Kalvakuntla Kavitha: షర్మిలలా మారుతున్న కవిత.. ఇక కేటీఆర్‌కు చుక్కలేనా?
జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకురాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) తనయురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)లా మారుతున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకురాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) తనయురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)లా మారుతున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. వాస్తవానికి కవిత (Kavitha)కు, షర్మిలకు చాలా విషయాల్లో పోలిక ఉంది. పోలిక ఉంటే ఓకే కానీ.. షర్మిల మాదిరిగా దండయాత్ర చేస్తేనే కష్టం. మరి కవిత దండయాత్ర కూడా మొదలు పెడతారా? చూడాలి. ఒకవేళ దండయాత్ర కానీ మొదలు పెట్టారో కేటీఆర్ (KTR)కి చుక్కలు కనిపించడం ఖాయం.
బీఆర్ఎస్ (BRS) నుంచి కవితను బయటకు పంపించిన తర్వాత ఆమె పార్టీని కానీ.. తనను బయటకు పంపిన విషయమై కానీ ఏ విధంగానూ స్పందించింది లేదు. షర్మిల కూడా ఇలాగే అన్నతో విభేదించి బయటకు వచ్చి వైఎస్సార్‌టీపీ పెట్టిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా అన్నను మాట అన్నది లేదు. కానీ ఆ తరువాత కొంతకాలానికి షర్మిల తన అన్నపై దండయాత్ర ప్రారంభించారు. చిన్న అవకాశం దొరికినా కూడా అన్నను ఏకిపారేస్తున్నారు. షర్మిలను తిరిగి ఏమీ అనలేక.. అంటే ఎక్కడ తనకు ఇబ్బంది ఎదురవుతుందోనని జగన్ (YS Jagan Mohan Reddy) మింగలేక కక్కలేకున్నారు. వైసీపీ నేతలు (YCP Leaders) ఏమైనా షర్మిలను విమర్శిస్తారేమో కానీ.. జగన్ మాత్రం ఏనాడు మాట్లాడింది లేదు. దీనికి కారణం ఇప్పటికే చెల్లిని బయటకు వెళ్లగొట్టిండన్న అపవాదు ఉంది. ఈ క్రమంలోనే ఇంకా ఏమైనా అంటే అది మరింత ఇబ్బందికరంగా మారుతుంది.
అమ్మకు దూరంగా ఉండటమే బాధాకరం..
తాజాగా కవిత కూడా అలాగే ఉంది. బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించిన తొలినాళ్లలో కవిత కూడా బీఆర్ఎస్ పార్టీని కానీ.. తన అన్నను కానీ మాట అన్నది లేదు. అయితే తాజాగా కవిత పెదవి విప్పారు. తన తల్లికి దూరంగా ఉండాల్సి రావడం బాధకరమంటూ మాట్లాడుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది మాత్రమే కాదు.. ఇంకా చాలా విషయాలపై ఆమె స్పందించారు. బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో ప్రోటోకాల్ నిబంధనల పేరిట తనను కట్టేశారని.. ఉరిశిక్ష పడిన ఖైదీనైనా చివరి కోరిక అడుగుతారని.. కానీ తనకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జాగృతి-జనబాటలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి తనను ఎందుకు సస్పెండ్ చేశారనే విషయమై కూడా నేటి వరకూ చెప్పలేదని పేర్కొన్నారు.
కేటీఆర్ సైలెంట్ అయిపోతారా?
మొత్తానికి కవిత అయితే పెదవి విప్పుతున్నారు. మరి ఇక ముందు గట్టిగానే తండ్రిపై పోరాడుతారో లేదో కానీ అన్నపై పోరాడే అవకాశాలు మాత్రం మెండుగానే కనిపిస్తున్నాయి. అసలు కవిత పార్టీ నుంచి సస్పెండ్ కావడానికి కేటీఆరే కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి వాటన్నింటి గురించి కవిత పెదవి విప్పితే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే కేటీఆర్ కూడా సైలెంట్‌గా ఉండిపోవాల్సి వస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికి కవిత అయితే తన అప్పియరెన్స్ అయితే మార్చేశారు. తమిళనాడులోని జయలలిత మాదిరిగా కనిపించేందుకు యత్నిస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి ఆమె కట్టు బొట్టు అంతా కూడా జయలలిత (Jayalalitha)ను ఇమిటేట్ చేస్తున్నట్టుగానే ఉంది. మరి కవిత ఆలోచన ఏంటనేది తెలియడం లేదు. మొత్తానికి బీఆర్ఎస్‌పైనో.. లేదంటే తన కుటుంబంపైనో దండయాత్ర చేసే సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి.
ప్రజావాణి చీదిరాల