Politics

Nara Lokesh: నారా లోకేష్‌ దెబ్బకు అల్లాడిపోతున్న కర్ణాటక..

ప్రతిపక్షాలు చేసే రాద్ధాంతం మరోవైపు.. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ట్విటర్ వార్ ఇంకోవైపు సహించలేకుండా ఉంది. మొత్తానికి కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) అల్లాడిపోతోంది.

Nara Lokesh: నారా లోకేష్‌ దెబ్బకు అల్లాడిపోతున్న కర్ణాటక..

‘మొగుడు కొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్విందుకు బాధ’ అని ఓ సామెత ఉంది. ప్రస్తుతం కర్ణాటక పరిస్థితి అలాగే ఉంది. గూగుల్ (Google) సంస్థ ఏపీకి తరలిపోయిందన్న బాధ ఒకవైపైతే.. ప్రతిపక్షాలు చేసే రాద్ధాంతం మరోవైపు.. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ట్విటర్ వార్ ఇంకోవైపు సహించలేకుండా ఉంది. మొత్తానికి కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) అల్లాడిపోతోంది.

ఒకరకంగా చెప్పాలంటే.. ఏపీలో గూగుల్ ఏఐ హబ్ (Google AI Hub) ఏర్పాటు సెగ దక్షిణ భారతదేశానికి తాకింది. దీంతో ఇన్వెస్ట్‌మెంట్ రేస్ అనేది జరుగుతోంది. గూగుల్ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో దక్షిణ భారతదేశం (South India) ముఖ్యంగా చెప్పాలంటే కర్ణాటక ఉలిక్కి పడింది. ఇంత భారీ పెట్టుబడిని చేజార్చుకోవడం బాధ ఒక ఎత్తైతే.. ప్రతిపక్షాలు చెవులు చిల్లులు పడేలా చేస్తున్న రాద్దాంతం మరోవైపు. అసలు దేని గురించి బాధ పడాలో తెలియక సతమతమవుతూ.. ఏదో ట్వీట్ పడేస్తే అటు ప్రతిపక్షాలకు సమాధానంగా ఉంటుందనుకుందో మరో కారణమో కానీ.. ఏపీకి గూగుల్ తరలి వెళ్లడానికి కారణం.. ఆ రాష్ట్రం ఇచ్చిన రాయితీలేనంటూ ట్వీటింది కర్ణాటక. పోనీలే చేజార్చుకున్న ఉక్రోషం అని ఏపీ ఊరుకుంటుందా? తగిన కౌంటర్ గట్టిగానే ఇచ్చింది. దీంతో ట్వీట్ వార్ ప్రారంభం.

అగ్నికి ఆజ్యం పోసిన నారా లోకేష్ రిప్లై..

దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలు కల్పించే గూగుల్‌ను చేజార్చుకుంటావా? అని ప్రతిపక్షాలు మొట్టికాయలు వేస్తుంటే.. ట్వీట్ వార్ ఒకటి తలను మరింత బొప్పి కట్టించేలా కర్ణాటక ప్రభుత్వానికి (Karnataka Government) తయారైంది. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) జోరుకు బ్రేకులు వేసేందుకు కర్ణాటక మంత్రి కూడా రంగంలోకి దిగడంతో ట్వీట్ వార్ మరింత ఆసక్తికరంగా మారింది. కర్ణాటకకు చెందిన పారిశ్రామికవేత్తలు మౌలిక వసతులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టిన వెంటనే.. వారిని ఏపీకి ఆహ్వానిస్తూ నారా లోకేష్ రిప్లై ఇవ్వడం మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టైంది. కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shiva Kumar) ఈ విషయమై బహిరంగంగానే స్పందించారు. నారా లోకేష్ స్పందన తమ రాష్ట్రానికి నష్టం చేకూర్చేదిగా ఉందన్నారు.

పీకల్లోతు సమస్యల్లో..

ఇదిలా సాగుతున్న తరుణంలోనే గూగుల్ ఏపీ (AP) ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. ఈ నెల 14న గూగుల్ ప్రకటించిన వెంటనే ఆ ఘాటు పక్క రాష్ట్రాలకు అంటుకుంటోందంటూ నారా లోకేష్ ట్వీట్ చేయడం కర్ణాటకకు మరింత ఇబ్బందికరంగా మారింది. అసలే అటు గూగుల్.. ఇటు నారా లోకేష్.. మధ్యలో విపక్షాలు చేస్తున్న దాడులతో పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయిన కర్ణాటక తనను తాను సమర్థించుకునేందుకు యత్నించి బొక్క బోర్లా పడింది. కర్ణాటక గూగుల్‌ను కోల్పోలేదని.. రాయితీ ఆశతో లాక్కున్నారని ట్వీట్ చేసింది. అంతటితో ఆగిందా? తాము పెట్టుబడులను అభ్యర్థించడమో.. అడుక్కోవడమో చేయబోమని తెలిపింది. అడగనిదే అమ్మైనా పెట్టదనేది సామెత. అమ్మే పెట్టకుంటే.. పెట్టుబడులు మాత్రం ఎలా వస్తాయి? ఈ చిన్న లాజిక్ కర్ణాటక ఎలా మరచిపోయిందో అర్థం కావడం లేదు. మొత్తమ్మీద కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అయితే ఏపీ దెబ్బకు ఇరకాటంలో పడిందనడంలో సందేహం లేదు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 28, 2025 3:39 PM