Politics

Pawan Kalayan: ఎవరి ఊహలకూ అందకుండా దూసుకెళుతున్న పవన్

కొన్ని క్షణాలను.. కొందరు మనుషులను జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకున్నప్పుడే మనకు విలువ. దీనిని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం బాగా ఫాలో అవుతున్నారు. ఎన్నో సందర్భాల్లో ఆయన్ను మనం చూశాం.

Pawan Kalayan: ఎవరి ఊహలకూ అందకుండా దూసుకెళుతున్న పవన్

కొన్ని క్షణాలను.. కొందరు మనుషులను జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకున్నప్పుడే మనకు విలువ. దీనిని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం బాగా ఫాలో అవుతున్నారు. ఎన్నో సందర్భాల్లో ఆయన్ను మనం చూశాం. సోషల్ మీడియాలోనో.. లేదంటే ఏదైనా వీడియోలోనో.. తనకు.. తన పార్టీకి అండగా నిలిచిన వ్యక్తులను పవన్ కల్యాణ్ బాగా గుర్తు పెట్టుకుంటారు. తాజాగా ఆయన చేసిన పని మరోసారి ఆయన మనుషులకు ఇచ్చే విలువకు నిదర్శనంగా నిలుస్తోంది.

అది 2022.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విశాఖకు వెళ్లి నోవాటెల్‌లో దిగారు. ఆ సమయంలో ఆయనను అప్పటి వైసీపీ ప్రభుత్వం (YCP Government) హోటల్‌లోనే నిర్బంధించింది. దీంతో పార్టీ కార్యకర్తలంతా పవన్ కోసం రంగంలోకి దిగారు. ముఖ్యంగా గోవిందమ్మ అనే వీర మహిళ చంటిబిడ్డతో పార్టీ జెండా పట్టుకుని అర్థరాత్రి సంఘీభావం తెలిపింది. వాస్తవానికి మూడేళ్ల క్రితం జరిగిన ఘటనను వేరొకరైతే మరచిపోయి ఉండేవారు. కానీ పవన్ మరువ లేదు. ప్రస్తుతం విశాఖ (Visakha)లో జనసేన పార్టీ (Janasena Party) విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గోవిందమ్మను పవన్ (AP Deputy CM Pawan Kalyan) గుర్తు పెట్టుకుని మరీ ఆమెకు ఎవరూ ఊహించని గౌరవం ఇచ్చారు. కార్యకర్తలతో ‘సేనతో సేనాని’ పేరిట ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశానికి గోవిందమ్మతోనే జ్యోతి వెలిగింపజేసిన మీదట సమావేశాన్ని ప్రారంభించారు. తనకు పవన్ ఇంతటి గౌరవం ఇస్తారని గోవిందమ్మ సైతం ఏనాడూ ఊహించి ఉండరేమో..

మెంబర్‌షిప్‌ టూ లీడర్‌షిప్‌గా..

ఈ సమావేశాల్లో పవన్ త్రిశూల వ్యూహా (Trisule Plan)న్ని రూపొందించనున్నట్టు వెల్లడించారు. నిరంతరం పార్టీ కోసం పని చేసేవారి భద్రతే లక్ష్యంగా ఈ త్రిశూల్ వ్యూహాన్ని రూపొందించనున్నట్టు తెలిపారు. దసరా తరువాత శక్తి, ధర్మం, రహస్యాలకు ప్రతీకగా పరమేశ్వరుడి త్రిశూలం తరహాలో ఈ వ్యూహం ఉంటుందన్నారు. ఈ వ్యూహంతో ప్రతి క్రియాశీలక సభ్యుడికి పార్టీ తరుఫున రక్షణ, గుర్తింపు, నాయకత్వం అప్పగిస్తామని పవన్ వెల్లడించారు. ఇంతకు మించిన భరోసా కార్యకర్తల (Janasena Cadre)కు ఏముంటుంది? పార్టీ గెలిచాక కార్యకర్తలను విస్మరించే నాయకుల నడుమ పవన్ ఇలాంటివి చేయడం ఆసక్తికరంగా మారింది.. ఇక కార్యకర్తలు జెండా దింపే ఛాన్సే లేదు. కడ దాకా మోస్తారు. అసలు కార్యకర్తలతో పార్టీ అధినేత సమావేశం అవడం అనేదే గుడ్ స్టెప్. ఇక సమావేశమైన తర్వాత నేతలతో కాకుండా కార్యకర్తలతో మాట్లాడించడమనేది పవన్‌కే చెల్లుతుంది. కార్యకర్తలకు విలువ ఇస్తేనే ఏ పార్టీ అయినా నిలబడుతుంది. మెంబర్‌షిప్‌ టూ లీడర్‌షిప్‌గా మీరు ఎదగాలంటూ పవన్ దిశా నిర్దేశం చేయడం ఆసక్తికరం.

చంద్రబాబుతో మాట్లాడి సరిచేస్తా..

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) భవిష్యత్ గురించి కూడా పవన్ మాట్లాడారు. పదిహేనేళ్ల స్థిరమైన నాయకత్వం కావాలని.. అందుకు కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉండాలని పేర్కొన్నారు. అలకలు, కోపతాపాలు వద్దని.. వాటి కారణంగా ప్రజలు నష్టపోతారని పవన్ కార్యకర్తలకు తెలిపారు. ఏవైనా సమస్యలుంటే వాటిని సరి చేసుకుందామని.. అవసరమైతే సీఎం చంద్రబాబు (CM Chandrababu)తో మాట్లాడి సరిదిద్దే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. మళ్లీ అరాచక పాలన రాకుండా కలిసికట్టుగా ముందుకెళదామంటూ కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ సూచనలు చేశారు. మొత్తానికి పవన్ ఎవరి ఊహలకూ అందని విధంగా ముందుకెళుతున్నారనడంలో సందేహమే లేదు.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 31, 2025 5:59 AM