Nara Lokesh: టీడీపీలో ఇకపై దబిడి దిబిడే! తమ్ముళ్లకు లోకేష్ అల్టిమేటం
రాజకీయాల్లోకి యువ రక్తం ప్రవేశించినప్పుడు.. వేగం పెరుగుతుంది, నిర్ణయాలు కఠినమవుతాయి. ఇప్పుడు టీడీపీ (TDP)లో అదే జరుగుతోంది! పార్టీకి అన్నీ తానై, భవిష్యత్తుకు భరోసానిచ్చే శక్తిగా యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) రూపాంతరం చెందుతున్నారు.
రాజకీయాల్లోకి యువ రక్తం ప్రవేశించినప్పుడు.. వేగం పెరుగుతుంది, నిర్ణయాలు కఠినమవుతాయి. ఇప్పుడు టీడీపీ (TDP)లో అదే జరుగుతోంది! పార్టీకి అన్నీ తానై, భవిష్యత్తుకు భరోసానిచ్చే శక్తిగా యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) రూపాంతరం చెందుతున్నారు. ఇకపై అలసత్వానికి, నిర్లక్ష్యానికి చోటు లేదంటూ.. సీనియర్లు, జూనియర్లు, కీలక నేతలు అని తేడా లేకుండా లోకేష్ తనదైన శైలిలో దుమ్ము దులుపుతున్నారు. ఇటీవల జరిగిన జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఇకపై టీడీపీలో దబిడి దిబిడే అన్నట్లుగా పరిస్థితి మారనుందని స్పష్టమవుతోంది. నిబద్ధత లేని నాయకులకు ఇక పక్కకు తప్పుకోవడమే మార్గమన్నట్టుగా లోకేష్ ఇచ్చిన అల్టిమేటం ఇప్పుడు పార్టీ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
వైసీపీని తిప్పి కొట్టడం లేదా?
ప్రభుత్వంపై, పార్టీపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలు చేస్తున్న విమర్శలను పార్టీలోని సీనియర్లు, ముఖ్య నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టడం లేదని లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జోగి రమేష్ (Jogi Ramesh) వంటి నేతలు బీసీ (BC) కార్డు వాడుతూ విమర్శలు చేస్తుంటే.. పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఎందుకు వాటిని తిప్పికొట్టడం లేదని ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. కేవలం ప్రభుత్వ పనులు మాత్రమే కాకుండా, పార్టీ సిద్ధాంతాలను, నేతలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని లోకేష్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా వెనుకబడితే సహించేది లేదని లోకేష్ తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి (MLA Kavya Krishna Reddy) తీరుపై యువనేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘మీ కోసం సుబ్బనాయుడు సీటు త్యాగం చేస్తే.. ఆయన మరణిస్తే కనీసం మీరు ఎందుకు పరామర్శకు వెళ్లలేకపోయారు?’ అని లోకేష్ నేరుగా నిలదీశారు. సీటు త్యాగం చేసిన నాయకుడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడం పట్ల లోకేష్ సీరియస్ అవ్వడం పార్టీలో క్రమశిక్షణ, బూత్ స్థాయి కార్యకర్త పట్ల నిబద్ధతకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఈ ఘటనను ఉదహరించి, ప్రతి కార్యకర్తను గౌరవించాల్సిన బాధ్యతను ఆయన గుర్తు చేశారు.
సొంత ఇమేజ్‌తో గెలిచామంటే కుదరదు!
పార్టీ కార్యకలాపాలపై నేతల నిర్లక్ష్యాన్ని లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ కార్యాలయంలోని గ్రీవెన్స్ నిర్వహణలో కూడా చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రజా దర్బార్ (Praja Darbar)ను స్థానిక నేతలు క్రమం తప్పకుండా నిర్వహిస్తే.. ఒక్కరోజే 5 వేల మంది సమస్యలతో రాజధానికి ఎందుకు వస్తారు? స్థానికంగా సమస్యలు పరిష్కరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సొంత ఇమేజ్‌తో గెలిచామనుకునేవారు స్వతంత్రంగా పోటీ చేసి గెలవొచ్చు’ అంటూ పరోక్షంగా కొందరు నేతలకు లోకేష్ గట్టి హెచ్చరిక పంపారు. పార్టీ లేకుండా ప్రజాప్రతినిధులు లేరు, అలాగే మంత్రి పదవులు లేవు. ఎంతటి వారికైనా పార్టీనే సుప్రీం అని స్పష్టం చేసిన లోకేష్, సీనియర్లు సైతం అవసరమైనప్పుడు కచ్చితంగా నోరు విప్పి, పార్టీ ఆదేశాలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.
మార్పులు, చేర్పులు!
ఇకపై టీడీపీలో పద్ధతి మారబోతోంది. అలసత్వం వహించేవారిని, వ్యక్తిగత ఇమేజ్‌ను పార్టీ కంటే గొప్పగా భావించేవారిని యువ నాయకత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని ఈ సమీక్షా సమావేశం తేటతెల్లం చేసింది. లోకేష్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు, నేతల్లో భయాన్ని పెంచడమే కాకుండా.. పార్టీని, ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి, ప్రజలకు అందుబాటులో ఉండటానికి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. పార్టీకి అన్నీ తానై, క్రమశిక్షణకు పట్టం కడుతున్న యువనేత.. రాబోయే రోజుల్లో టీడీపీని మరింత పటిష్టం చేసే దిశగా వేస్తున్న తొలి అడుగు ఇది!
ప్రజావాణి చీదిరాల