Politics

Kavitha: మహేష్ స్టైల్‌లో కాంగ్రెస్‌కు కవిత ఆఫర్.. ‘సూర్యాభాయ్’ స్కెచ్ రిపీట్?

ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సీనే తెలంగాణ రాజకీయాల్లో రీ-క్రియేట్ అవుతోందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కాకపోతే ఇక్కడ హీరో మహేష్ బాబు కాదు.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత!

Kavitha: మహేష్ స్టైల్‌లో కాంగ్రెస్‌కు కవిత ఆఫర్.. ‘సూర్యాభాయ్’ స్కెచ్ రిపీట్?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మాన్’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ఒక పవర్‌ఫుల్ సీన్ ఉంటుంది.. ముంబై మాఫియాను శాసించే సూర్యా భాయ్‌ని పిలిచి ఢిల్లీ మేయర్ ఒక మాట అంటాడు.. ‘ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు’ అని.. దానికి మహేష్ బాబు వెటకారంగా నవ్వి.. ‘రివర్స్‌లో నీ ఢిల్లీకి ఏం కావాలి? ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాలని ఉందా..? లేదా?’ అని రిటర్న్ ఆఫర్ ఇస్తాడు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సీనే తెలంగాణ రాజకీయాల్లో రీ-క్రియేట్ అవుతోందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కాకపోతే ఇక్కడ హీరో మహేష్ బాబు కాదు.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత!

ఢిల్లీ హైకమాండ్‌కు బంపర్ ఆఫర్?

గత జూన్ నుంచి కవిత కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆ వార్తలు ఏకంగా సినిమాటిక్ రేంజ్‌కు చేరుకున్నాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్‌కు కవిత ఒక ఊహించని ‘బంపర్ ఆఫర్’ ఇచ్చారనేది ఇప్పుడు హాట్ టాపిక్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటకలోని మొత్తం ఎంపీ సీట్ల ఎన్నికల ఖర్చు ఎంతైనా సరే తానే భరిస్తానని, అందుకు ప్రతిఫలంగా తనను కాంగ్రెస్‌లో చేర్చుకుని, 2028 నాటికి తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలని ఆమె కోరినట్లు రాజకీయ గల్లీల్లో వినికిడి. అంటే, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తరహాలో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ ద్వారా పవర్‌లోకి రావాలని ఆమె మాస్టర్ ప్లాన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది.

అడ్డుకున్న ఒరిజినల్ కాంగ్రెస్!

అయితే, ఈ ‘బిజినెస్ డీల్’కు కాంగ్రెస్‌లోని అసలు సిసలు నాయకులు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా ముందే ఓపెన్ అయ్యి చెప్పడం సంచలనంగా మారింది. ‘కవిత మా పార్టీలో చేరుతానంటున్నారు.. కానీ నేనే వద్దని వ్యతిరేకిస్తున్నాను. మా పార్టీలో ఆమె కంటే సమర్థవంతమైన నాయకులు చాలామంది ఉన్నారు’ అంటూ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత రాకను పార్టీలోని సీనియర్లు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని, ఆమెకు ఎంట్రీ ఇస్తే పాత కాపులకు అన్యాయం జరుగుతుందనే భావనలో వారు ఉన్నారని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.

మరో షర్మిల అవుతారా?

కవిత కాంగ్రెస్‌లోకి వస్తే పార్టీకి వచ్చే మైలేజీ ఎంత? అన్న దానిపై కూడా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ఏపీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరి తన సొంత అన్న, వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని, వైసీపీని ఎలాగైతే విమర్శిస్తున్నారో.. ఇక్కడ కవిత కూడా తన సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావులను టార్గెట్ చేయడానికి మాత్రమే పనికొస్తారని కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. షర్మిల అక్కడ.. కవిత ఇక్కడ.. ఇద్దరూ ‘డాటర్ ఆఫ్ సీఎం’లే కావడంతో, ఇద్దరి రాజకీయ ప్రయాణాలు ఒకేలా ఉంటాయని, కాకపోతే వారిద్దరి ఓటమిల పోటీ ఎలా ఉంటుందో చూడాలని సెటైర్లు పడుతున్నాయి.

రూమరా.. నిజమా?

ఇదంతా ఒక పెద్ద రాజకీయ రూమర్ అని కొందరు కొట్టిపారేస్తున్నా, కొన్ని పరిణామాలు మాత్రం అనుమానాలకు తావిస్తున్నాయి. కవిత ఇటీవలే తన ‘తెలంగాణ జాగృతి’ని పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందిస్తానని పరోక్షంగా హింట్ ఇచ్చారు. అందులో భాగంగానే సమన్వయ కమిటీలతో వరుస మీటింగ్స్ కూడా నిర్వహించారు. మరి అలాంటప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అంత ఓపెన్‌గా తనను విమర్శించినా, తనపై వార్తలు వస్తున్నా కవిత కౌంటర్ ఇవ్వకపోవడం వెనుక మర్మమేంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఢిల్లీ పీఠంపై కన్నేసిన సూర్యభాయ్ లాగా.. కవిత వేసిన ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేక కాంగ్రెస్ నాయకుల వ్యతిరేకతతో గాలిలోనే కలిసిపోతుందా? అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా, 2028 సీఎం సీటు కోసం ఇప్పటి నుంచే ఇంత భారీ స్థాయిలో స్కెచ్ వేయడం మాత్రం సంచలనమే. ఈ రూమర్ల వెనుక ఉన్న అసలు నిజానిజాలు బయటకు రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 27, 2026 3:49 AM