Medaram: భక్తి వెనుక శక్తి రాజకీయాలు.. వనదేవతల సాక్షిగా మంత్రుల సమరం!
తెలంగాణ కుంభమేళా.. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ పండుగ.. కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం మేడారం జాతర! పైకి భక్తి పారవశ్యం కనిపిస్తున్నా, లోలోపల మాత్రం సర్కారు పెద్దల మధ్య పంతాలు, పట్టింపులు, పైచేయి కోసం పోరాటాలు రచ్చకెక్కుతున్నాయి.
తెలంగాణ కుంభమేళా.. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ పండుగ.. కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం మేడారం జాతర! పైకి భక్తి పారవశ్యం కనిపిస్తున్నా, లోలోపల మాత్రం సర్కారు పెద్దల మధ్య పంతాలు, పట్టింపులు, పైచేయి కోసం పోరాటాలు రచ్చకెక్కుతున్నాయి. మరోవైపు మంత్రిపై భక్తుల తిరుగుబాటు.. ఇవాళ ఏకంగా భక్తులపై లాఠీఛార్జ్ చేయడం.. ఎక్కడిక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటం.. ఇవన్నీ చూస్తుంటే దేవుడి సన్నిధిలో ఏంది ఈ రచ్చలు? అని సామాన్య భక్తులు ముక్కున వేలేసుకునేలా సాగుతోంది ఈసారి ఉత్సవం.
జాతర ఇక్కడ.. రిమోట్ కంట్రోల్ ఎక్కడ?
సాధారణంగా మేడారం వంటి మహా జాతర జరుగుతుంటే దేవాదాయ శాఖ మంత్రి అన్నీ తానై పర్యవేక్షించాలి. కానీ, విచిత్రంగా ఈసారి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జాడ మేడారంలో కనిపించడం లేదు. సారలమ్మ గద్దెకు చేరుకున్నా, సమ్మక్క తల్లి వనప్రవేశం చేసినా.. తన శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌కు ఆమె దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇల్లు గెలవని వారు రచ్చ గెలుస్తారా? అన్నట్టుగా.. తన సొంత శాఖ నిర్వహించే జాతరపై సురేఖకు పట్టు లేకుండా పోయిందని, అంతా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని టాక్. అమెరికా నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తుంటే, ఇక్కడ గ్రౌండ్ లెవల్‌లో పొంగులేటి ‘సూపర్ మినిస్టర్’గా చక్రం తిప్పుతున్నారు.
టెండర్ల లొల్లి.. కొండా వర్సెస్ పొంగులేటి!
ఈ దూరానికి కారణం భక్తి కాదు.. పక్కా శక్తి (రాజకీయ బలం) అని తెలుస్తోంది. సుమారు 71 కోట్ల రూపాయల మేడారం అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో సురేఖకు, పొంగులేటికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం చెలరేగినట్లు సమాచారం. తన శాఖలో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని సురేఖ ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందట. చివరికి పొంగులేటి అనుకూల సంస్థలకే కాంట్రాక్టులు దక్కడం, ఓఎస్డీ వివాదంలో సురేఖ ఇరుక్కోవడంతో ఆమెను జాతర నుంచి ఎగ్జిట్ చేసేశారనే చర్చ సాగుతోంది.
మంత్రి కాన్వాయ్‌పై దాడి!
జాతరలో మరో సంచలన ఘటన చోటుచేసుకున్నది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. అర్ధరాత్రి కరెంటు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి వాహనాల అద్దాలు ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఐతే భక్తుల రద్దీ వల్ల అసహనంతో జరిగిన దాడి అని కొందరు మభ్యపెడుతున్నా.. మంత్రుల మధ్య ఉన్న కోల్డ్ వార్ ప్రభావమే ఈ దాడుల వెనుక ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. భక్తుల మధ్య చిక్కుకున్నారని కొన్ని కాంగ్రెస్ అనుకూల మీడియా సంస్థలు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం శాంతిభద్రతలు గాలికొదిలేశారు అని స్పష్టం చేస్తోంది.
ఎందుకిలా..?
ఇది మేడారం జాతరనా? కాంగ్రెస్ పబ్లిసిటీ జాతరనా?మేడారం గడ్డపై ఇప్పుడు పూజారుల మాట కంటే కాంగ్రెస్ నేతల హడావిడే ఎక్కువగా కనిపిస్తోంది. 'గుడి మాది.. జాతర మాది.. అసలు ఈ పోలీసులు ఎవరు? మమ్మల్ని బయటకు పంపడమేంటి?' అని ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ ప్రశ్నిస్తుంటే, అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గద్దెల పైన పూజారులకు బదులు వలంటీర్లు, మున్సిపాలిటీ సిబ్బంది తిష్టవేయడం ఆదివాసీ ఆచారాలను అవమానించడమేనన్న విమర్శలు వస్తున్నాయి. రూ. 250 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం, కనీసం భక్తుల కోసం 200 బాత్రూమ్లు కూడా నిర్మించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లాఠీలకు పనిచెప్పిన ఖాకీలు!
మరోవైపు, భక్తుల రక్షణ కోసం ఉండాల్సిన పోలీసులు మేడారంలో యమధర్మరాజులుగా మారారు. సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద భక్తులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ చూసి యావత్ భక్తలోకం హతాశయులైంది. అత్యుత్సాహంతో మహిళలను కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి మరీ పిడిగుద్దులు గురిపెట్టారు. ఖాకీల దెబ్బలకు భక్తులకు రక్తం వచ్చేలా గాయాలయ్యాయి. ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, సీఐ దయాకర్ వంటి ఉన్నతాధికారులు సైతం స్వయంగా దాడులకు దిగడం గమనార్హం. పోలీసుల వికృత చేష్టలకు నిరసనగా భక్తులు తమ ఆవేదనను చెప్పుల రూపంలో విసిరారు. దీంతో సమ్మక్క ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.. భక్తులపై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు మిన్నంటుతున్నాయి.
మౌనమేల మేడం?
వనదేవతల సాక్షిగా సాగుతున్న ఈ అధికార దాహం జాతర పవిత్రతను దెబ్బతీస్తోంది. ఒకరు బీసీ మహిళా మంత్రిని టార్గెట్ చేశారని, మరొకరు కాంట్రాక్టుల కోసం పంతాలకు పోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడవిలో ఆటవిక న్యాయం అంటారు కానీ, ఇక్కడ అడవి దేవతల చెంత రాజకీయ న్యాయం (అన్యాయం) రాజ్యమేలుతోందని రాజకీయ విశ్లేషకులు, మేధావులు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. కొండా సురేఖ మౌనం.. పొంగులేటి పంతం.. అడ్లూరిపై దాడి.. ఇవన్నీ కలిపి మేడారం జాతరను వివాదాల పుట్టగా మార్చేశాయి. అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చేవరకూ ఈ రచ్చలు నాన్ స్టాప్ గా జరిగేలా ఉన్నాయి. ఆయన వచ్చాక అయినా సురేఖ నోరు విప్పుతారో లేదో చూడాలి.
ప్రజావాణి చీదిరాల