Politics

Konda Surekha: వేలిముద్రగాళ్లు సీఎంలవుతున్నారంటూ కొండా సురేఖ సంచలనం

మాజీ మంత్రి కొండా సురేఖ.. మాజీ అయిన తర్వాత కూడా నోటిని అదుపులో పెట్టుకుంటున్నట్టు లేరు. ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. వాస్తవానికి ఆమె కావాలనే వివాదాలను వెదుక్కుంటూ వెళుతున్నారా?

Konda Surekha: వేలిముద్రగాళ్లు సీఎంలవుతున్నారంటూ కొండా సురేఖ సంచలనం

మాజీ మంత్రి కొండా సురేఖ.. మాజీ అయిన తర్వాత కూడా నోటిని అదుపులో పెట్టుకుంటున్నట్టు లేరు. ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. వాస్తవానికి ఆమె కావాలనే వివాదాలను వెదుక్కుంటూ వెళుతున్నారా? లేదంటే ఆమె ఏం మాట్లాడినా వివాదమవుతోందా? అనేది అర్థం కాకుండా ఉంది. ఆ మధ్య టాలీవుడ్ హీరోయిన్ సమంత, హీరో అక్కినేని నాగార్జునలను ఉద్దేశిస్తూ సురేఖ చేసిన కామెంట్లు కాక రేపాయి. చివరకు క్షమాపణ చెప్పి ఆ వివాదం నుంచి తప్పించుకున్నారు. ఆ తరువాత ఓఎస్‌డీ వివాదం.. ఆ వివాదంలో ఆమె కూతురు సుస్మిత సైతం భాగమయ్యారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ దెబ్బకు సురేఖ మంత్రి పదవి పోగోట్టుకోవాల్సి వచ్చింది.

కష్టపడితే కానీ అవలేరు..

అయినా సరే.. ఆమె మాత్రం మారేలా కనిపించడం లేదు. తిరిగి మరోసారి వివాదానికి కొండా సురేఖ తెరదీశారు. తిరిగి ఏకంగా సీఎంపైనే వ్యాఖ్యలు. అయితే ఫలానా సీఎం అని పేరు పెట్టలేదు కాబట్టి కొంత సేఫ్‌ జోన్‌లో ఉన్నట్టే. ఏది ఏమైనా కొంత డ్యామేజింగ్ వ్యాఖ్యలే చేశారు. రాజకీయాల్లో వేలిముద్రగాళ్లు సైతం సీఎం అవుతున్నారని.. అయినా కూడా వారు చెప్పినట్టుగా ఐఏఎస్, ఐపీఎస్‌లు తలాడించాల్సి వస్తోందని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన 10వ వార్షికోత్సవ వేడుకల్లో కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అవడమంటే.. సాధారణ విషయం కాదని.. ఎంతో కష్టపడితే కానీ అవలేరని.. అయినా కూడా రాజకీయ నాయకుల ముందు నిలుచొని వారు చెప్పేది వినాల్సి వస్తోందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.

వారిని తిట్టినా తప్పులేదు..

పైగా అలా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వినాలని రాజ్యాంగంలో రాసి ఉంది కాబట్టి దానికి మనం ఏమీ చేయలేమని కూడా కొండా సురేఖ అన్నారు. అంతటితో ఆగారా? దానిని విమర్శగా తీసుకుని.. వివాదం చేయవద్దన్నారు. అసలు అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అని పెద్దోళ్లు ఎప్పుడో అన్నారు. వివాదమయ్యే వ్యాఖ్యలు చేయడమెందుకు.. తిరిగి వివాదం చేయవద్దని కోరడమెందుకు? పైగా అవి తన మనసులో మాటలని ముక్తాయింపు. తమకు చదువు రాకున్నా.. సబ్జెక్ట్ తెలియపోయినా కూడా తాము అధికారులను తిడుతూ ఉంటామని తెలిపారు. రూల్స్ ఒప్పుకోని సందర్భంలో అధికారులు ఆ పని చేయరని.. వారి గురించి అయితే తాను మాట్లాడటం లేదని.. రూల్స్ ఒప్పుకున్నా పని చేయని అధికారులను తిట్టినా తప్పులేదన్నారు. మొత్తానికి కొండా సురేఖ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కొండా సురేఖ తాను కూర్చున్న కొమ్మను తనే నరుక్కుంటున్నారనడంలో సందేహమే లేదని నెటిజన్లు అంటున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 18, 2026 6:59 AM