Politics

Actor Sivaji: శివాజీ అనవసర రాద్ధాంతం.. స్పందిస్తున్న వైసీపీ శ్రేణులు..

నెగిటివ్ రివ్యూలు ఇచ్చి సక్సెస్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారంటూ వైసీపీ శ్రేణులపై శివాజీ మండిపడ్డారు. అసలు సక్సెస్‌ను సక్సెస్‌ను అడ్డుకునేంత సత్తా ఎవరికి ఉంది? నెగిటివ్ రివ్యూలు సినిమా సక్సెస్‌ను అడ్డుకోగలవా?

Actor Sivaji: శివాజీ అనవసర రాద్ధాంతం.. స్పందిస్తున్న వైసీపీ శ్రేణులు..

నటుడు శివాజీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారా? లేని పోని వార్నింగ్‌లతో మరింత రచ్చ చేసుకుంటున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. ఆయన తాజా చిత్రం ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ ఇటీవలే విడుదలై యావరేజ్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు ఇచ్చి సక్సెస్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారంటూ వైసీపీ శ్రేణులపై శివాజీ మండిపడ్డారు. అసలు సక్సెస్‌ను సక్సెస్‌ను అడ్డుకునేంత సత్తా ఎవరికి ఉంది? నెగిటివ్ రివ్యూలు సినిమా సక్సెస్‌ను అడ్డుకోగలవా? పోనీ అడ్డుకోగలవు అనుకుంటే పాజిటివ్ రివ్యూ అనేది సినిమాకు ఎక్కడ వచ్చింది?

శివాజీకి ఎంతమేర సబబు?

ఏ ప్రముఖ వెబ్‌సైట్ అయినా కూడా ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ చిత్రానికి పూర్తి స్థాయిలో పాజిటివ్ రివ్యూ ఇచ్చిందా? ఇవన్నీ సమీక్షించుకోవాలి కదా. పోలోమని పేటీఎం బ్యాచ్ అంటూ వైసీపీపై పడిపోయి అనవసరంగా వాళ్లని పైకి లేపడం శివాజీకి ఎంతమేర సబబు? ఓ వీడియో విడుదల చేసి మరీ ఆయన వార్నింగ్ ఇవ్వడమనేది ఏమీ లేని చోట అగ్గి రాజేయడం కాదా? అసలు కథే సరిగా లేదంటే దానిని రెండు గంటల పాటు సాగదీసి మరీ జనాలపైకి వదిలారు. ఇటీవలి కాలంలో శివాజీ మంచి కథలను ఎంచుకుంటున్నారు. కానీ తాను తీయాలనుకున్న కథ విషయంలో మాత్రం తప్పులో కాలేశారనడంలో సందేహమే లేదు.

లేనిపోని క్రెడిట్ ఇస్తున్నారా?

పైగా వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి తన జోలికి రావొద్దని.. అధికారంలో ఉన్నప్పుడే తననేం చేయలేకపోయారని వార్నింగ్. పాపం ఆయనేదో బెంగుళూరులోని ఎలహంక ప్యాలెస్‌లో రెస్ట్ తీసుకుంటుంటే ఆయన్ను లాగి లేని పోని క్రెడిట్ శివాజీ ఇస్తున్నారని అనిపించడం లేదు? అసలు సినిమా అద్భుతంగా ఉంటే ఎవరు నెగిటివ్ రివ్యూ ఇస్తే మాత్రం ఏమవుతుంది? ‘పుష్ప’ చిత్రానికి కూడా ముందు నెగిటివ్ రివ్యూసే వచ్చాయి. సినిమా మౌత్ టాక్‌తో ఊపందుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఒక సినిమా బాగుంటే దానిని నెగిటివ్ రివ్యూ ఏం చేయలేదనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. పేటిఎం బ్యాచ్‌లు తన సినిమాపై దుష్ప్రచారం చేస్తే కథ బాగుండి ఉంటే ఏం జరుగుతుంది? వారి టైమ్ వేస్ట్ అయ్యేది తప్ప ఏం ఒరిగేది కాదు.

రాజకీయాల ప్రస్తావన ఎందుకు?

అసలు శివాజీ ఈ విషయాలన్నింటినీ పక్కనబెట్టి పేటీఎం బ్యాచ్‌లంటూ ఎందుకు రచ్చ చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. దీనిపై వైసీపీ శ్రేణులు సైతం స్పందిస్తున్నాయి. తామేమీ సినిమా జోలికి రాలేదని.. బిగ్‌బాస్ టైంలో శివాజీని చూసి ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయామని చెబుతున్నారు. ‘90స్’ వంటి చిత్రాలను ఆదరించినప్పుడు ఈ సినిమాపై దుష్ప్రచారం ఎందుకు చేస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ చేయమంటే చెప్పండి చేస్తామంటూ రివర్స్ ప్రశ్నిస్తున్నారు. పైగా మీరు నటులు కాబట్టి సినిమాలను చూసుకోండి.. రాజకీయాల ప్రస్తావన మీకెందుకంటూ శివాజీకి ఉచిత సలహాలు సైతం ఇస్తున్నారు. మొత్తానికి జగన్‌పై సీబీఐ కేసులున్నాయి కాబట్టి ఆయనను రాజకీయాల నుంచి తప్పించాలని సైతం ప్రధాని నరేంద్రమోదీని కోరుతామని శివాజీ అన్నారు. ఈ వ్యవహారం చూడబోతే ఇంతటితో ఆగేలా లేదు. చినికి చినికి గాలి వానలా మారే సూచనలే కనిపిస్తున్నాయి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 9, 2026 3:38 PM