Kishan Reddy: ఉట్టికి ఎగరలేనయ్య.. స్వర్గానికి ఎగురుతాడా?
బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠం వేట మొదలైంది. ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం వచ్చే ఏడాది ఎన్నికలకు సన్నద్ధమయ్యే క్రమంలో, ఈ నెలలోనే కొత్త అధ్యక్షుడిని నియమించాలని ప్లాన్ చేస్తున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠం వేట మొదలైంది. ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం వచ్చే ఏడాది ఎన్నికలకు సన్నద్ధమయ్యే క్రమంలో, ఈ నెలలోనే కొత్త అధ్యక్షుడిని నియమించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ రేసులో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు వినిపిస్తుండటంపై రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా సొంత పార్టీలోనే, రెండు నాల్కల మాట వినిపిస్తోంది. కిషన్ రెడ్డికి పార్టీ సంస్థాగత అనుభవం, ప్రధానితో సాన్నిహిత్యం వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ.. ఆయన రాజకీయ ప్రయాణం, ఇటీవల ఫలితాలు చూస్తే, ఈ రేసులో ఉండడం ‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా?’ అనే సామెతను గుర్తు చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కిషన్ రెడ్డికి బీజేపీలో దాదాపు అన్ని పదవుల అనుభవం ఉంది. ఆయన భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇవన్నీ మంచి అనుభవాలే. కానీ, నాయకత్వ సామర్థ్యం అనేది కేవలం పాత పదవుల లెక్క కాదు. ఆయన కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఉన్నప్పటికీ, ఆయన ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోలేకపోయారు. ఒకప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా తెలంగాణలో పార్టీ ‘కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్లు’గా ఏమాత్రం బలోపేతం కాలేదనేది బహిరంగ సత్యం. జూబ్లీహిల్స్‌నే గెలిపించలేకపోయిన కిషన్‌రెడ్డి.. దేశాన్ని ఏం చక్కదిద్దుతారనే సెటైర్లు విపక్షాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి.
అధిష్టానం ట్విస్ట్.. కిషన్ రెడ్డికి ఛాన్స్!
అలాంటిది, రాబోయే కాలంలో పార్టీకి కంచుకోటల్లాంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, కేరళ వంటి కఠినమైన చోట్ల పార్టీని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న అధిష్టానం.. తన సొంత నియోజకవర్గంలో కూడా పార్టీని గెలిపించలేని నాయకుడికి జాతీయ పగ్గాలు అప్పగిస్తే పరిస్థితేంటి? మొత్తానికి బీజేపీ మట్టిగొట్టుకుపోతుందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. దక్షిణాదిలో ఉన్న కాస్తో కూస్తో పార్టీ ఇమేజ్ దెబ్బతినడం ఖాయమని విపక్షాలు సైతం అంటున్నాయి. అయితే బీజేపీ రాజకీయాలు ఎప్పుడూ ఊహలకు అందవు. అధిష్టానం ఎంచుకునే నాయకుడు సౌమ్యుడిగా, వివాదాలకు దూరంగా ఉండాలని చూస్తోంది. కిషన్ రెడ్డి ఆ కోవకే చెందుతారు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా, ఆర్ఎస్ఎస్ నుంచి నేటి వరకూ మంచి ఆప్తుడిగా ఆయనకు పేరుంది. రేసులో ధర్మేంద్ర ప్రధాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేందర్ యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్ వంటి బలమైన పోటీదారులు ఉన్నారు. మహిళలకు ఇవ్వాలనుకుంటే, నిర్మలా సీతారామన్, పురందేశ్వరి, వనతి శ్రీనివాసన్ వంటి దక్షిణాది బలమైన మహిళా నేతలు కూడా లైన్‌లో ఉన్నారు.
ఏకాకిగా పోరాడిన అభ్యర్థి!
తుది నిర్ణయం ఏకాభిప్రాయం ద్వారా, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మోదీ, షా ద్వయం తీసుకుంటారు. గతంలో రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల నియామకంలో ఎవరి ఊహకు అందని పేర్లను తెరపైకి తెచ్చిన చరిత్ర బీజేపీకి ఉంది. మరి ఈసారి కూడా అదే విధంగా ‘ఎవరు అవునో, ఎవరు కాదో’ తెలియని విధంగా ఎవరి ఊహకు అందని ట్విస్ట్ ఇస్తుందో చూడాలి. ఏదేమైనా, ఒకప్పుడు ‘జాతీయ స్థాయికి’ ఎదగడానికి అవకాశం దక్కని కిషన్ రెడ్డి, ఈసారి ఏకంగా జాతీయ అధ్యక్ష రేసులో ఉండడం విచిత్రమే. కానీ, తుది నిర్ణయం తీసుకునేది మోదీ-షా కాబట్టి, ‘ఏకాకిగా పోరాడిన అభ్యర్థి’ని కాకుండా, గెలుపు రథాన్ని నడిపించగలిగే సారథిని ఎంపిక చేస్తేనే, బీజేపీ లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే, ఈ రేసులో కిషన్ రెడ్డి పేరు వినిపించడం కేవలం నామినేషన్ల కోసమే అన్న అపవాదు మూటకట్టుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజావాణి చీదిరాల