Pawan Kalyan: పవన్ చెప్పినట్లుగానే.. ఏపీలో ‘యోగి’ ట్రీట్మెంట్ షురూ!
‘శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదు.. అవసరమైతే యోగి ఆదిత్యనాథ్ స్టైల్‌లో వెళ్తాం’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) అన్న మాటలు ఇప్పుడు ఏపీ వీధుల్లో అక్షరాలా అమలవుతున్నాయి.
అవును.. అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో సీన్ మొత్తం మారిపోయింది. మొన్నటిదాకా ‘నాయకుడి’ అండ చూసుకుని రెచ్చిపోయిన గ్యాంగ్‌స్టర్లకు, గంజాయి బ్యాచ్‌లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అడ్డూఅదుపు లేకుండా అరాచకాలు చేస్తే.. ఇప్పుడు అడ్డంగా బుక్కయి ‘యోగి (Yogi Adityanath)’ మార్క్ దెబ్బ రుచి చూస్తున్నారు. ‘శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదు.. అవసరమైతే యోగి ఆదిత్యనాథ్ స్టైల్‌లో వెళ్తాం’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) అన్న మాటలు ఇప్పుడు ఏపీ వీధుల్లో అక్షరాలా అమలవుతున్నాయి.
కొన్ని రోజుల క్రితం పవన్ కల్యాణ్ అసెంబ్లీ (AP Assembly) లోనూ, బయటా ఒకటే మాట చెప్పారు.. ‘నేరగాళ్లను వదిలే ప్రసక్తి లేదు, యోగి ట్రీట్మెంట్ ఇస్తాం’ అని. ఆయన అన్నారో లేదో.. అప్పుడే ఏపీ పోలీసులు ‘యాక్షన్ మోడ్’లోకి వచ్చేశారు. హోంశాఖ అనేది సాధారణంగా ముఖ్యమంత్రి (CM Chandrababu) దగ్గరో లేదా హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) దగ్గరో ఉంటుంది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ‘కొంపదీసి పవన్ కల్యాణే హోం శాఖను తన చేతుల్లోకి తీసుకున్నారా?’ అనే రేంజ్‌లో చర్చ సాగుతోంది. పవన్ చెప్పిన ‘సిద్ధాంతం’ ఇప్పుడు పోలీసుల ‘ఆచరణ’లో అక్షరాలా కనిపిస్తోంది.
బుల్డోజర్ల గర్జన.. నేరగాళ్ల గుండెల్లో వణుకు!
ఉత్తరప్రదేశ్‌లో యోగి మార్క్ అంటేనే గుర్తే వచ్చేది ‘బుల్డోజర్’. అక్రమంగా సంపాదిస్తే కూల్చేస్తాం, అరాచకం చేస్తే అంతం చేస్తాం అన్నది అక్కడ పాలసీ. ఇప్పుడు ఏపీలోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది. ఇటీవల అత్యాచార నిందితుడి అక్రమ కట్టడాలను అధికారులు నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేశారు. ‘నీవు సమాజానికి కీడు చేస్తే.. నీవు అక్రమంగా కట్టిన గూడు ఉండదు’ అనే సంకేతాన్ని ప్రభుత్వం బలంగా పంపింది. విశాఖ నుంచి విజయవాడ దాకా కబ్జాల కోటలు కూలిపోతున్నాయి. అక్రమంగా కోట్లు వెనకేసి, వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చనుకున్న వాళ్లకి ఇది గట్టి ‘షాక్ ట్రీట్మెంట్’. ఇటీవల సత్యసాయి జిల్లాలో వైసీపీ శ్రేణులు ఒక గర్భిణీ స్త్రీపై దాడి చేయడం నాగరిక సమాజం తలదించుకునేలా చేసింది. కానీ, పోలీసులు స్పందించిన తీరు మాత్రం ‘యోగి’ స్టైల్‌ను తలపించింది. నిందితులను పట్టుకుని నడి వీధిలో పరేడ్ చేయించారు. ఒకప్పుడు కాలర్ ఎగరేసి తిరిగిన నేరగాళ్లు, పోలీసుల ‘స్పెషల్ ట్రీట్మెంట్’ తర్వాత సరిగ్గా అడుగు తీసి అడుగు వేయలేక కుంటుతూ నడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. చీరి చింతకు కట్టినట్టుగా పోలీసులు వారిని తూర్పారబట్టారు. తప్పు చేస్తే పాతాళంలో ఉన్నా బయటకి తీస్తాం.. వీధుల్లో ఉరికిస్తాం అని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే ఆ కార్యకర్త వైసీపీ కాదని, ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.. అయితే జనసేన వాళ్లు మాత్రం వైసీపీ కార్యకర్తే అని పెద్ద గొడవే చేసుకుంటున్నారు.
రౌడీ షీటర్లకు ‘బార్బర్’ షాప్ కౌన్సెలింగ్!
నెల్లూరు, కర్నూలు, విజయవాడ నగరాల్లో ఇప్పుడు రౌడీ షీటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. పాత రికార్డులు తీసి, తోక జాడిస్తే పీడీ యాక్ట్ కింద లోపల వేస్తామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. గంజాయి బ్యాచ్‌ల ఆటలు సాగనివ్వడం లేదు. ఈవ్ టీజింగ్ చేసే రోమియోలకు స్టేషన్లలో ‘యోగి మార్క్ మర్యాదలు’ జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి, ఆడబిడ్డల మానప్రాణాలతో చెలగాటమాడిన వారికి ఇప్పుడు చట్టం తన విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ఆడబిడ్డలు ధైర్యంగా తిరగాలన్నా శాంతిభద్రతలు పక్కాగా ఉండాలి. గత ఐదేళ్లలో అరాచక శక్తులు మేనేజ్ చేసిన వ్యవస్థలను ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నారు. తప్పు చేస్తే ‘తగిన శాస్తి’ జరుగుతుందనే భయం నేరగాళ్లలో మొదలైంది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ముందు ముందు యోగి స్టైల్ ఇంకా ఘాటుగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి.. పవన్ కల్యాణ్ చెప్పినట్లు ఏపీలో ‘యోగి’ పోలీసింగ్ పట్టాలెక్కింది. నేరగాళ్లు ఇప్పుడు అండర్ గ్రౌండ్‌కు వెళ్తారో లేక పద్ధతి మార్చుకుంటారో చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం.. ఏపీలో ఇప్పుడు సామాన్యుడికి భరోసా.. నేరగాడికి ‘యోగి’ మార్క్ దడ మొదలైంది!
ప్రజావాణి చీదిరాల