రేవంత్ వెంట నడిచొచ్చేదెవరు.. జగన్ కథేంటి?
తెలుగోడు.. తెలంగాణ వ్యక్తి మంచి స్టెప్ అయితే వేశారు. మరి ఆ అడుగుకు ఎంతమంది తమ అడుగులు కలుపుతారనేదే ఇప్పుడు ఆసక్తికరం. ఇంతకీ ఎవరా తెలంగాణ వ్యక్తి అంటారా?

తెలుగోడు.. తెలంగాణ వ్యక్తి మంచి స్టెప్ అయితే వేశారు. మరి ఆ అడుగుకు ఎంతమంది తమ అడుగులు కలుపుతారనేదే ఇప్పుడు ఆసక్తికరం. ఇంతకీ ఎవరా తెలంగాణ వ్యక్తి అంటారా? ఆయనే సీఎం రేవంత్ రెడ్డి. ఏమాత్రం భేషజానికి పోకుండా.. సొంత పార్టీ, ప్రత్యర్థులన్న తేడా లేకుండా పేరు పేరు తీసి మరీ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. మరి ఆయనకు సహకారం అందిస్తారా? అంటే ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. మరి మిగిలిన వారి మాటేంటి? ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటేంటి?
ఎవరికి ఎవరో?
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), తెలంగాణ (Telangana)లో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandrababu).. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy).. ఇద్దరూ గురు శిష్యులు. కానీ, చంద్రబాబు- బీజేపీ (BJP)తో పొత్తులో ఉన్నారు. ఆ రకంగా చూస్తే చంద్రబాబు, రేవంత్‌లు ప్రత్యర్థులు. ఇక వైఎస్ జగన్ (YS Jagan) వచ్చేసి కాంగ్రెస్ తరుఫున సీఎంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను దాదాపు తొమ్మిదేళ్లపాటు పాలించిన దివంగత రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) కుమారుడు. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) సెంట్రల్‌లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి సపోర్ట్ ఇస్తారో.. బీజేపీకి ఇస్తారో తెలియదు. ఇప్పుడిదంతా ఎందుకంటే త్వరలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ఆ సమయంలో ఎవరు ఎవరికి సపోర్ట్? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరుఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy).. ఎన్డీఏ తరుఫున సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) పోటీ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రతి ఒక్కరినీ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఏపీ, తెలంగాణ పార్టీల అధినేతలను కోరారు.
అటు.. ఇటు!
తాజాగా మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న కూటమి ఒకవైపు.. రాజ్యాంగాన్నే రద్దు చేయాలని చూస్తున్న కూటమి మరోవైపు నిలిచాయన్నారు. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, జనసేన సహా అన్ని పార్టీలు మద్దతుగా నిలవాలని రేవంత్ పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్, కేసీఆర్‌లకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ (TDP), జనసేన (Janasena)లు బీజేపీతో పొత్తులో ఉన్నాయి కాబట్టి అవైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపే అవకాశమే లేదు. మరి వైసీపీ (YCP), బీఆర్ఎస్ (BRS), ఎంఐఎం (MIM) మాటేంటి? ఆ పార్టీల మద్దతు ఎవరికి లభిస్తుంది? అసలు ఎవరికైనా ఇస్తాయా? లేదంటే మీరు మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి అంటాయా? అప్పట్లో బీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపేస్తారంటూ టాక్ నడిచింది. ఆ ప్రకారంగానూ.. తెలంగాణలో ప్రత్యర్థి కాంగ్రెస్ కాబట్టి బీజేపీకి మద్దతు ఇస్తుందా? లేదంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)ను లిక్కర్ స్కాం కేసులో జైలు పాలు చేసిందన్న కోపంతో ఇండియా కూటమికి మద్దతు ఇస్తుందా? అనేది ఆసక్తికరం. ఇక ఎంఐఎం అయితే ఇండియా కూటమికే మద్దతు ఇవ్వాలి.. కానీ ఇస్తుందా?
మద్దతిచ్చేది ఎవరు?
వీళ్లందరినీ పక్కనబెట్టినా వైసీపీ మాటేంటి? ఒకప్పటి సీఎం కొడుకు.. పైగా రేవంత్ పిలుపును అందుకుని ఒకే సామాజిక వర్గం కాబట్టి సపోర్ట్ ఇస్తారా? లేదంటే ఏపీలో ఒకరకంగా చూస్తే ప్రత్యర్థి అయిన బీజేపీని సెంట్రల్‌లో మిత్రుడనుకుని మద్దతిస్తారా? కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీని పట్టించుకోలేదంటూ విమర్శలు గుప్పించిన జగన్ సెంట్రల్ విషయానికి వస్తే ఇండియా కూటమికి మద్దతుగా నిలుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు జగన్ పరిస్థితి ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్టుగా ఉంది. ఒకవేళ ఇండియా కూటమికి గానీ మద్దతు ఇచ్చారా? బీజేపీ కేసుల వలయంలోకి లాగి బయటకు కూడా రానివ్వదన్న భయం.. పోనీ బీజేపీకి మద్దతు ఇచ్చారా? జనాలు ఊరుకుంటారా? ఏకిపారేస్తారు. జనాల మాట అటుంచితే చెల్లి వైఎస్ షర్మిల (YS Sharmila) ఊరుకుంటారా? అసలే హాట్‌లైన్ అన్నందుకే జగన్‌కు రెండు చెవుల్లోనుంచి పొగలు వచ్చేలా ఏకి పారేసిన షర్మిల.. బీజేపీకి జగన్ మద్దతు ఇస్తే ఊరుకుంటారా? పరిణామాలు ఊహకే అందవు. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు..’ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జగన్‌ను ఇరుకున పెట్టేందుకే వచ్చినట్టున్నాయి.