Bandla Ganesh: షాద్‌నగర్ టు తిరుమల.. బండ్లన్న అభిమాన యాత్ర..
తాను చంద్రబాబుకు వీరాభిమానిని అంటూనే రాజకీయాలకు దూరమంటున్నారు. ఒక పొలిటికల్ లీడర్, సీఎం చంద్రబాబుపై అభిమానం ఉందట.. కానీ పొలిటిక్స్‌తో సంబంధం లేదట.
‘ప్రతి అడుగు.. చంద్రబాబు ప్రతి అభిమాని అడుగు.. రాజకీయ యాత్ర కాదు’ అంటూ బండ్లన్న అదేనండీ మన సినీ నిర్మాత బండ్ల గణేష్ అడుగులు ప్రారంభించారు. షాద్ నగర్ టు తిరుమల యాత్రకు శ్రీకారం చుట్టారు. తాను చంద్రబాబుకు వీరాభిమానిని అంటూనే రాజకీయాలకు దూరమంటున్నారు. ఒక పొలిటికల్ లీడర్, సీఎం చంద్రబాబుపై అభిమానం ఉందట.. కానీ పొలిటిక్స్‌తో సంబంధం లేదట. అవునంటున్నారో.. కాదంటున్నారో ఏమీ అర్థం కాకుండా మాట్లాడుతున్నారు బండ్ల గణేష్.
‘సంకల్ప యాత్ర’ పేరిట షాద్ నగర్ టు తిరుమలకు పాదయాత్ర నేడు ప్రారంభించారు. వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో బండ్ల గణేష్ మొక్కకున్నారట. ఆ మొక్కను తీర్చుకునేందుకు ఇప్పుడు సిద్ధమయ్యారు. ఇది తన రాజకీయ యాత్ర కాదని.. దేవుడికి మొక్కు చెల్లించేందుకు చంద్రబాబుపై అభిమానంతో చేస్తున్న యాత్ర అని పేర్కొన్నారు. తన యాత్ర అభిమానంతో కూడుకున్నదే కానీ ఏ రాజకీయ పార్టీకీ సంబంధం లేదని బండ్ల గణేష్ స్పష్టం చేశారు.
తనకు ఉదయాన్నే 4.30 గంటలకే నిద్ర లేచే అలవాటుందని.. ఒకరోజు అలా నిద్ర లేవగానే టీవీ ఆన్ చేస్తే చంద్రబాబు అరెస్ట్ వార్త వచ్చిందన్నారు. అది చూడగానే షాక్ అయ్యానని బండ్ల గణేష్ తెలిపారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అయితే చంద్రబాబును గుంటూరుకు తీసుకొచ్చి బెయిల్ ఇస్తారని భావించారట. కానీ రాజమహేంద్రవరం జైలుకు పంపించడం.. ఆపై రోజులు గడిచేకొద్దీ తనకు జైల్లోనే చంద్రబాబును ఏమైనా చేస్తారేమోనన్న టెన్షన్ మొదలైందన్నారు.
చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే క్షణం కోసం ఎంతగానో ఎదురు చూశానని బండ్ల గణేష్ తెలిపారు. కోర్టు వాయిదా ఉన్నప్పుడల్లా తాను కూడా సుప్రీంకోర్టుకు వెళ్లానని పేర్కొన్నారు. కేవలం చంద్రబాబుకు బెయిల్ వచ్చిందనే వార్త మొదట వినేందుకే ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టులో కూర్చునేవాడినని బండ్ల గణేష్ తెలిపారు. జైలు నుంచి ఆయన తిరిగి వస్తే తిరుమలకు పాదయాత్రగా వస్తానని కలియుగదైవం వేంకటేశ్వర స్వామిని మొక్కుకున్నానని పేర్కొన్నారు. దేవుడి ఆశీస్సులతో 52 రోజుల తర్వాత చంద్రబాబు విడుదలై తెలుగు ప్రజలకు తానున్నానంటూ ఎంతో ఉత్సాహంతో బయటకు వచ్చారన్నారు. చంద్రబాబు వంటి వ్యక్తి తెలుగుజాతికి చాలా అవసరమని.. కాబట్టి తన యాత్రను రాజకీయంగా చూడటం కానీ విమర్శలు వంటివి చేయవద్దని బండ్ల గణేష్ కోరారు. మొత్తానికి బండ్ల గణేష్ ఓ యాత్రకు శ్రీకారమైతే చుట్టారు.
ప్రజావాణి చీదిరాల