Pemmasani Chandrasekhar: అమరావతికి నారాయణ పాయే.. పెమ్మసాని వచ్చే!
రాజధాని అమరావతి వ్యవహారాల్లో గత దశాబ్దంగా ఏకఛత్రాధిపత్యం వహించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాత్ర పరిమితం కాబోతోందా? ఆయనను ఉద్దేశించి టీడీపీ వర్గాల్లోనే జోకులు వేసుకునే ‘అమరావతి స్పెషల్ మినిస్టర్’ హోదాకు తెరపడుతోందా?
రాజధాని అమరావతి వ్యవహారాల్లో గత దశాబ్దంగా ఏకఛత్రాధిపత్యం వహించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాత్ర పరిమితం కాబోతోందా? ఆయనను ఉద్దేశించి టీడీపీ వర్గాల్లోనే జోకులు వేసుకునే ‘అమరావతి స్పెషల్ మినిస్టర్’ హోదాకు తెరపడుతోందా? అంటే, ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనూహ్య ఎంట్రీతో.. అమరావతి రాజకీయం కొత్త మలుపు తీసుకుందన్న చర్చ హాట్ టాపిక్‌గా మారింది.
2014లో రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ మొదలు, మధ్యలో వైసీపీ పాలనలో ఎదురైన ప్రతిష్టంభన, తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాజధాని వ్యవహారాలన్నింటినీ నారాయణే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో, అమరావతి వ్యవహారాలను డీల్ చేయడంలో ఆయన పాత్ర అపారమైనది. అయితే, సడన్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే సందేహాలు మొదలయ్యాయి. ఈ కమిటీలో పెమ్మసాని, నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. కీలకమైన రాజధాని వ్యవహారాల్లో కేంద్ర మంత్రిని భాగం చేయడం, పైగా ఆయనకు కీ రోల్ దక్కడం నారాయణ పాత్ర తగ్గింపు సంకేతాలనే సూచిస్తోంది.
హైకమాండ్ అలర్ట్ ఇందుకేనా?
త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు ముఖ్య కారణం.. రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడిచినా, రైతుల ప్లాట్ల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక సమస్యలు ముందుకు కదలడం లేదనే విమర్శలు నారాయణపై వెల్లువెత్తాయి. పదేళ్లుగా పోరాడుతున్న రైతులు, సమస్యల పరిష్కారం విషయంలో నారాయణ వ్యవహారశైలి సరిగా లేదంటూ తీవ్ర నిరాశకు గురయ్యారట. నారాయణకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో, రైతులు ఇటీవలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు సైతం సిద్ధమయ్యారట. ఈ పరిణామం పరువు తక్కువగా భావించిన ప్రభుత్వ పెద్దలు, ఈ ఎపిసోడ్‌కు వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించారట. ఇందులో భాగంగానే స్థానిక ఎంపీ పెమ్మసానిని త్రిసభ్య కమిటీలోకి తీసుకున్నారని తెలుస్తోంది. పెమ్మసాని కమిటీలోకి వచ్చిన వెంటనే తన దూకుడు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. కమిటీ ఏర్పాటు అయిన కొద్దిరోజుల్లోనే ఆయన వరుసగా మూడు మీటింగ్స్ నిర్వహించారు. ఇది రైతుల్లో నమ్మకం కలిగించే ప్రయత్నంగా కనిపిస్తోంది.
పెమ్మసాని యాక్టివ్ రోల్
లోకల్ ఎంపీగా పెమ్మసాని, ఎమ్మెల్యేగా శ్రవణ్, మున్సిపల్ మంత్రిగా నారాయణ ఉన్నప్పటికీ.. కేంద్ర మంత్రి హోదా, రైతులతో డీల్ చేయడంలో ఆయన సామాజికవర్గ ప్రభావం వంటి అంశాలు పెమ్మసానికే యాక్టివ్ రోల్ దక్కేలా చేశాయనే వాదన బలంగా వినిపిస్తోంది. సమస్యల పరిష్కారం విషయంలో నారాయణ వ్యవహారశైలిపై రైతులు అసహనం వ్యక్తం చేయగా, సీఆర్‌డీఏ అధికారులు కూడా ఆయనపై అసంతృప్తిని వ్యక్తం చేయడం ఈ మార్పులకు కారణమైంది. ఓవరాల్‌గా, ఈ రకరకాల అంతర్గత కారణాలు కలగలిసి.. ఇప్పటివరకు రాజధాని వ్యవహారాలన్నిటినీ ఒంటిచేత్తో నడిపించిన నారాయణ పాత్రను పరిమితం చేసి, పెమ్మసానికి క్రియాశీలక పాత్ర కట్టబెట్టాయన్నది అమరావతిలో వినిపిస్తున్న టాక్. ఇకపై నారాయణ కేవలం మున్సిపల్ మంత్రి పాత్రకే పరిమితమై సైలెంట్ అవుతారా? లేక భవిష్యత్తు రాజధాని నిర్మాణ బాధ్యతల్లో పెమ్మసాని చురుగ్గా ఉంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే పరిణామాలు ఈ ఇద్దరు కీలక నేతల భవిష్యత్ పాత్రను తేల్చనున్నాయి.
ప్రజావాణి చీదిరాల