Politics

AP Politics: ఆంధ్రప్రదేశ్ కాదు.. కులప్రదేశ్..!

సినిమా, రాజకీయాలు కావేవీ కుల పంచాయతీలకనర్హం అంటున్నారు ఇప్పటి ప్రజానీకం. సినీరంగాన్ని కులమే రాజ్యమేలుతోందని కొందరు ఆరోపిస్తూ ఉంటారు.. ఏపీ రాజకీయాలను సైతం కులమే శాసిస్తోందనేది అందరూ చెబుతున్న మాట.

AP Politics: ఆంధ్రప్రదేశ్ కాదు.. కులప్రదేశ్..!

సినిమా, రాజకీయాలు కావేవీ కుల పంచాయతీలకనర్హం అంటున్నారు ఇప్పటి ప్రజానీకం. సినీరంగాన్ని కులమే రాజ్యమేలుతోందని కొందరు ఆరోపిస్తూ ఉంటారు.. ఏపీ రాజకీయాలను సైతం కులమే శాసిస్తోందనేది అందరూ చెబుతున్న మాట. ఏపీ రాజకీయాల్లో కమ్మ, రెడ్డి, కాపులదే హవా. రాజ్యాధికారం దక్కించుకుంటే ఈ మూడు కులాలకు చెందినవారే. మరొకరికి అవకాశమే లేదు.. రాదు. ఎవరైనా అన్ని వర్గాల ప్రజానీకం ఓటేస్తేనే విజయం సాధిస్తారు. కానీ సీఎం స్థానంలో ఉన్నవారు, డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే పెట్టుకోవచ్చేమో కానీ ఇతర నేతలంతా ముఖ్యంగా కులాన్ని అంటుబెట్టుకునే ఉంటారనడంలో సందేహమే లేదు.

కులానికే అండ..

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. మాజీ మంత్రి అంబటి రాంబాబు విషయంలో జరుగుతున్నది ఇదే. అంబటి చేసింది తప్పా ఒప్పా? అనే విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం కాపు అవడంతో కాపులంతా అంబటికి ఫుల్ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మన కులం వాడు అయితే ఎలా మాట్లాడినా.. ఏం చేసినా చెల్లుతుందా? కొన్ని వందల మందికి ఆదర్శంగా నిలవాల్సిన నేతలు ఇలా తప్పొప్పులను పక్కనబెట్టి కులపోడు కాబట్టి అండగా నిలుద్దామని పిలుపునివ్వడమేంటి? మన దేశం అభివృద్ది చెందుతున్న దేశంగానే స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటికీ చెప్పుకోవడానికి కారణం ఈ కుల రాజకీయాలే. అభివృద్ధి, మంచి, మానవత్వాలకు ఎప్పుడో తిలోదకాలిచ్చేశాం. కేవలం కులాన్ని అంటుబెట్టుకుని బతుకున్నాం.

అంబటికి సంఘీభావంగా..

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ఈ క్రమంలోనే అంబటి రాంబాబుకు సంఘీభావంగా ఆయన కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. అక్కడి నుంచి అసలు రాజకీయం ప్రారంభమైంది. కాపు నేతలంతా రంగంలోకి దిగారు. అంబటికి మద్దతుగా కాపు నేతలైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ ఛలో గుంటూర్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. విశాఖ టు గుంటూరుకు 300 కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అంబటి రాంబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను సైతం హతమార్చాలని చూశారంటూ ఆరోపణలు చేశారు.

కాపులకు టీడీపీ వ్యతిరేకం!

వారే దాడి చేసి వారే కేసులు పెట్టి… వైసీపీ నేతలను వేధించడం ప్రభుత్వానికి అలవాటైందని అమర్నాథ్ విమర్శించారు. అంబటి రాంబాబును, ఆయన కుటుంబ సభ్యులను హతమార్చాలని చూశారని.. చంద్రబాబు ఇటువంటి హింసను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. కాపు నేతలకు టీడీపీ ముందు నుంచి వ్యతిరేకమని కరణం ధర్మశ్రీ విమర్శించారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా పేర్కొన్నారు. వంగవీటి రంగా హత్య, ముద్రగడపై హత్యా యత్నం వంటివి దానికి నిదర్శనమని తెలిపారు. అంబటి కాపు నేతల వాయిస్ వినిపిస్తున్నారట. అందుకే ఆయనపై దాడి చేశారట. కాపు నేతలను అణగదొక్కేందుకు చంద్రబాబు చూస్తున్నారని దీనికి కాపులంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.

ఇప్పుడు కులం గుర్తొస్తోందా?

అయితే గతంలో అంబటి రాంబాబే సొంత కూలాన్ని పలుమార్లు దూషించారు. అలాంటి అంబటి అరెస్ట్ అయితే కాపు కులమంతా ఏకమవడం.. పైగా రాష్ట్ర వ్యాప్తంగా కాపులంతా ఏకమవ్వాలని పిలుపునివ్వడం విడ్డూరంగా ఉంది. అన్యాయం జరిగింది అనిపిస్తే ప్రజలంతా ఏకమై అన్యాయాన్ని ఎదుర్కొందాం అని పిలుపునిస్తే ఒక అర్థం. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కేవలం కాపులనే ఓట్లు అర్థించరు కదా? అప్పుడు అంతా కావాలి. ఇలాంటి సందర్భాల్లో కులం గుర్తొస్తుందా? వేరే ఏ రాష్ట్రంలోనూ మరీ ఇంత కులపిచ్చి ఉండదేమో. ఇదొక్క ఏపీకే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ తీసేసి దీనికి కులప్రదేశ్ అని పెడితే బాగుంటుందేమోనని ఇతర రాష్ట్రాల ప్రజలు చెప్పుకుని నవ్వుకుంటున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 7, 2026 12:10 PM