Politics

YS Sharmila: అయ్యో పాపం షర్మిల.. నో ఆప్షన్.. కవితకు ఓపెన్ డోర్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) వైఎస్ షర్మిల (YS Sharmila), తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha).. ఈ ఇద్దరు బలమైన మహిళా నేతల ప్రయాణం ప్రస్తుతం ఒకే తీరులో సాగుతోంది.

YS Sharmila: అయ్యో పాపం షర్మిల.. నో ఆప్షన్.. కవితకు ఓపెన్ డోర్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) వైఎస్ షర్మిల (YS Sharmila), తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha).. ఈ ఇద్దరు బలమైన మహిళా నేతల ప్రయాణం ప్రస్తుతం ఒకే తీరులో సాగుతోంది. రాజకీయంగా అనిశ్చితి, అపజయాలు వెంటాడుతున్నప్పటికీ, ఇద్దరూ పట్టువదలని విక్రమార్కుల్లా బరిలో నిలబడి పోరాడుతూనే ఉన్నారు. అయితే, ఈ ఇద్దరి పోరాటాన్ని విశ్లేషిస్తే, షర్మిల కంటే కవిత భవిష్యత్తు కాస్త ఆశాజనకంగా కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) కూతురుగా, మంచి మాటకారిగా, రాజకీయాలపై బలమైన పట్టున్న నేతగా కవితకు ప్రజల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె భవిష్యత్తును పరిశీలిస్తే, అనేక మార్గాలు తెరిచి ఉన్నాయి. ఒకవేళ బీఆర్‌ఎస్ పార్టీ తన ఉనికిని కోల్పోతే, ఆమె తిరిగి బీఆర్‌ఎస్‌ (BRS)లో చేరిపోవచ్చు లేదా పార్టీలో చీలిక తెచ్చి సొంత పార్టీ పెట్టుకోవచ్చు. ఇంతటితో ఆగకుండా, కేసీఆర్, కేటీఆర్‌ (KTR)లను బీజేపీ (BJP) అధిష్టానం దూరం పెడితే, తండ్రిలాగే మంచి వాక్చాతుర్యం, పరిపాలనపై పట్టున్న కవిత (Kavitha)ను బీజేపీ కూడా చేరదీసే అవకాశం ఉంది. ఇలా, కవితకు రాజకీయంగా అనేక ‘ఆప్షన్లు’ అందుబాటులో ఉన్నాయి.

షర్మిలకు దారులన్నీ మూసివేత

కవితతో పోలిస్తే షర్మిల (Sharmila) పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆమెకు రాజకీయంగా ఎటువంటి ‘సేఫ్ ఆప్షన్లు’ ఏమాత్రం కనిపించట్లేదు. ముఖ్యంగా తన సోదరుడు, వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)తో సయోధ్య కుదిరే పరిస్థితి కనుచూపు మేరల్లో కనిపించడం లేదు. ఒకవేళ అక్రమాస్తుల కేసు లేదా మరో కేసులో జగన్ జైలుకు వెళ్లినా, ఆయన సతీమణి వైఎస్ భారతి పార్టీకి అన్నీ తానై ఉండొచ్చు కానీ, షర్మిలకు మాత్రం పగ్గాలు అప్పగించేందుకు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ సిద్ధపడినా, జగన్ బయటికి రాగానే మళ్లీ తాను బయటికేనని భావించి షర్మిల అందుకు అంగీకరించే అవకాశం తక్కువ. ఆమె ఏపీ కాంగ్రెస్ (AP Congress) పార్టీ పగ్గాలు చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ఇంతవరకు ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత (YCP Leader)ను కూడా ఆకర్షించలేకపోయారు. ప్రజాదరణ లేని కాంగ్రెస్‌లో చేరేందుకు వైసీపీ నేతలు ఇష్టపడరని, కనుక ఆమె ఆకర్షించలేరని చెప్పవచ్చు. ఏపీలో కూటమి బలం పెరుగుతున్న ఈ తరుణంలో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఇక ఎప్పటికీ చోటు లభించదు అనే అభిప్రాయం బలంగా ఉంది.

రాజ్యసభ దక్కితో పదివేలు!

అక్కడే (AP) రాజకీయ అనిశ్చితి, ఇక్కడ (Telangana) పార్టీలోనూ సవాళ్లు.. ఈ రెండు రాష్ట్రాల మహిళా నేతల పోరాటాన్ని గమనిస్తున్నప్పుడు అయ్యో పాపం షర్మిల! ఈపాటికి ఆమె తన సొంత పార్టీ వైఎస్సార్‌టీపీని కొనసాగించినా, లేక వైసీపీలో ఉండి రాజకీయ వ్యవహారాలు పర్యవేక్షించినా పరిస్థితి ఇంకోలా ఉండేదేమో? అన్న భావన ఆమె అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది. అయితే, కవితకు ఉన్నన్ని ప్రత్యామ్నాయ మార్గాలు షర్మిలకు లేకపోవడమే ప్రస్తుతం ఆమె రాజకీయ ప్రయాణంలో ప్రధాన లోపంగా కనిపిస్తోంది. ఏపీ కాంగ్రెస్ కేవలం షర్మిలకు రాజకీయ కాలక్షేపం కోసమే ఉపయోగపడుతుంది తప్ప, ఆమె అక్కడ చేయగలిగేదేమీ ఉండదు. ఈ అనిశ్చితి దృష్ట్యా, ఆమె అధిష్టానాన్ని ఒప్పించి రాజ్యసభ (Rajyasabha) సీటు సంపాదించుకోగలిగితే అదే ఆమెకు పెద్ద విజయంగా పరిగణించాలి. ఇద్దరు బలమైన నేతల పోరాటం చూస్తుంటే, అధికారం వస్తేనే ఈ రాజకీయ అనిశ్చితికి తెరపడుతుందనేది సుస్పష్టం.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 20, 2025 12:03 PM