Politics

KCR: తెలంగాణ అసెంబ్లీలో బిగ్ ఫైట్ పక్కా అనుకుంటే.. జగన్‌ను ఫాలో అయ్యారే..!

టైటిల్ చూస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏంటి? ట్రెండ్ సెట్ చేయడమేంటి? పైగా దానిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాలో అవడమేంటి? అనిపిస్తోంది కదా. అసలు ఇద్దరు మాజీ సీఎంలు.. అధికారంలో ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండేవారు.

KCR: తెలంగాణ అసెంబ్లీలో బిగ్ ఫైట్ పక్కా అనుకుంటే.. జగన్‌ను ఫాలో అయ్యారే..!

టైటిల్ చూస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) ఏంటి? ట్రెండ్ సెట్ చేయడమేంటి? పైగా దానిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఫాలో అవడమేంటి? అనిపిస్తోంది కదా. అసలు ఇద్దరు మాజీ సీఎంలు.. అధికారంలో ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండేవారు. ఇద్దరూ సామరస్యంతో ముందుకెళ్లేవారు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు వీరిద్దరూ ఏం చేశారంటారా? ఇద్దరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరవరు. అప్పుడెప్పుడో వైఎస్ జగన్ అలా అసెంబ్లీ (Telangana Assembly)కి వచ్చి పదంటే పదే నిమిషాల పాటు అసెంబ్లీలో ఉండి ఆ తరువాత వెంటనే సభ నుంచి నిష్క్రమించారు. ఇక గులాబీ బాస్ సైతం అసెంబ్లీ సమావేశాలకు రెండేళ్లుగా దూరంగా ఉంటూ వచ్చారు. సడెన్‌గా ఆయన తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు.

ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు..

కట్ చేస్తే కేసీఆర్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. కేసీఆర్ (KCR) సైతం అసెంబ్లీలో పదంటే పది నిమిషాలే ఉన్నారు. అసలు ఆయన బాహ్య ప్రపంచంలోకి ఇటీవలి కాలంలోనే అడుగుపెట్టారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌ నుంచి జనాల్లోకి ఇక మీదట రారేమో అనుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్‌ (BRS)ను నిలబెట్టుకునేందుకు ఆయన బయటకు రావల్సిన అగత్యం ఏర్పడింది. కొడుకు కేటీఆర్ (KTR) చేతికి పార్టీ పగ్గాలు అప్పగించినా కూడా ఆశించిన ఫలితం అయితే కనిపించడం లేదని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నాయి. కేసీఆర్ కనిపించకపోవడంతో ఆ వెలితి కొట్టొచ్చినట్టుగా కనిపించింది. మొత్తానికి కేసీఆర్ బయటకు రాక తప్పలేదు. ఎలాగూ వచ్చారు కాబట్టి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూడా ఆయన అడుగు పెట్టారు.

రేవంత్ వర్సెస్ కేసీఆర్..

ఇప్పటి నుంచి ఒక లెక్క… ఇకపై ఒక లెక్క అని కేసీఆర్ అయితే గట్టిగానే చెప్పారు. దీంతో అంతా ఆయన పక్కాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల (Assembly Sessions)కు హాజరవుతారని భావించారు. అనుకున్నట్టుగానే అనూహ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి ఎంట్రీ ఇచ్చి అటెండెన్స్ రిజస్టర్‌లో సైన్ చేశారు. ఇంకేముంది? అసెంబ్లీ (Telangana Assembly)లో బిగ్ ఫైట్ ఖాయమని అంతా అనుకున్నారు. సీఎం రేవంత్ వర్సెస్ మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం ఎలా ఉంటుందో చూడాలని అంతా భావించారు. కానీ వైఎస్ జగన్ (YS Jagan) మాదిరిగానే అసెంబ్లీకి వచ్చి సమావేశాలు మొదలైన పది నిమిషాలకే సభ నుంచి నిష్క్రమించారు. తెలంగాణ ప్రజానీకం ఆశలపై నీళ్లు చల్లారు. రేవంత్ వర్సెస్ కేసీఆర్ (Revanth Vs KCR) రచ్చ అయితే గట్టిగానే జరుగుతోంది కానీ ఎదురుపడి వాగ్యుద్ధం చేసింది లేదు. కేసీఆర్ సభకు వచ్చారనగానే అంతా అదే ఊహించారు.

రేపు సభకు వస్తారా?

అసలే కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాటల్లో ఎవరికి వారే సాటి. వీరిద్దరూ ఎదురు పడితే ఎలా ఉంటుందో చూడాలని అంతా అనుకున్నారు. అయితే కేసీఆర్, రేవంత్ ఎదురు పడ్డారు. రేవంత్ షేక్ హ్యాండ్ ఇచ్చి మర్యాదపూర్వకంగా పలకరించి.. కేసీఆర్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారట. కానీ సభలో మాత్రం దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మా రెడ్డిలకు సంతాప తీర్మానాలు ముగిసిన వెంటనే కేసీఆర్ వెళ్లిపోయారు. మరి ఆయన రేపు సభకు వస్తారో లేదో చూడాలి. రేపు రాకుంటే ఏకంగా వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలకే కేసీఆర్ హాజరవుతారని టాక్ నడుస్తోంది. మొత్తానికి జగన్ పది నిమిషాల ట్రెండ్ సెట్ చేస్తే కేసీఆర్ ఫాలో అవుతున్నారని నెటిజన్లు అంటున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 29, 2025 8:32 AM