Lokesh: 3.6 సెకన్ల లోకేష్ మ్యాజిక్.. 4 గంటల్లో 4 వేల సమస్యల్లో నిజమెంత?
టీడీపీ యువ నేత, ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కేవలం 4 గంటల వ్యవధిలో 4 వేల సమస్యలను విన్నారు అన్నదే ఆ సంచలనాత్మక ప్రకటన! ఈ గణాంకం నిజంగానే జరిగి ఉంటే, ఇది ప్రపంచ రికార్డుకు ఏమాత్రం తక్కువ కాదు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) ఇటీవల ఒక సంఖ్యాపరమైన ప్రకటన తీవ్ర చర్చకు, అంతకంటే మించి అపారమైన ట్రోలింగ్‌కు దారి తీసింది. టీడీపీ యువ నేత, ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కేవలం 4 గంటల వ్యవధిలో 4 వేల సమస్యలను విన్నారు అన్నదే ఆ సంచలనాత్మక ప్రకటన! ఈ గణాంకం నిజంగానే జరిగి ఉంటే, ఇది ప్రపంచ రికార్డుకు ఏమాత్రం తక్కువ కాదు. కానీ, దీనిని కాస్త లోతుగా, గణితపరంగా పరిశీలిస్తే.. ఈ ప్రచారం వెనుక ఉన్న పీఆర్ పిచ్చి, అతిశయోక్తి స్పష్టమవుతుంది. ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వ్యంగ్యాస్త్రాలు, విమర్శలతో రచ్చ రచ్చ అవుతోంది.
వామ్మో టైమ్ మిషనా..!
లోకేష్ (Nara Lokesh) ఈ రికార్డు వెనుక ఉన్న అసలు లెక్కను పరిశీలిస్తే, వాస్తవం వెల్లడవుతుంది. 4 గంటలు అంటే మొత్తం 14,400 సెకన్లు (4 x 60 నిమిషాలు x 60 సెకన్లు). లోకేష్ 4 వేల సమస్యలను విన్నారు, పరిష్కరించారనే ప్రచారం ప్రకారం, ప్రతి సమస్యకు కేటాయించిన సమయం కేవలం 3.6 సెకన్లు (14,400 ÷ 4,000). సమస్య చెప్పుకోడానికి వచ్చిన ఒక సామాన్య పౌరుడు.. తన పేరు, ఊరు చెప్పుకోవడానికి, ఒక నమస్కారం పెట్టడానికి, నాయకుడితో ఒక ఫోటో దిగడానికి ఎంత లేదన్నా కనీసం ఒకటి లేదా రెండు నిమిషాల సమయం తీసుకుంటారు. అంటే 60 నుంచి 120 సెకన్లు! ఈ మాత్రం లాంఛనాలు పూర్తి చేయడానికే నిమిషాల సమయం పడుతుంటే, కేవలం 3.6 సెకన్లలో సమస్య వినడం, దాన్ని అర్థం చేసుకోవడం, పరిష్కారానికి హామీ ఇవ్వడం, లేదా దాన్ని రికార్డు చేయడం అనేది మానవ సహజ ప్రక్రియకు విరుద్ధం. ఇది పూర్తిగా అసంభవం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరువు పెంచడమా? తీయడమా?
ఈ 3.6 సెకన్ల రికార్డు ఇప్పుడు లోకేష్ ప్రతిపక్షాలు, నెటిజన్లకు ఒక బలమైన ట్రోలింగ్ అస్త్రంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) చదివిన 2 లక్షల పుస్తకాల పఠనం, నారా చంద్రబాబు అస్తమానూ చెప్పుకునే హైదరాబాద్ అభివృద్ధి.. అది నేనే.. ఇది నేను లాంటి అతిశయోక్తుల సరసన లోకేష్ ఈ 4K ప్రచారం చేరింది. సోషల్ మీడియా (Social Media)లో అయితే చినబాబుకు ఏం చేసినా నిమిషాల్లో దొరకడం అలవాటబ్బా! అంటూ వైసీపీ శ్రేణులు, జగన్ వీరాభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో (TDP Cadre) కూడా ఈ అతిశయోక్తిపై అంతర్గత చర్చ మొదలైంది. జాకీలతో లేపడం అనే ప్రచారం మరీ ఇంత పరాకాష్టకు చేరుకోవడంపై సొంత పార్టీ కార్యకర్తలే కన్నెర్రజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది పార్టీకి నిజంగా ట్రాక్ రికార్డు అవుతుందా, లేక కేవలం సామాజిక మాధ్యమాల్లో నవ్వులపాలు చేసే ఒక ప్రయత్నంగా మిగిలిపోతుందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
అంతే సంగతులు!
ఒకవేళ, ఈ నాలుగు గంటల్లో నాలుగు వేల మంది లోకేష్‌ను కలవడం నిజమే అనుకుందాం. ఇది గ్రౌండ్ స్థాయిలో ప్రజల సమస్యలు ఏ స్థాయిలో పేరుకుపోయాయో, రాష్ట్రం ఎంత పెద్ద సమస్యల వలయంగా మారిందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నది. ప్రజలు ఇంత తక్కువ సమయంలో కూడా తమ నాయకుడిని కలవడానికి ఉత్సాహం చూపిస్తున్నారంటే.. అధికారంలో ఉన్న పార్టీ నుంచి వారికి పరిష్కారం దొరకడం లేదనేది స్పష్టం. అందుకే టీడీపీ నేతలు (TDP Leaders).. తమ యువనేత పీఆర్ (Public Relations) విషయంలో మరింత జాగ్రత్త వహించాలని, పీఆర్ పిచ్చి మరీ ఇంతగా ఉంటే, ప్రజల్లో ఉన్న కొద్దిపాటి విశ్వాసం కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రచారాన్ని ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉంచడం, గణితం, లాజిక్‌లను గౌరవించడం అత్యవసరం. లేదంటే, ఈ అతిశయోక్తి ప్రచారం లోకేష్ గారి పరువు పెంచడానికి బదులు, పరువు తీయడానికే దారితీస్తుంది. అందుకే అంటారు.. అతి సర్వత్ర వర్జయేత్ అని!
ప్రజావాణి చీదిరాల