Jubleehills Bypoll: ఓటరుకు అసలు పరీక్షే ఇది!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubleehills bypoll) సమయం దగ్గర పడుతుండటంతో, హైదరాబాద్ నగర రాజకీయాలు వేడెక్కాయి. నవంబర్ 11న జరగబోయే ఈ పోరు, రాజకీయ పార్టీల (Political Parties) అదృష్టాన్ని నిర్ణయించడమే కాదు, ఇక్కడి ఓటర్లకు కూడా ఒక పెద్ద పరీక్షగా మారింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubleehills bypoll) సమయం దగ్గర పడుతుండటంతో, హైదరాబాద్ నగర రాజకీయాలు వేడెక్కాయి. నవంబర్ 11న జరగబోయే ఈ పోరు, రాజకీయ పార్టీల (Political Parties) అదృష్టాన్ని నిర్ణయించడమే కాదు, ఇక్కడి ఓటర్లకు కూడా ఒక పెద్ద పరీక్షగా మారింది. మూడు ప్రధాన పార్టీలు అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్‌ఎస్ (BRS), జాతీయ బలం ఉన్న బీజేపీ (BJP) పోటాపోటీ ప్రచారంతో మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా హడావిడి చేస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న బీఆర్‌ఎస్ (BRS), మాజీ మంత్రి కేటీఆర్ (KTR) నేతృత్వంలో వినూత్నంగా ప్రచారాన్ని సాగిస్తోంది. గతంలో తాము చేసిన రహదారులు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం వంటి అభివృద్ధి పనుల జాబితాను చూపుతూ, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పలువురి మాట- పాము కాటు అన్నట్లుగా ప్రజల మధ్య ఎండగడుతున్నారు. పేదలకు అండగా ఉంటూ, ధనికులకు సౌకర్యాలు కల్పిస్తూ రెండు వర్గాలకు న్యాయం చేశామని చెప్పుకుంటోంది.
జాతీయ పార్టీలు ఇలా..
ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ (Congress), ఇక్కడ గెలిచి హైదరాబాద్‌పై పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ, వారి ప్రచారం ఎక్కువగా ప్రత్యక్ష పనుల కంటే విమర్శలపైనే దృష్టి సారించింది. బీఆర్‌ఎస్ పాలన (BRS Government)లో అభివృద్ధి లేకుండా పోయిందని చెబుతూ, తాము గెలిస్తే పనులు చేస్తామని నమ్మకం కల్పించే ప్రయత్నంలో ఉంది. చేతల్లో చూపకుండా మాటల్లో చెప్పడం అనే ధోరణి ఉండటం వల్ల, ఇప్పటివరకు తాము చేసిన పనుల జాబితా లేకపోవడం ఓటర్లలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జూబ్లీహిల్స్ (Jubleehills)ను తెలంగాణలో తమ ఎదుగుదలకు ప్రారంభ వేదికగా చూస్తోంది. దేశవ్యాప్తంగా మేము పాలిస్తున్నాం, తెలంగాణలో కూడా ఎదగాలంటే ఈ సీటు కీలకం అనే నినాదంతో ప్రచారం చేస్తోంది. స్థానిక అభ్యర్థి బలం కన్నా, కేంద్రంలో ఉన్న పార్టీ బ్రాండ్ ప్రభావంపై ఆధారపడుతున్న వ్యూహం బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఓటరు ముందున్న క్లిష్టమైన ప్రశ్న
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్ల ముందున్న ప్రధాన ప్రశ్న అభివృద్ధికా, అవకాశానికా? ఇక్కడ ఓటరు మూడు కోణాల్లో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్‌ఎస్ గతంలో చెప్పిన అభివృద్ధి నిజమా? కాదా? అని తూకం వేయాలా? లేక కాంగ్రెస్ అధికార పార్టీగా ఉన్నందున నిధుల ప్రాధాన్యం దృష్టిలో ఉంచి ఓటు వేయాలా? లేక జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీకి స్థానికంగా అవకాశమివ్వాలా? అనే క్లిష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఓటరు ధోరణి నగరంలో రాబోయే ఎన్నికల దిశను సూచించేలా ఉంది. రాజకీయ పార్టీలు వాగ్దానాల సుదీర్ఘ జాబితా కంటే ప్రజలు చూసిన అభివృద్ధిని మాత్రమే తూకం వేస్తేనే ఈ పోరు ప్రజాస్వామ్య శక్తిని సార్థకం చేస్తుంది. ఈ ఎన్నిక ఇటు పార్టీలకు అటు ఓటర్లకు కూడా పరీక్షా ఘట్టమే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు సుమీ.
ప్రజావాణి చీదిరాల