NTR: ఎన్టీఆర్ ఆఖరి గడియలు.. చీకటిలో దాగిన నిజమేంటి?.. చంద్రబాబు దోషా?
ఒకవేళ చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకోకుంటే టీడీపీ పరిస్థితేంటి? సర్వనాశం అయ్యుండేది కదా.. అప్పుడు ఎన్టీఆర్ జనాల దృష్టిలో మహానుభావుడు అయ్యుండేవారా? పార్టీ పతనమై.. మనిషి ఉండి ఉంటే ఆయనను ఇప్పుడు మహానుభావుడు అంటున్నవారే.. మరోలా పేర్కొనేవారు.
తెలుగు నేల మీద ఎన్టీఆర్ పేరొక ప్రభంజనం. పేదవాడి పెన్నిధిగా, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మరణం ఇప్పటికీ కోట్లాది మంది అభిమానులకు ఒక తీరని వేదన. అయితే, 1996 జనవరి 18న ఆయన కన్నుమూయడానికి ముందు రోజు రాత్రి.. అంటే జనవరి 17న ఆయన నివాసంలో ఏం జరిగింది? ఆ మహానేత మనసు ఎంతలా విలవిలలాడింది? ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ గతంలో వెల్లడించిన వాస్తవాల వెనుక దాగున్న సత్యమేంటి?
వాస్తవానికి ఒక జర్నలిస్ట్.. పైగా కురువృద్ధుడు అయిన తిప్పరాజు రమేష్.. అసలు ఎన్టీఆర్ మరణానికి ముందు ఏం జరిగిందనేది గతంలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయనే కాదు.. గతంలో మరికొందరు సైతం చెప్పారు. అయితే ముఖ్యంగా ఒక జర్నలిస్ట్ మాట్లాడే ముందర నాణేనికి మరో కోణం కూడా ఉంటుందనే విషయం గ్రహించకుంటే అది ఒకరికి ఫేవర్‌గా మాట్లాడినట్టే అవుతుంది. అలాంటి వారు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికే అనర్హులు. ఎన్టీఆర్ మరణంలో రెండో కోణమేంటి? చీకటిలో ఉండిపోయిన వాస్తవాలేంటి? చంద్రబాబు పార్టీని వదిలేసి ఉంటే ఏం జరిగేది? అనే విషయాల గురించి కూడా ఒకసారి మాట్లాడుదాం. దీనికి ముందు ఎన్టీఆర్ మరణానికి ముందు ఏం జరిగింది? తిప్పరాజు ఏం చెప్పారో చూద్దాం.
ప్రశాంతంగా మొదలై..!
జనవరి 17, 1996. సంక్రాంతి పండుగ వాతావరణం ఇంకా చల్లారలేదు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని ఎన్టీఆర్ నివాసానికి ఢిల్లీ నుంచి సెలవుపై వచ్చిన రమేష్ వెళ్లారు. మధ్యాహ్నం అంతా ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా గడిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో తన ఆఖరి కుమారుడు జైశంకర్ కృష్ణ వచ్చి కొంత డబ్బు అడిగి తీసుకువెళ్లారు. అప్పటి వరకు అంతా సాధారణంగానే ఉంది. కానీ, 5 గంటల సమయానికి అన్నగారి ముఖంలో తెలియని ఆందోళన నీడలు కమ్ముకున్నాయి. సాయంత్రం సరిగ్గా 6 గంటల సమయానికి టీడీపీకి చెందిన అడ్వకేట్లు జాస్తి చలమేశ్వర్, ఎన్.వి. రమణ, శ్రీనివాసరావు.. పెద్దాయన గదిలోకి ప్రవేశించగా.. ‘ఏం బ్రదర్స్.. ఏం జరిగింది?’ అని ఆయన అడిగారు. హైకోర్టులో పార్టీ బాంక్ ఖాతాల విషయంలో తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చిందని, బ్యాంకుల్లో ఎన్టీఆర్ సంతకాలు చెల్లవని, తెలుగుదేశం పార్టీ ఖాతాలన్నీ చంద్రబాబు వర్గానికే చెందుతాయని కోర్టు తీర్పునిచ్చిందని లాయర్లు వివరించారు. ఈ వార్త విన్న అన్నగారు ఒక్కసారిగా ఖిన్నుడైపోయారు.
జీవితంలో నమ్మి మోసపోయాను..
