Politics

Telangana News: పాలన పక్కనబెట్టి పాలిటిక్స్‌తో రచ్చ!

తెలంగాణ రాజకీయాలు (Telagana Politics) ప్రస్తుతం గందరగోళంలో, అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ నేతల మధ్య రచ్చ జరుగుతోంది.

Telangana News: పాలన పక్కనబెట్టి పాలిటిక్స్‌తో రచ్చ!

తెలంగాణ రాజకీయాలు (Telagana Politics) ప్రస్తుతం గందరగోళంలో, అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ నేతల మధ్య రచ్చ జరుగుతోంది. తెలంగాణలో పాలన ట్రాక్ తప్పి, అంతర్గత కలహాలు, విపక్ష ఆరోపణల సుడిగుండంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా, పాలకపక్షాల నేతల వ్యవహార శైలి, ప్రభుత్వ నిర్ణయాలపై వస్తున్న విమర్శలు.. సాధారణ పౌరుడిలో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.

తెలంగాణలో అంతర్గత కలహాల కారణంగా ప్రజలు సుపరిపాలన కంటే కూడా రోజువారీ రాజకీయ రచ్చే ఎక్కువగా చూస్తున్నారు. పాలకుల సొంత పనులు, విపక్షాల విమర్శల మధ్య అసలు అభివృద్ధి అజెండా ఎక్కడుంది? అన్న ప్రశ్న ఇప్పుడు పౌరులను వేధిస్తోంది. తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలన ప్రారంభమై కొన్ని నెలలే అయినా, హైడ్రామా తరహా పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వా (Congress Government)నికి బలహీనత ముద్ర వేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత రగడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెండర్ల వ్యవహారంతో మొదలైన ఈ వివాదం, ఏకంగా అధికార మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఇంట్లోకి పోలీసులు వెళ్లే స్థాయికి చేరింది. ఒక అధికార పార్టీ మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడం అనేది అత్యంత అసాధారణమైన, పార్టీలో నెలకొన్న లోతైన సమస్యలను సూచించే పరిణామం.

ఏకంగా సీఎం సోదరులపై ఆరోపణలు..

అంతేకాదు ప్రభుత్వ యంత్రాంగంపై సీఎం నియంత్రణ ఎంత వరకు ఉందనే సందేహాలను పెంచుతుంది. ఈ వ్యవహారం పార్టీలో అంతర్గత సమన్వయం ఎంత లోపించిందో తేటతెల్లం చేసింది. కొండా సురేఖ కుమార్తె ఏకంగా సీఎం సోదరులపై ఆరోపణలు చేయడం, ‘ఆధారాలు’ ఉన్నాయని సవాలు విసరడం ద్వారా ప్రతిపక్షాలకు దొరికిన అస్త్రం ఇది. అసలు ముఖ్యమంత్రి ఎందుకు నేరుగా రంగంలోకి దిగి, పార్టీ ఇమేజ్‌ను కాపాడటం లేదనేది ప్రధాన ప్రశ్న. ప్రతి సమస్యపైనా పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Congress Party Telangana in-charge Meenakshi Natarajan), టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC chief Mahesh Kumar Goud) వంటి వారి ద్వారా పరిష్కారం చూపడానికి ప్రయత్నించడం, రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో రక్షణగా ఉంటున్నారు అనే అపవాదుకు మరింత బలాన్నిస్తోంది. రేవంత్ బ్రదర్స్‌పై వస్తున్న ఆరోపణలు ఏ మాత్రం నిజమైనా, తొలిసారి అధికారంలోకి వచ్చి గొప్ప మార్పు తీసుకురావాలనుకున్న సీఎం ఇమేజ్‌కు ఇది తీవ్ర నష్టం.

సీఎం సోదరులు అలా చేస్తుంటే..

రేవంత్ సోదరులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, వారికి బందోబస్తు, కాన్వాయ్, గన్ మెన్‌లు కేటాయించారనే విమర్శలు ఆది నుంచీ ఉన్నాయి. తొలిసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, తన పాలనపై మచ్చ పడకుండా ఉండాలంటే, ఈ ఆరోపణలపై వెంటనే స్పష్టత ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రులను తరచుగా మారుస్తుందనే అపప్రథ ఉన్న నేపథ్యంలో, ఇటువంటి 'గోటితో పోయే' సమస్యలను 'గొడ్డలి దాకా' తెచ్చుకోవడం శ్రేయస్కరం కాదు. నిజంగానే సీఎం సోదరులు అలా చేస్తుంటే, వాటిని సరిదిద్దుకుని పారదర్శకతను నిరూపించుకోవాల్సిన బాధ్యత సీఎంపై ఉంది. లేదంటే, బీఆర్ఎస్‌కు రాజకీయ మైలేజ్ పెరిగి, అది జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubleehills Bypoll) ఫలితాలపై తప్పకుండా ప్రభావం చూపడం ఖాయం. ముఖ్యంగా, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం హైకోర్టుకే మళ్లీ వెళ్లడం, హామీల అమలులో జాప్యం, హైదరాబాద్‌లో పేదల ఇళ్లను అన్యాయంగా ‘హైడ్రా’ కూల్చుతున్నదనే అపవాదులు.. ఈ ప్రభుత్వానికి పరిపాలనా వైఫల్యం అన్న ట్యాగ్‌ను అతికిస్తున్నాయి.

రిజర్వేషన్ల అంశాన్ని అస్త్రంగా..

రాజకీయ రచ్చకు బ్రేక్ పడితేనే, పాలనపై దృష్టి పెట్టడం సాధ్యమవుతుంది. మరోవైపు తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవైపు కాంగ్రెస్‌లో అంతర్గత రచ్చ, మరోవైపు బీఆర్ఎస్ (BRS) రిజర్వేషన్ల అంశాన్ని అస్త్రంగా వాడుకోవడం ఈ ఎన్నిక ఫలితం కేవలం ఒక సీటుకే పరిమితం కాకుండా, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుకు ప్రజా తీర్పుగా నిలవనుంది. మొత్తంగా చూస్తే, తెలంగాణ ప్రభుత్వం (Telangana Government( మొత్తం ‘పాలిటిక్స్’ చుట్టూ తిరుగుతోంది తప్ప, ‘పాలన’ చుట్టూ కాదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజలకు హామీలు, అభివృద్ధి ప్రాజెక్టులు కావాలి కానీ, నాయకుల మధ్య గొడవలు, పత్రికా ప్రకటనల రచ్చ కాదని పాలకులు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 18, 2025 10:06 AM