కడప రెడ్డెమ్మా.. కాస్త తగ్గమ్మా..!
ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నవాడే మంచి నాయకుడవుతాడు. కొంచెం సంయమనం పాటించడం వల్ల పోయేదేం లేదు. కొందరికి షార్ట్ టెంపర్.. ఆవేశం ఒకట్రెండు క్షణాలే కానీ అది చేసే డ్యామేజ్ చాలా పెద్దది.

ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నవాడే మంచి నాయకుడవుతాడు. కొంచెం సంయమనం పాటించడం వల్ల పోయేదేం లేదు. కొందరికి షార్ట్ టెంపర్.. ఆవేశం ఒకట్రెండు క్షణాలే కానీ అది చేసే డ్యామేజ్ చాలా పెద్దది. కాబట్టి దాన్ని నియంత్రించుకోగలిగితే చాలు.. లైఫ్ సాఫీగా సాగిపోతుంది. లేదంటే కొంత ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కోక తప్పదు.
ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అంటారా? కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డికి. తప్పదు మరి.. చెప్పాల్సి వస్తోంది. మంచి ఫైర్ బ్రాండ్‌గా టీడీపీలో గుర్తింపు తెచ్చుకున్నారు మాధవి. అలాగే చక్కని పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు కూడా.. కానీ ఒక్కటే డిఫెక్ట్. ఆమెకు షార్ట్ టెంపర్ అని ఆమెను దగ్గర నుంచి చూసేవాళ్లు చెబుతుంటారు. అదొక్కటి చాలదా.. పైగా వంద ప్లస్‌లు ఉండనివ్వుగాక.. మన కళ్లు ఒక్క మైనస్‌నే ఫోకస్ చేస్తుంటాయి. అది హ్యూమన్ మెంటాలిటీ. ఏమీ చేయలేం. ప్రస్తుతం మాధవీరెడ్డి విషయంలోనూ అదే జరుగుతోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత కడపలో పసుపు జెండా రెపరెపలాడింది. దీనిలో మాధవీరెడ్డి పాత్ర కూడా గణనీయంగా ఉంది. అందుకే ఆమె కడప రెడ్డెమ్మ అయిపోయారు. కానీ ఆ కోపం ఏదైతే ఉందో అదే ముఖ్యంగా చిక్కులు తెచ్చి పెడుతోంది. అధికార పార్టీలో ఉన్నప్పుడు.. దూకుడు కంటే సంయమనం పాటించడం అనేది చాలా ముఖ్యం. గత పార్టీ నేతలు, నాయకురాళ్లు ఈ సంయమనం లేకే ఇంటికే పరిమితమయ్యారు.
ఏం చేస్తాంలెండి.. షార్ట్ టెంపర్..
ప్రస్తుతం మాధవీరెడ్డి పరిస్థితి కూడా అదే.. ముఖ్యంగా సంయమనం పాటించాల్సిన చోట దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఏం చేస్తాంలెండి.. షార్ట్ టెంపర్ అలాంటిది మరి. ఎప్పటిదాకో ఎందుకులెండి. నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆమె తీరు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. వేదికపై ఆమెకు కుర్చీ వేయలేదు. అదేదో చెప్పి చేయించుకుంటే పోయేది. దీనికి ఏకంగా ఐఏఎస్ అధికారులనే అవమానిస్తూ మాట్లాడారని పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. అసలే స్వాతంత్ర్య దినోత్సవ వేడుక.. సంతోషంగా జరుపుకోవాల్సింది పోయి మరీ దారుణంగా కుర్చీ కోసం అసహనమా? పోయి పోయి ఐఏఎస్ అధికారులను అవమానించడమా? ఇది ఏమాత్రం సరికాదని సొంత పార్టీ నేతలే అంటున్నారు. వాస్తవానికి స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ఎగురవేశామా..? కావాలంటే అక్కడే నిలబడి రెండు మాటలు మాట్లాడామా? వెళ్లామా? అన్నట్టుగా ఉండాలి అంతే కానీ బహిరంగ సభలు పెడతాం..ప్రసంగాలిస్తామంటే ఎలా? అసలీ గొడవంతా ఏంటని స్థానికులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.
కుర్చీ కోసం ఫైర్ అవడమా?
ఈ విషయంలో అధికారుల వర్షన్ మరోలా ఉంది. వాస్తవానికి స్వాతంత్ర్య దినోత్సవాల్లో జెండా ఆవిష్కరణ తర్వాత అవార్డు ప్రదానోత్సవం ఉంటుంది. ఇది ఎక్కడైనా జరిగేదే.. కానీ అవార్డు ప్రదానం ముఖ్య అతిథులు చేస్తారు. కానీ స్థానిక శాసనసభ్యులు ఆహ్వానితులే కాని అతిథులు కాదనేది అధికారుల వాదన. ఇది కూడా కరెక్టే కదా. ఆమె దూకుడులో ఈ కాలానికి అవసరమే. కానీ అన్ని చోట్లా పనికి రాదు కదా. మరీ దారుణంగా కుర్చీ కోసం ఫైర్ అవడమా? అదేమైనా సీఎం కుర్చీనా? లేదంటే పీఎం కుర్చీనా? చిన్న విషయానికి సీరియస్ అయితే పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి రెడ్డెమ్మా.. కాస్త తగ్గమ్మా..! అని టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
ప్రజావాణి చీదిరాల