Politics

YS Jagan: పాదయాత్ర 2.0 .. ‘మడమ తిప్పని’ జగన్ రెడ్డిని జనం మడతెడతారా?

అవును.. రాజకీయాల్లో టైమ్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు గాక ఉండదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ప్యాలస్ గోడల మధ్య, పరదాల మాటున పాలన సాగించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీదకు వస్తానంటున్నారు.

YS Jagan: పాదయాత్ర 2.0 .. ‘మడమ తిప్పని’ జగన్ రెడ్డిని జనం మడతెడతారా?

అవును.. రాజకీయాల్లో టైమ్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు గాక ఉండదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ప్యాలస్ గోడల మధ్య, పరదాల మాటున పాలన సాగించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీదకు వస్తానంటున్నారు. ‘వచ్చే ఏడాదిన్నర తర్వాత ఏలూరు నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలుపెడతా.. ఏడాదిన్నరపాటు జనంలోనే ఉంటా.. మళ్ళీ పవర్‌లోకి వస్తా’ అంటూ ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే నాటి పాదయాత్ర వేరు.. నేటి పరిస్థితులు వేరు అని రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. అప్పుడు జగన్ వేసిన అడుగుల కింద పూలు పడితే.. ఇప్పుడు ముళ్లు ఎదురుచూస్తున్నాయి.

అప్పుడు ఒక్క ఛాన్స్.. ఇప్పుడు ‘నో’!

2019 ఎన్నికల ముందు జగన్ వేసిన ప్రజాసంకల్ప యాత్ర ఒక ప్రభంజనం.. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యమే. ‘నేనున్నాను.. నేను విన్నాను’ అనే మాట జనం చెవుల్లో అమృతంలా వినిపించింది. మరీ ముఖ్యంగా ‘ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ ఆయన అడిగిన తీరుకు జనం కరిగిపోయారు. ‘అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్న చందంగా ఉన్న నాటి పరిస్థితుల్లో జనానికి జగన్ ఒక ఆశాకిరణంలా కనిపించారు. కానీ, ఐదేళ్ల పాలన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. అప్పుడు హగ్గులు ఇచ్చిన చేతులే.. అధికారం వచ్చాక పరదాలు కట్టుకుని తిరిగాయని జనం గుర్తులు పెట్టుకుని మరీ మొన్నటి ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ‘తల నిమురుతా’ అంటే.. ‘తలలు తాకట్టు పెట్టడానికి మేము సిద్ధంగా లేము బాబోయ్’ అని జనం అంటున్న పరిస్థితి.

మాయమైన సెంటిమెంట్!

నాడు జగన్ విజయానికి దోహదపడిన ‘కోడికత్తి’.. ‘వివేకా హత్య’ వంటి అంశాలు సెంటిమెంట్ అస్త్రాలుగా పనిచేశాయన్నది జగమెరిగిన సత్యమే. మరీ ముఖ్యంగా ‘చెల్లి షర్మిల వదిలిన బాణం.. తల్లి విజయమ్మ తోడు’ అంటూ కుటుంబం మొత్తం రోడ్ల మీద నిలబడింది. కానీ నేడు? ఆ బాణం జగన్‌కు వ్యతిరేకంగానే తిరగబడిన పరిస్థితి. తల్లి, చెల్లి ఇద్దరూ జగన్ పతనాన్ని కోరుకునే స్థాయికి గొడవలు వెళ్లాయి. ‘ఇంట్లో ఈగలను తోలుకోలేని వాడు.. ఊరి వెలపల ఏం చేస్తాడు?’, ముందు ఇళ్లు చక్కబెట్టుకుని తర్వాత ఊరి సంగతి చూడాలన్నట్టు, సొంత కుటుంబాన్ని కలుపుకోలేని నేత.. రాష్ట్రాన్ని కలుపుతానంటే నమ్మే వారెవరు? ఇక సెంటిమెంట్ పండించడానికి ‘గులకరాయి’ డ్రామాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని మొన్నటి ఫలితాలే నిరూపించాయని విశ్లేషకులు, మేథావులు, ప్రత్యర్థులు చెబుతున్న మాటలు.

రాజధాని రాజకీయం!

‘అమరావతే రాజధాని.. నా సమ్మతి ఉంది’ అని నాడు అసెంబ్లీలో చెప్పిన జగన్.. అధికారంలోకి రాగానే ‘మూడు ముక్కలాట’ గట్టిగానే ఆడారు. రాజధాని రైతులు ఐదేళ్ల పాటు రోడ్ల మీద రోదిస్తుంటే, కనీసం అటువైపు చూడని జగన్.. ఇప్పుడు మళ్ళీ అదే రైతుల దగ్గరకు వెళ్లి ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. కానీ, జగన్ ఇచ్చిన హామీలు- అమలు చేసిన తీరు చూశాక, ‘జగన్ మాట ఇస్తే మడం తిప్పడనే’ డైలాగ్ ఇప్పుడు పూర్తిగా జోక్‌లా మారిపోయింది. సంపూర్ణ మద్యనిషేధం అని చెప్పి ‘జే బ్రాండ్’లతో జనం జేబులు ఖాళీ చేసిన వైనం సామాన్యుడు ఇంకా మర్చిపోలేదు.

కదులుతున్న కేసీఆర్ అండ!

నాడు జగన్ గెలుపు వెనుక తెరచాటున బీజేపీ, నేరుగా కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ సహకారం ఉంది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి పాడైపోయిన విస్తరిలా తయారైంది. అటు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉక్కుకోటలా మారిపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని చెప్పడమే కాదు.. పదేళ్ల పాటు ఈ పొత్తు కొనసాగుతుందని, పదిహేనేళ్లు అధికారంలో ఉండాలని బల్లగుద్ది మరీ గట్టిగా చెబుతున్నారు. ఈ బలమైన కూటమిని ఢీకొట్టడం జగన్‌కు తలకు మించిన భారమేనని విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి.

వైసీపీ 2.0 సాధ్యమేనా?

అప్పుడు జగన్‌కు అన్నీ కలిసి వచ్చాయి. కానీ, ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్నది బూతు పురాణం వినిపించే బ్యాచ్ తప్ప సబ్జక్ట్ ఉన్న నేతలు అరకొరే. అందులోనూ విధ్వంసాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రంగు రాజకీయాలు మాత్రమే చేస్తున్న పరిస్థితి. ‘ఒకసారి మోసం చేస్తే ఎదుటివాడి తప్పు.. రెండోసారి మోసం చేస్తే మనదే తప్పు’ అని జనం డిసైడ్ అయిపోయారు. జగన్ పాదయాత్ర 2.0 అనేది వైసీపీకి బలాన్ని ఇస్తుందో లేక ఉన్న క్యాడర్‌ను కూడా కరిగేలా చేస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా, ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే పాత పాట ఇప్పుడు రికార్డ్ బ్రేక్ అయినట్టు వినబడుతోంది. జగన్ పాదయాత్ర 2.0 అంటే అది కేవలం నడక మాత్రమే కాదు.. గత ఐదేళ్ల పాపాలకు జనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో జగన్ పాస్ అవ్వడం అంటే.. ఆకాశానికి నిచ్చెన వేయడమే అని రాజకీయ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 23, 2026 9:35 AM