Revanth Reddy: ఎన్టీఆర్, చంద్రబాబును గట్టిగా వాడేసిన రేవంత్..
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జూబ్లీహిల్స్ స్థానంలో విజయం సాధించేందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలన్నింటినీ బయటకు తీస్తున్నారు. ఎవరిని వాడాలో వారిని రేవంత్ (Revanth) గట్టిగానే వాడేస్తున్నారు.
తెలంగాణ (Telangana)లో ఇప్పుడు హీటెక్కిస్తున్న అంశం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubleehills Bypoll). ఇది పక్కాగా బీఆర్ఎస్ (BRS) స్థానమేనని చెప్పాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్ (Congress) గెలిచింది కూడా ఒక్కసారే. అది కూడా 2009లో.. ఆ సమయంలో పీజేఆర్ (PJR) కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) ఆ స్థానం నుంచి విజయం సాధించారు. ఆ తరువాతి నుంచి అక్కడ బీఆర్ఎస్ విజయం సాధిస్తూ వస్తోంది. మూడు పర్యాయాలు సైతం మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు ఆయన మరణించడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈసారి ఎలాగైనా ఆ స్థానాన్ని దక్కించుకోవాలని శతవిధాలుగా ప్రయత్నిస్తోంది.
ఎవరిని వాడాలో..
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జూబ్లీహిల్స్ స్థానంలో విజయం సాధించేందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలన్నింటినీ బయటకు తీస్తున్నారు. ఎవరిని వాడాలో వారిని రేవంత్ (Revanth) గట్టిగానే వాడేస్తున్నారు. జూబ్లీహిల్స్ అంటే సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. ఈ క్రమంలోనే రేవంత్.. సీనియర్ ఎన్టీఆర్ (NTR)తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu)ను సైతం వాడేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం రేవంత్ ప్రచారం చేపట్టారు. అలాగే సభ నిర్వహించారు. ఈ సభకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే సభకు వచ్చిన జనాలను చూసి జయాపజయాలను అంచనా వేయలేం. అయితే రేవంత్ మాత్రం తన వాగ్దాటితో ఆకట్టుకున్నారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబు ప్రస్తావన సైతం తీసుకురావడం విశేషం.
స్వయంగా వచ్చి ప్రారంభిస్తా..
ఎన్టీఆర్ ఆదర్శప్రాయుడని. ఆయన భారీ వ్రిగ్రహాన్ని మైత్రీవనంలో ఏర్పాటు చేస్తామని.. తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానంటూ రేవంత్ హామీ ఇచ్చారు. అలాగే చంద్రబాబుపై సైతం పనిలో పనిగా ప్రశంసలు కురిపించారు. పీజేఆర్ నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మరణించారని.. అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ పెట్టకుండా సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు నెలకొల్పిన అలాంటి మంచి సంప్రదాయాన్ని బీఆర్ఎస్ పాటించకుండా మరణించిన వారి కుటుంబాలపై పోటీకి దిగిందన్నారు. అప్పట్లో బీఆర్ఎస్ కుటుంబం మీదనే పోటీకి దిగిన బీఆర్ఎస్ ఇప్పుడు నీతులు వల్లిస్తోందని రేవంత్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్‌లు ఒకటేనన్నారు.
రేవంత్ వ్యూహం ఫలిస్తుందా?
మొత్తానికి రేవంత్ రెడ్డి సెటిలర్స్‌ను ఇంప్రెస్ చేసేందుకు అయితే పక్కాగా ట్రై చేశారని చెప్పాలి. జూబ్లీహిల్స్ గురించి చెప్పాలంటే రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. వాటిలో ఒకటి సామాజిక వర్గం.. రెండవది సెటిలర్స్. ఈ రెండు విషయాలపై రేవంత్ బాగా ఫోకస్ చేసినట్టుగా ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. మరి రేవంత్ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి. ఎప్పుడో పీజేఆర్ ఉన్న సమయంలో జూబ్లీహిల్స్‌పై కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉండేది. ఆ తరువాత ఆయన తనయుడు గెలిచాడు. ఇక ఆ తరువాత కాంగ్రెస్ గెలిచిందే లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉంటుందో చూడాలి.
ప్రజావాణి చీదిరాల