Politics

KCR: ఫామ్‌హౌస్‌లో నిద్రలేచి జనంలోకి కేసీఆర్.. ఇక కాంగ్రెస్ కథేంటి?

ఈ అనూహ్య విజయం, ఒక రకంగా, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)కు బూస్ట్ ఇచ్చింది. ఇక, చాలా రోజులుగా బయటి ప్రపంచం అంటేనే పలకరించకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్ (BRS) అధినేత కేసీఆర్ ఎట్టకేలకు బయటికి వస్తున్నారు.

KCR: ఫామ్‌హౌస్‌లో నిద్రలేచి జనంలోకి కేసీఆర్.. ఇక కాంగ్రెస్ కథేంటి?

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ‘కారు’ పార్టీ దాదాపుగా చతికిలపడిన సంగతి తెలిసిందే. చివరికి, జూబ్లీహిల్స్ (Jubleehills) వంటి సిట్టింగ్ స్థానంలోనూ పరాజయం పాలైంది. పార్టీ వర్గాలు, అభిమానులు నిరాశలో కూరుకుపోయిన వేళ, అనూహ్యంగా జరుగుతున్న లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు నాన్‌స్టాప్ స్పీడ్ ఇస్తున్నాయి. ఈ అనూహ్య విజయం, ఒక రకంగా, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)కు బూస్ట్ ఇచ్చింది.

చాలా రోజులుగా బయటి ప్రపంచం అంటేనే పలకరించకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్ (BRS) అధినేత కేసీఆర్ ఎట్టకేలకు బయటికి వస్తున్నారు. ఇది విమర్శలకు, సెటైర్లకు తావిచ్చే అంశమే! ఓటమి తర్వాత కూడా ఇంత ఆలస్యంగా ఎందుకు?, ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది? అంటూ ప్రత్యర్థులు గుసగుసలాడుతున్నా, ఈయన రంగంలోకి దిగడం మాత్రం పార్టీకి నూతనోత్సాహం కలిగిస్తోంది.

సారొస్తున్నారు..!

బీఆర్‌ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ఈ నెల 19న తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఆయన ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగడం అంటే, పార్టీకి ఇదొక కీలక మలుపు అనడంలో సందేహం లేదు. ఈ సమావేశం ప్రధానంగా కృష్ణా గోదావరి జలాల సమస్య, అలాగే గత పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడంపై దృష్టి సారిస్తుంది. కేసీఆర్‌కు తొలి నుంచీ సాగునీరు, జలాల హక్కులు అంటే ప్రాణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి-కృష్ణా జలాలను ‘కొల్లగొడుతున్నా’ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే అంశాన్ని ఆయన ప్రధానంగా హైలైట్ చేయనున్నారు. అందుకే, మరో ప్రజా ఉద్యమం తప్పదని ఆయన భావిస్తున్నారు. ఎన్నికల్లో ఓడి ఫామ్‌హౌస్‌లో ఉన్నా, కేసీఆర్ రాజకీయ వ్యూహ చతురత అపారం. రాష్ట్రంలో ఏ సమస్యను తాకితే ప్రజలు కదులుతారో?, ఏ అంశంపై ఉద్యమిస్తే తిరిగి పట్టు సాధించవచ్చో ఆయనకు బాగా తెలుసు. అందుకే, తక్షణమే నీటి సమస్యను చేతిలోకి తీసుకున్నారు. 45 టీఎంసీలు ఇస్తే చాలు అని కేంద్రం ముందు ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి (Uttamkumar Reddy) మోకరిల్లడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అని బీఆర్‌ఎస్ తీవ్రంగా విమర్శిస్తోంది.

ఫామ్‌హౌస్ గోడలు దాటి..

బీఆర్‌ఎస్ ప్రభుత్వమే గనక తిరిగి వచ్చి ఉంటే ఈపాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు (Palamuru Lift Irrigation Project) నుంచి నీళ్లు అందేవి! అంటూ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, తిరిగి తానే తెలంగాణ ప్రజల ఏకైక రక్షకుడిని అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) చేస్తున్న అన్యాయాన్ని, తెలంగాణ ప్రయోజనాలను గండి కొడుతున్న విధానాలను కూడా కేసీఆర్ ప్రశ్నించనున్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడకపోవడంపై ఆయన అస్త్రం సంధిస్తున్నారు. కావేరి అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడికి సహకరిస్తున్న కేంద్ర విధానాన్ని ఎదుర్కోవాలంటే, ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని కేసీఆర్ గర్జించనున్నారు. ఈ కీలక సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రజా ఉద్యమాల నిర్మాణం, కార్యాచరణపై కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి సహా ఇతర ప్రాజెక్టుల కోసం ఉద్యమ స్వరూపానికి ఈ వేదికపై శ్రీకారం చుట్టనున్నారు. ఫామ్‌హౌస్ గోడలను దాటి, మళ్ళీ ఉద్యమ శంఖారావం పూరిస్తున్న కేసీఆర్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 15, 2025 5:31 AM