ప్రాణప్రదంగా నిర్మించిన పార్టీ, గుర్తు, చివరకు తన సంతకం కూడా చెల్లకుండా పోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ‘దరిద్రులు.. చండాలురు.. మోసగాళ్లు! పిల్లనిచ్చి, పదవినిచ్చి, ఆస్తి ఇచ్చి ఆదరిస్తే.. చివరకు పార్టీని, గుర్తును, ఆస్తులన్నింటినీ దొబ్బేశారు’ అంటూ భోరున ఏడ్చారు. ఒక సింహంలా గర్జించే వ్యక్తి, పసిబిడ్డలా గుండెలు బాదుకుంటూ తన బెడ్ రూమ్‌లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నారు. ఆ రాత్రి ఆయన భోజనం చేయలేదు, పాలు కూడా ముట్టలేదు. లక్ష్మీ పార్వతి ఎంత బతిమిలాడినా మంచినీళ్లు కూడా తాగలేదు. రమేష్, అశోక్ కలిసి లోపలికి వెళ్లి ఎంతగానో వేడుకోగా.. చివరకు ఒక్క గుక్కెడు నీళ్లు తాగి, ‘జీవితంలో నమ్మి మోసపోయాను.. అందరూ వెళ్ళిపోండి’ అని ఆజ్ఞాపించారు. ఆ మాటల్లో నిరాశ, నిస్పృహ కొట్టొచ్చినట్లు కనిపించాయి. రమేష్ ఒంటి గంట వరకు అక్కడే ఉండి, బరువెక్కిన హృదయంతో పద్మారావు నగర్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకు రమేష్ ఫోన్ మోగింది. ఫోన్‌లో లక్ష్మీ పార్వతి గొంతు.. ఆరాధ్య దైవం ఇక లేరన్న వార్త విని హుటాహుటిన అన్నగారి ఇంటికి చేరుకున్నారు. అక్కడ నిర్జీవంగా పడి ఉన్న ఎన్టీఆర్‌ను చూసి తట్టుకోలేకపోయారు.
పార్టీని లక్ష్మీపార్వతి పాదాక్రాంతం చేస్తుంటే ఏం చేశారు?
ఎన్నెన్నో జన్మల బంధం ఉన్న తిప్పరాజు వంటి ప్రముఖులు.. టీడీపీని ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతి పాదాక్రాంతం చేస్తుంటే ఏం చేశారు? ఇది తప్పని చెప్పలేకపోయారా? ఒక జర్నలిస్ట్‌కు బయట పరిస్థితులు ఏంటనేది స్పష్టంగా తెలుసు. మరి ఎన్టీఆర్‌పై అప్పటికే వ్యతిరేకత ఆయన్ను పూర్తిగా కమ్మేసేంతగా వచ్చింది. ఆయన కన్నకొడుకులు సైతం దూరం పెట్టారు. లక్ష్మీపార్వతిని ఇల్లాలిని చేసుకోవడం తప్పు కాదు. అది ఆయన స్వవిషయం. కానీ పూర్తిగా పార్టీ పగ్గాలను ఆమెకు అప్పగించడం ఆయన చేసిన తప్పిదం. దీనిపైనే బయట వ్యతిరేకత వస్తుంటే ఎన్టీఆర్ ఆత్మీయులంతా ఏం చేసినట్టు? ఆత్మీయులుగా.. శ్రేయోభిలాషులుగా బయటి పరిస్థితులు ఎన్టీఆర్‌కు వివరించాలి కదా. పోనీ ఎన్టీఆర్ చుట్టూ లక్ష్మీ పార్వతి ఒక కోటను కట్టేసి దానిలోని తన పర్మిషన్ లేకుండా ఎవ్వరినీ వెళ్లనీయనిప్పుడు అయినా ఇప్పుడు చంద్రబాబును ఆడిపోసుకుంటున్న ఎన్టీఆర్ ఆత్మీయులు ఏం చేసినట్టు? విషయాన్ని ఎన్టీఆర్‌కు ఎందుకు వివరించలేకపోయారు. అది ఎన్టీఆర్‌కు వారంతా చేసిన ద్రోహం కాదా?
మహానుభావుడు అయ్యుండేవారా?
ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అంటున్నారు కదా.. ఒకవేళ పొడిచి ఉంటే ఆ అవకాశం ఇచ్చిందెవరు? ఎన్టీఆర్ కదా? ఒకవేళ చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకోకుంటే టీడీపీ పరిస్థితేంటి? సర్వనాశం అయ్యుండేది కదా.. అప్పుడు ఎన్టీఆర్ జనాల దృష్టిలో మహానుభావుడు అయ్యుండేవారా? పార్టీ పతనమై.. మనిషి ఉండి ఉంటే ఆయనను ఇప్పుడు మహానుభావుడు అంటున్నవారే.. మరోలా పేర్కొనేవారు. ఒకరకంగా పార్టీ బాగుంది.. పెద్దాయన మహానుభావుడిలా వెళ్లిపోయారనేది ఎవరూ కాదనలేని సత్యం. అలాగే చంద్రబాబును దోషిని చేసేందుకు నేటికీ యత్నాలు జరుగుతున్నాయనేది కూడా అక్షరసత్యమే. ఎన్టీఆర్‌కు ఎంత గొప్ప పేరున్నా కూడా లక్ష్మీ పార్వతి అనే మరక మాత్రం ఆయనపై ఎప్పటికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా మంచి, చెడుల విశ్లేషణ చేయగలిగినప్పుడే జర్నలిస్ట్ అవుతాడు. లేదంటే ఎర్నలిస్ట్ అనక తప్పదేమో..
ప్రజావాణి చీదిరాల