YS Sharmila: షర్మిలకు 'రాజ్య'యోగం.. అన్న వదలిన బాణం.. ఢిల్లీకి అస్త్రం!
రాజకీయాల్లో 'టైమ్' ఎప్పుడు ఎవరికి ఎలా కలిసి వస్తుందో అంత ఈజీగా చెప్పడం కష్టం. నిన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాష్ట్ర రోడ్లపై తిరుగుతూ.. సొంత అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల, ఇప్పుడు నేరుగా పార్లమెంటు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.
రాజకీయాల్లో 'టైమ్' ఎప్పుడు ఎవరికి ఎలా కలిసి వస్తుందో అంత ఈజీగా చెప్పడం కష్టం. నిన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాష్ట్ర రోడ్లపై తిరుగుతూ.. సొంత అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల, ఇప్పుడు నేరుగా పార్లమెంటు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. అన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న ఆమె, ఇప్పుడు అదే అన్నను రాజకీయంగా దెబ్బకొట్టి, కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఆప్తురాలిగా మారి 'రాజ్యసభ' బెర్త్ ఖరారు చేసుకున్నట్లు గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఆ ఓటమి వెనుక.. అందని 'రాజ్య' ఫలం?
2024 ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల దారుణ పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి. కానీ, ఆమె ఓటమి వెనుక ఒక పెద్ద గెలుపు దాగి ఉందనేది విశ్లేషకుల మాట. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసును, ఆస్తుల గొడవలను రచ్చకీడ్చి వైసీపీ ఓటు బ్యాంకును గండి కొట్టడంలో ఆమె సక్సెస్ అయ్యారు. జగన్ అధికారం కోల్పోవడానికి షర్మిల చేసిన 'పోరాటం' కీలక పాత్ర పోషించిందని అధిష్టానం నమ్ముతోంది. అందుకే, అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఇప్పుడు ఆమెకు రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు తెలుస్తోంది.
హస్తిన పిలుపు.. సీటు కోసమేనా?
మంగళవారం రాహుల్ గాంధీ నుంచి పిలుపు రావడం, షర్మిల హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం వెనుక పెద్ద కథే నడుస్తోందని తెలియవచ్చింది. ప్రస్తుతం తెలంగాణ లేదా కర్ణాటక కోటా నుంచి ఆమెను రాజ్యసభకు పంపేందుకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం. వాస్తవానికి ఏపీలో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా, పక్క రాష్ట్రాల బలాన్ని వాడుకుని షర్మిలను 'పెద్దల సభ'కు పంపడం ద్వారా వైఎస్ వారసత్వాన్ని జాతీయ స్థాయిలో వాడుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
ఏపీ కాంగ్రెస్‌లో కొత్త సమీకరణాలు!
ఒకవైపు రాజ్యసభ బెర్త్ ఖరారు అవుతుంటే, మరోవైపు ఏపీ కాంగ్రెస్ పగ్గాల విషయంలో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. షర్మిల వైఖరిపై సొంత పార్టీ సీనియర్లు అసంతృప్తిగా ఉన్న తరుణంలో, ఆమెను ఢిల్లీకి పరిమితం చేసి ఏపీ బాధ్యతలను ఒక మాజీ ఉన్నతాధికారికి అప్పగించే ఆలోచనలో హైకమాండ్ ఉందట. గతంలో సొంత పార్టీ పెట్టి విఫలమైన ఒక కీలక సామాజిక వర్గానికి చెందిన నేత (కాపు సామాజిక వర్గం), తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే షరతుతో పీసీసీ పీఠం ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే, అటు షర్మిలకు పదవి.. ఇటు ఏపీలో కొత్త ముఖంతో పార్టీకి ఊపిరి పోయడం.. ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.
జాక్ పాట్ తగిలేనా?
చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం రాజకీయాల్లో కామనే అయినా, తండ్రి రాజశేఖర్ రెడ్డికి సైతం సాధ్యం కాని రీతిలో తన కుమార్తెను రాజ్యసభకు పంపడం వైఎస్ కుటుంబ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. అప్పట్లో జగన్ ఎంపీగా, సీఎంగా గెలిచారు కానీ.. షర్మిలను చట్టసభలకు పంపలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆ లోటును తీరుస్తూ ఆమెకు 'రాజ్యసభ' జాక్ పాట్ ఇస్తోంది. మరి ఈ పదవితో షర్మిల ఏపీ రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపుతారో, ఢిల్లీలో ఏ స్థాయిలో గళం విప్పుతారో వేచి చూడాలి!
ప్రజావాణి చీదిరాల