రాహుల్ పప్పు కాదు.. ది రైజింగ్ నిప్పు!
ఇప్పుడంటే దేశంలో రాహుల్ సంచలనంగా మారారు కానీ, గతంలోనూ ఎన్నో సందర్భాల్లో ఆయన పార్లమెంట్‌ను హడలెత్తించారు. ప్రధాని మోదీ సహా బీజేపీకి చుక్కలు చూపించారు.

ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎప్పుడూ విపక్షాలు ‘పప్పు’ అంటూ నిందిస్తూనే ఉంటాయి. అయినా సరే.. ఆయనెప్పుడూ వెరవలేదు.. భయపడనూ లేదు. రాహుల్ స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్లనే కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి అంటూ ఎన్నోసార్లు ఎంతో మంది దుమ్మెత్తి పోశారు. ఇప్పుడంటే దేశంలో రాహుల్ సంచలనంగా మారారు కానీ, గతంలోనూ ఎన్నో సందర్భాల్లో ఆయన పార్లమెంట్‌ను హడలెత్తించారు. ప్రధాని మోదీ సహా బీజేపీకి చుక్కలు చూపించారు. ఇవన్నీ సోషల్ మీడియా, మీడియాలో చాలా తక్కువగానే చూసుంటాం. కానీ, ఏ మీడియా సంస్థ కూడా ఆయన దూకుడు వ్యవహారశైలిని క్యాప్చర్ చేయలేదు. నేషనల్ మీడియా అంతా సాధారణ కవరేజ్ ఇచ్చింది. సునామీలా రాహుల్ విరుచుకుపడితే.. టీ కప్పులో తుఫాన్ అన్నట్టుగా చూపించింది. ఇంకెలా ఇది ప్రజలకు తెలుస్తుంది?
ఎన్ని గట్స్ కావాలి!
తాజాగా ఆయన చేసిన ఆరోపణలేమీ సాధారణమైనవి కావు. ఏకంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్‌పైనే తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు.. పక్కా ఆధారాలతో సహా ప్రజెంటేషన్ కూడా ఇవ్వడంతో యావత్ ప్రపంచం అంతా నివ్వెరపోయింది. వాస్తవానికి ఎన్ని గట్స్ ఉంటే అలా చేయాలి? ఇది కూడా బయటకు రాకపోయేదేమో కానీ రాహుల్‌తో పాటు ఆయన పోరాటంపై అంతో ఇంతో జాలి కలిగినట్టుంది. దీనికి తోడు కొన్ని రాష్ట్రాల్లో ఓటమి చెందిన పార్టీలు సైతం ఆయన వ్యాఖ్యలను తమ అనుకూలంగా మార్చుకుంటూ కథనాలను వెలువరించడం కూడా ఒక కారణమై ఉండొచ్చు. మొత్తానికి రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశంలో పెను సంచలనానికి దారి తీశాయి. పప్పు అంటున్న నోళ్లు ఇకనైనా మూతపడతాయేమో చూడాలి. ఓట్ల చోరీకి సంబంధించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఈసీకి కూడా విస్మయాన్ని కలిగించాయి. ఓట్ల చోరీ ఐదు రకాలుగా జరిగిందంటూ సంచలనం సృష్టించారు.
ఈసీపై తగ్గేదేలే..
డూప్లికేట్ ఓట్లు సహా ఫేక్ అడ్రస్‌లు, ఒకే చిరునామా నుంచి భారీగా ఓట్లు ఉండటం, ఇన్‌వాలిడ్ ఫొటోలు, ఫారం నంబర్ 6 దుర్వినియోగం వంటివి జరిగాయని రాహుల్ గాంధీ తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా మరో అభియోగం కూడా ఆయన చేశారు. సాయంత్రం పోలింగ్ ముగిసే టైమ్‌కు ఉన్న పోలింగ్ శాతానికి, ఆ తర్వాత రాత్రి వరకూ నమోదైన పోలింగ్ శాతాలకు ఏమాత్రం పొంతన లేదన్నారు. కనీసం సీసీటీవీ ఫుటేజి ఇవ్వడానికి ఈసీ సిద్ధంగా లేకపోవడాన్ని సైతం ఆయన ఒక కారణంగా చూపించారు. ఆరోపణలు చేసి ఊరుకోలేదు. విపక్షాలను కూడగట్టి ర్యాలీలు తీశారు. పార్లమెంట్‌ను గడగడలాడించారు. ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కోసం ప్రతిపక్షాలు నిరసన తెలిపారు. అంతటితో ఆగలేదు ఈ వ్యవహారం కాస్త రాహుల్, ఇతర ప్రతిపక్ష నాయకులు ఎంపీలను అరెస్ట్ చేసేదాకా వెళ్లింది. బీహార్‌లో ఓటరు జాబితా సవరణ మరియు ఎన్నికల అక్రమాల ఆరోపణలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ హౌస్ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు చెప్పండి.. ఇలాంటి రాహుల్‌ను పప్పు అని ఎలా అంటాం? నిప్పు అనక తప్పదు!
ప్రజావాణి చీదిరాల