KTR: అరెస్టుల అదృష్టం.. చంద్రబాబుకు రాజయోగం.. కేటీఆర్ కథేంటి?
తెలంగాణ రాజకీయాలు (Telangana Politcs) ప్రస్తుతం అరెస్టుల అదృష్టంపై ఊగిసలాడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఒకవేళ బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అరెస్టు జరిగితే, గతంలో ఏపీలో చంద్రబాబు అరెస్టుతో..
తెలంగాణ రాజకీయాలు (Telangana Politcs) ప్రస్తుతం అరెస్టుల అదృష్టంపై ఊగిసలాడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఒకవేళ బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అరెస్టు జరిగితే, గతంలో ఏపీలో చంద్రబాబు అరెస్టుతో టీడీపీకి దక్కిన అధికార అదృష్టం బీఆర్‌ఎస్ (BRS)కు కూడా దక్కుతుందా? అనే ఊహలు గులాబీ శిబిరంలో బలంగా నడుస్తున్నాయి. ఆ అరెస్టుతో కాంగ్రెస్ పాతాళానికి పడుతుందని వారు కలలు కంటున్నారు. కానీ, రాజకీయాల్లో అన్ని అరెస్టులు అధికారాన్ని ఇవ్వలేవ్వన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఎందుకంటే.. చంద్రబాబు అరెస్టు జరిగినప్పుడు టీడీపీ (TDP)కి వచ్చిన సానుభూతి, ఇక్కడ కేటీఆర్‌కు లభిస్తుందా? అనేదే అసలైన ప్రశ్న. నిజం చెప్పాలంటే, బీఆర్‌ఎస్‌లో కవిత (KTR) అరెస్టు జరిగిన తర్వాత పార్టీ రాజకీయంగా ఎదురుదెబ్బ తిన్నదే తప్ప, ఎటువంటి లబ్ధి పొందలేదు. కవిత అరెస్టు (Kavitha Arrest) అంశం బీఆర్ఎస్ (BRS)ను మరింత సంక్షోభంలోకి నెట్టిందనేది జగమెరిగిన సత్యమే. ఈ క్రమంలో, కవిత అరెస్టుతో మొదలైన బీఆర్‌ఎస్ పతనం కేటీఆర్ అరెస్టుతో ముగుస్తుందనుకోవడం గులాబీ పార్టీ అత్యాశే అవుతుందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఒకవేళ తెలంగాణ సమాజం ఈ అరెస్టును కూడా న్యాయమని భావిస్తే, బీఆర్‌ఎస్ పతనం మరింత బలంగా, వేగంగా ఉంటుంది అనేది గ్రహించాలి.
కేటీఆర్ ధీమా వెనుక భయమా?
ఫార్ములా ఈ కేసులో తన తప్పేమీ లేదని, ఆ సంగతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి కూడా తెలుసు కాబట్టే రేవంత్ సర్కార్ ముందుకెళ్లలేకపోతోందంటూ కేటీఆర్ ఖరాకండిగా చెబుతున్నారు. అయితే, ఈ ధీమా వెనుక నిజంగా సాహసం చేయరేమో అనే భయమే ఎక్కువ దాగి ఉందా? అనే సందేహం కలుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రచారం చేస్తున్నట్టుగా కేసులో నిజంగా తప్పిదాలు ఉంటే, ఈ పెద్ద మనిషి సలహాను రేవంత్ ఎందుకు పట్టించుకోవాలి? రాజకీయాల్లో ప్రత్యర్థికి బలం చేకూర్చే సాహసం ఎవరూ చేయరు. రాజకీయ నాయకుడి అరెస్టు, ప్రత్యర్థి పార్టీల కక్షసాధింపులో భాగమని ప్రజలు విశ్వసించినప్పుడే ఆ పార్టీకి బలం, ఆ నాయకుడికి సానుభూతి పెరుగుతాయి. అందుకే అప్పుడు చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest)ను టీడీపీ (TDP)తో పాటు జనసేన బలంగా ఖండించింది, బీజేపీ (BJP) సైతం మద్దతు పలికింది. మరి ఇక్కడ కేటీఆర్ అరెస్టు జరిగితే, బీఆర్‌ఎస్‌కు మద్దతు పలికేందుకు అటు బీజేపీ కానీ, ఇటు మిత్రపక్షాలైన ఎంఐఎం కానీ, అత్యంత సన్నిహితంగా ఉండే వైసీపీ కానీ ముందుకొస్తాయా? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నే. పోనీ, కేటీఆర్ అరెస్టును వైసీపీ ఖండిస్తే, ఏపీలో ఆ పార్టీకి రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది. కాబట్టి ఆ సాహసం వైసీపీ వందకు వెయ్యి శాతం చేయకపోవచ్చు.
పోలిక అవివేకమే..
కాబట్టి, చంద్రబాబు (AP CM Chandrababu) అరెస్టును కేటీఆర్ అరెస్టుతో పోల్చుకుని ఇప్పుడే రాజకీయ అంచనాలు వేయడం అవివేకమే అవుతుంది. రాజకీయాలలో ఎప్పుడు శత్రువులే కాదు, మిత్రులు కూడా ఉండాలి అనే పాఠాన్ని గులాబీ నేతలు ఇప్పుడు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, చంద్రబాబు అరెస్టు జరిగినప్పుడు బీజేపీ, జనసేన (Janasena) వంటి పార్టీలు గట్టిగా మద్దతు పలకడం ద్వారానే ప్రజలలో సానుభూతి బలంగా నాటుకుంది. కానీ, బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం ఆ రాజకీయ ఏకాభిప్రాయం కరువైంది. కవిత అరెస్టు జరిగినప్పుడు కూడా ఇతర పార్టీల మద్దతు లభించలేదు. దీంతో ఒంటరి పోరాటం అనేది వీరత్వం కావచ్చు, కానీ అధికారం దక్కాలంటే మాత్రం పది పార్టీల మద్దతు కావాలి. ఆ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికే ఈ అరెస్టుల ఊహలు పనికి వస్తాయి తప్ప, వాస్తవంగా ఓట్లను కుమ్మరించలేవు. ఈ నేపథ్యంలో, కేవలం అరెస్టు జరిగితే చాలు మళ్లీ అధికారం దక్కుతుందనే బీఆర్‌ఎస్ అత్యాశ.. తెలంగాణ రాజకీయాల ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడమే అవుతుంది.
ప్రజావాణి చీదిరాల