Konda Surekha: కూతురు సీఎంపై విమర్శలు.. భర్త ప్రశంసలు.. ఏం జరుగుతోంది?
తప్పు తన వారి వైపు ఉన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉపేక్షించరా? లేదంటే ఏమైనా టార్గెటింగ్ రాజకీయాలు నడుస్తున్నాయా? అసలేం జరుగుతోంది?

తప్పు చేస్తే ట్రీట్‌మెంట్ ఒకేలా ఉండాలి. గతంలో బీఆర్ఎస్ నేతల (BRS Leaders)పై ఫోకస్ పెట్టినప్పుడు వారి హయాంలో జరిగిన కొన్ని తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎత్తి చూపినప్పుడు బీఆర్ఎస్ నేతలు నానా హంగామా చేశారు. కానీ తప్పు తన వారి వైపు ఉన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉపేక్షించరా? లేదంటే ఏమైనా టార్గెటింగ్ రాజకీయాలు నడుస్తున్నాయా? అసలేం జరుగుతోంది? గత రాత్రి అదే కొండా సురేఖ ఇంటి వద్ద మఫ్టీలో పోలీసులు రావడం.. ఆ తరువాత జరిగిన రచ్చతో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ (Jublee Hills)లో మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) నివాసముంటున్నారు. గత రాత్రి ఆమె ఇంటి వద్ద కొందరు సంచరిస్తుండటాన్ని చూసిన ఆమె కూతురు సుస్మిత (Konda Surekha Daughter Susmitha) బయటకు వచ్చి వారిని ప్రశ్నించారు. అప్పుడు కానీ ఆ బయట సంచరిస్తోంది పోలీసులు అన్న విషయం తెలియలేదు. వారు సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం వచ్చినట్టు తెలియడంతో అంతా షాక్ అయ్యారు. అయితే వారిని తమ ఇంట్లోకి అనుమతించేది లేదంటూ సుస్మిత తెగేసి చెప్పారు. ఆ తరువాత కొండా సురేఖ, ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఇద్దరూ ఒకే కారులో వెళ్లిపోవడం గమనార్హం.
మా అమ్మను అరెస్ట్ చేసేందుకే..
మొత్తానికి ఈ హైడ్రామా పూర్తైన అనంతరం కొండా సురేఖ కుమార్తె సుస్మిత మీడియాతో పాటు కాంగ్రెస్ నేతల (Congress Leaders)తో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. డెక్కన్ సిమెంట్ (Deccan Cement)కు సంబంధించిన వ్యక్తులను గన్‌తో బెదిరించారంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు చెప్పారని సుస్మిత తెలిపారు. దీనిలో కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి సైతం ఉన్నారని ఆమె అన్నారు. దీంతో ఆగితే బాగానే ఉండేది. రోహిణ్ వెనుక సీఎం రేవంత్ పాత్ర కూడా ఉందా? అంటూ ప్రశ్నించారు. అది మాత్రమే కాకుండా సుమంత్ పేరు చెప్పి తన తల్లిని అరెస్ట్ చేసేందుకే మహిళా పోలీసులు కూడా వచ్చారంటూ సుస్మిత ఆరోపణలు చేశారు. సుమంత్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఫిర్యాదు చేసినట్టుగా తనకు తెలిసిందన్నారు. అయితే ఆధారాలను చూపించమంటే పోలీసులను అడిగితే వరంగల్‌లో నమోదైన మరో కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చినట్టుగా తెలిపారని.. తమను పార్టీ నుంచి బహిష్కరించేందుకు చూస్తున్నట్టుగా సుస్మిత వెల్లడించారు.
కొండా సురేఖను టార్గెట్ చేస్తున్నారా?
మొత్తానికి కొండా సురేఖ కుమార్తె సుస్మిత మరికొన్ని సంచలన వ్యాఖ్యలను సైతం చేశారు. పార్టీ నుంచి తమను బహిష్కరించేందుకు చూస్తున్నారని.. అలాగే ఈ మొత్తం వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రెడ్డి నేతలంతా ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం మొత్తం కాంగ్రెస్ పార్టీలో రేగిన దుమారాన్ని అయితే హైలైట్ చేస్తోంది. నిజంగానే సుస్మిత చెప్పినట్టు రెడ్డి నాయకులు.. కొండా సురేఖను టార్గెట్ చేస్తున్నారా? అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. మరోవైపు కొండా సురేఖ భర్త కొండా మురళి మాత్రం సీఎం రేవంత్‌కు తమకూ మధ్య ఎలాంటి విభేదాలూ లేవన్నారు. ఎవరైనా విభేదాలు సృష్టిస్తే మాత్రం తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. మొత్తానికి కూతురేమో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రెడ్డి నాయకులంటూ ఇతర నేతలపై విమర్శలు గుప్పిస్తే.. కొండా మురళి (Konda Murali) డ్యామేజ్ కంట్రోల్‌కు తన వంతు కృషి తాను చేశారు. పైగా తనకు ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం చెప్పారని.. తప్పకుండా ఇస్తారని.. సీఎం ఇచ్చిన మాటపై నిలబడతారన్నట్టుగా ఒకరకంగా ప్రశంసించారు. ముందు ఏం జరుగుతుందో చూడాలి.
ప్రజావాణి చీదిరాల