CM Revanth Reddy: రేవంత్ ‘బైపోల్స్’ వ్యూహం.. ‘కారు’కు స్టీరింగైనా మిగులుతుందా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubleehills Bypoll) విజయం ఇచ్చిన బూస్ట్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇక తగ్గేదేలే అన్నట్టుగా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubleehills Bypoll) విజయం ఇచ్చిన బూస్ట్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇక తగ్గేదేలే అన్నట్టుగా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో వరుసగా ఉప ఎన్నికలకు తెర తీస్తూ, పదేళ్ల అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకునే నయా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress)లోకి వచ్చిన ఎమ్మెల్యేల సిట్టింగ్ సీట్లపైనే ఉప ఎన్నికల అస్త్రం సంధించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే మొదట ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ వంటి కీలక సెగ్మెంట్లలో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నయా స్ట్రాటజీకి ఏఐసీసీ (AICC) నుంచి పూర్తి మద్దతు లభించగా, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.
ఆరంభం ఇక్కడ్నుంచే..
తొలి విడుతగా ఖైరతాబాద్ (Danam Nagendar), ఆ తర్వాత స్టేషన్ ఘన్‌పూర్ (Kadiyam Srihari) నియోజకవర్గాలను ఉప ఎన్నికల కోసం ఎంపిక చేసుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన దానం నాగేందర్, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) కాంగ్రెస్ బీ ఫామ్‌పై పోటీ చేయడం, అలాగే స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి బీఆర్ఎస్ టికెట్ తెచ్చుకుని ప్రచారం చేయడం టెక్నికల్‌గా చిక్కులు సృష్టించే అవకాశం ఉంది. టెక్నికల్‌గా రద్దు కాకముందే రాజీనామా చేసి, కాంగ్రెస్ బీ ఫామ్‌పై పోటీ చేసి గెలవాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivasa Reddy) కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని, రాజీనామా చేసి కాంగ్రెస్ బీ ఫామ్‌పై పోటీ చేసి గెలుస్తానని అధిష్టానానికి హామీ ఇస్తున్నట్లు గాంధీ భవన్‌లో చర్చ జరుగుతోంది.
పక్కా వ్యూహంతో..!
పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాజకీయంగా మరింత పట్టు సాధించాలని, అలాగే పార్టీ పటిష్టతను చాటుకోవాలని సీఎం రేవంత్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారని తెలుస్తున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు విడుతల వారీగా, వ్యూహాత్మకంగా ఉప ఎన్నికలను నిర్వహించేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. గతంలో కేసీఆర్ (KCR) కూడా ఇదే ప్లాన్‌ను అమలు చేసి, ఎన్నికలకు ఎన్నికలకు మధ్య గ్యాప్‌లో విజయం సాధించి, తమ పార్టీనే ప్రజలు ఆదరిస్తున్నారనే సంకేతాలను చూపారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా ఇప్పుడు అదే లైన్‌లో సాగుతున్నదనేది రాజకీయ పండితుల అభిప్రాయం.
కారు పరిస్థితేంటి?
ప్రస్తుతం జరగబోయే బైపోల్స్ అన్నీ బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీట్లే. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి, కారు పార్టీ బొక్క బోర్లా పడింది. ఈ సమయంలో ఉప ఎన్నికల సునామీకి తెర లేపితే, పార్టీకి మరింత నష్టం జరుగుతుందనే ఆందోళన బీఆర్‌ఎస్‌లో ఉంది. రేవంత్ రెడ్డి దూకుడు వ్యూహాన్ని బీఆర్‌ఎస్ ఎలా ఎదుర్కొంటుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పార్టీలో దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో ఆలస్యం జరుగుతుండగా, కనీసం ఈ ఉప ఎన్నికలు ఫిక్స్ అయితే అయినా, కేసీఆర్ బయటికి వస్తారా?, లేదా? అనే చర్చ బీఆర్‌ఎస్ వర్గాల్లో నడుస్తోంది. హస్తానికి ఎదురెళ్లేందుకు కారును రిపేర్ చేసేదెప్పుడు అనే ప్రశ్న ఆ పార్టీ కార్యకర్తలను వేధిస్తోంది. బీఆర్‌ఎస్ వ్యూహం లేకుండా ఉప ఎన్నికలకు వెళ్తే, ఆ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రతికూలంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెంచడానికి, ప్రజల్లో బీఆర్‌ఎస్ పట్ల వ్యతిరేకతను మరింత బలంగా చూపడానికి ఈ ఉప ఎన్నికలు కీలకంగా మారతాయని అధిష్టానం భావిస్తోంది. ప్రభుత్వంలో ఉన్నందున ప్రజలు తమవైపే ఉంటారనే బలమైన నమ్మకంతో కాంగ్రెస్ దూసుకుపోతుండగా, దానికి దీటుగా బీఆర్‌ఎస్ ఎలా బదులిస్తుందో వేచి చూడాలి.
ప్రజావాణి చీదిరాల