా సమయమిచ్చామని.. ఇక మీదట వేచి చూసేది లేదని.. ఉద్యమం చేపట్టక తప్పదన్నారు. ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఇక మీదట మరో లెక్క అని కేసీఆర్ తేల్చేస్తున్నారు. ఇవి సందకాడ మాటలు కాకుంటే బాగుంటుందనేది బీఆర్ఎస్ కార్యకర్తల భావన నదీ జలాలపై ఆయన వ్యవహార శైలి చూస్తుంటే.. "మునిగినా తేలినా నీటిలోనే" అన్నట్టుగా ఉంది. మరి ఇదే జోష్‌ను కంటిన్యూ చేస్తారా? లేదంటే తిరిగి యూటర్న్ తీసుకుని ఫామ్ హౌస్ బాట పడతారా? అనేది తెలియాల్సి ఉంది.

ప్రజావాణి చీదిరాల

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 22, 2025 4:45 AM