KTR: ఉత్తర కుమార ప్రగల్బాలకు పోతే పార్టీ బొందలగడ్డకే..
కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే కానీ.. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం దెబ్బతింటారు. కిందపడినా పైచేయి అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదంతా ఎవరి గురించి అంటే తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ గురించి అని చెప్పక తప్పడం లేదు.
కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే కానీ.. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం దెబ్బతింటారు. కిందపడినా పైచేయి అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదంతా ఎవరి గురించి అంటే తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ గురించి అని చెప్పక తప్పడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ పార్టీ అధినేతను కష్టాలపాలు చేసింది. పార్టీ పతనానికి కారణమైంది.
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ స్థాయిలో సత్తా చాటాలనుకోవడం అత్యాశ మాత్రం అయ్యుండకపోవచ్చు కానీ అప్పటికే రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యతిరేకతను గుర్తించకపోవడం మాత్రం ఆ పార్టీ తప్పిదమే అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్ చేస్తున్నది ఒకటే తప్పు. అదేంటంటే.. ఇవ్వాల్సిన కింది స్థాయి నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం. ఏమాత్రం ప్రజాదరణ లేని నేతలను అందలానికి ఎక్కించాలనుకోవడం. అదే సొంత రాష్ట్రంలో పార్తీ పతనానికి ప్రధాన కారణం.
పార్టీ పరిస్థితి దారుణం..
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోనే పార్టీ పతనావస్థలో ఉన్న విషయాన్ని గుర్తించక.. సెంటిమెంటును బొందపెట్టి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ స్థాయికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిచ్చెనలేశారు. తెలంగాణలో బొక్క బోర్లా పడిన తర్వాత కానీ అసలు విషయం కేసీఆర్‌కు బోధ పడలేదు. అయినా సరే.. నేటికీ ఆయన తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఉత్తర కుమారుడి మాదిరిగా ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలను పక్కనబెడితే ఆ తరువాత జరిగిన ఉపఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ సత్తా చాటలేకపోయింది. పైగా సిట్టింగ్ స్థానాలనే కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన పంచాయతీ ఎన్నికలు కావొచ్చు.. తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికలు కావొచ్చు. పార్టీ పరిస్థితి దారుణంగా దిగజారింది.
ఇప్పుడెందుకు వస్తోంది?
ఇప్పటికైనా పరిస్థితులు సమీక్షించుకుని.. తమను తాము సరిదిద్దుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్న పాపాన పోవడం లేదు. పైగా కేటీఆర్ వచ్చేసి.. “ఈ ఎన్నికల ఫలితాలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదు. మేమే ఖచ్చితంగా గెలిచి తీరుతాం” అని చెబుతున్నారు. మరి అధికారంలో ఉండగా.. ఈ మాట కేటీఆర్ నోటి వెంట ఎందుకు రాలేదు? ఇప్పుడెందుకు వస్తోంది? అసెంబ్లీ ఫలితాలకు.. మునిసిపల్ ఎన్నికలకు సంబంధమే లేదనుకుందాం. ఉపఎన్నికతో సంబంధం ఉండే అవకాశం లేదా? జూబ్లీహిల్స్, కంటోన్మెంట్‌ను ఎందుకు కోల్పోయినట్టు? వరుస వైఫల్యాలు నేతలనే కాదు.. కేడర్‌ను సైతం పార్టీకి దూరం చేస్తాయి. ఇవి కూడా తెలుసుకోకుంటే ఎలా?
చలనం లేకుంటే ఎలా?
ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ క్రమక్రమంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతును కోల్పోతూ వస్తోంది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పొందింది లేదు. పైగా మునిసిపల్ ఎన్నికల్లో 116 మునిసిపాలిటీల్లో కేవలం 13 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయినా చలనం లేకుంటే ఎలా? అసలు ఇప్పటికే కొందరు నేతలను పక్కనబెట్టి.. అసలు పని చేసే నాయకులు ఎవరన్నది పార్టీ పరిశీలించుకోవాలి. అది మానేసి ఈ ఎన్నికలకూ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదంటూ బింకాలకు పోతే పార్టీ మనుగడే ప్రశ్నార్ధకమై పోతుంది. ఇప్పటికే అలాంటి పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. వాటిని సెట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ప్రజావాణి చీదిరాల