Politics

Lakshminarayana: ఖాకీ వదిలి.. ఖద్దరు చూసి.. ఇప్పుడు కార్పొరేట్ బాటలో మాజీ జేడీ!

తెలుగు రాష్ట్రాల్లో మాజీ జేడీ లక్షీ నారాయణ అంటే తెలియని వారు ఉండరు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా సంచలన కేసులను విచారించి, అవినీతిపై సింహస్వప్నంగా నిలిచిన వి.వి. లక్ష్మీనారాయణ ఇప్పుడు సరికొత్త అవతారంలోకి మారారు.

Lakshminarayana: ఖాకీ వదిలి.. ఖద్దరు చూసి.. ఇప్పుడు కార్పొరేట్ బాటలో మాజీ జేడీ!

తెలుగు రాష్ట్రాల్లో మాజీ జేడీ లక్షీ నారాయణ అంటే తెలియని వారు ఉండరు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా సంచలన కేసులను విచారించి, అవినీతిపై సింహస్వప్నంగా నిలిచిన వి.వి. లక్ష్మీనారాయణ ఇప్పుడు సరికొత్త అవతారంలోకి మారారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నించి, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఇప్పుడు ఆయన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) గ్రూపు అనుబంధ సంస్థలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

సీబీఐ అధికారిగా..

ఆయన ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను విచారించిన తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది. నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా, యువతకు స్ఫూర్తినిచ్చే వక్తగా ఆయన వేల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. ఆ సమయంలో ఆయనకు వచ్చిన క్రేజ్ చూసి, రాజకీయాల్లోకి వస్తే పెను మార్పులు వస్తాయని చాలామంది భావించారు.

రాజకీయాల్లో ఎదురుదెబ్బలు!

అనేకమంది ఉన్నతాధికారులు పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి విఫలమైనట్లే, లక్ష్మీనారాయణకు కూడా రాజకీయ ప్రయాణం ఆశించినంత సాఫీగా సాగలేదు. 2019లో జనసేన పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చారు. 'జేడీ ఫౌండేషన్' ద్వారా సామాజిక సేవ చేస్తూనే, ఇటీవల 'భారత్ చైతన్య యువజన పార్టీ' (BCYP) పేరుతో సొంత పార్టీని స్థాపించారు. అయితే రాజకీయాల్లో రాణించాలంటే కేవలం క్లీన్ ఇమేజ్ మాత్రమే సరిపోదని, ఇతర సమీకరణాలు కూడా ఉంటాయని ఆయనకు అర్థమైంది.

మలుపు తిప్పిన ఆర్థిక ఇబ్బందులు?

గడిచిన కొద్ది కాలంగా లక్ష్మీనారాయణ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనట్లు సమాచారం. ముఖ్యంగా ఆయన భార్య సుమారు మూడు కోట్ల రూపాయల మేర ఆర్థికంగా నష్టపోయినట్లు వార్తలు వచ్చాయి. సైబర్ నేరగాళ్ల వలలో పడి ఊహించని రీతిలో నష్టపోయారు. దీంతో అటు ఆర్థికంగా.. ఇటు రాజకీయాల్లో కొనసాగడం అంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని తెలుసుకున్నారని టాక్. ఈ క్రమంలోనే కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మళ్లీ ఉద్యోగ బాధ్యతలు చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మేఘా గ్రూపులో కీలక బాధ్యత

ప్రస్తుతం ఆయన మేఘా గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ విభాగం (Olectra) బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. వైస్ ప్రెసిడెంట్ హోదాలో కంపెనీ కార్యకలాపాలను, మేనేజ్‌మెంట్‌ను ఆయన నడిపించబోతున్నారు. ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్న పరిపాలనా దక్షతను, క్రమశిక్షణను ఇప్పుడు కార్పొరేట్ రంగంలో ఉపయోగించనున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వచ్చే పేరుప్రతిష్ఠలు, ప్రజల ఆదరణ రాజకీయాల్లో ఓట్లుగా మారతాయనుకోవడం పొరపాటని లక్ష్మీనారాయణ గారి ప్రస్థానం నిరూపిస్తోంది.

అవును.. సరైనదే..!

లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ మొదలుకొని కిరణ్ బేడీ వరకూ ఎందరో మేధావులు రాజకీయాల్లో ఇమడలేకపోయారు. ప్రజాసేవ చేయాలనే తపన ఉన్నప్పటికీ, రాజకీయ చదరంగంలో వారు పావులుగా మారలేకపోవడమే దీనికి ప్రధాన కారణం. లక్ష్మీనారాయణ రాజకీయాలకు స్వస్తి చెప్పి కార్పొరేట్ బాట పట్టడం ఆయన అభిమానులకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా, ఆచరణాత్మకంగా ఇది సరైన నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ రంగంలో ఉన్నా తన నీతిని, నిజాయితీని కాపాడుకునే లక్ష్మీనారాయణ, ఈ కొత్త ఇన్నింగ్స్‌లో కూడా తనదైన ముద్ర వేస్తారని ఆశిద్దాం..!

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 17, 2026 4:53 AM