YS Jagan: జగన్ పాదయాత్ర.. ఎలహంకలో స్కెచ్.. ఇంట్రస్టింగ్ ఏంటంటే..
ఏం చేసినా బెంగుళూరు ఎలహంక ప్యాలెస్‌ను మాత్రం జగన్ వీడరు. ప్రస్తుతం పాదయాత్ర రూట్ మ్యాప్, సభల వివరాలు అన్నీ కూడా ఆ ప్యాలెస్‌లో కూర్చొనే సిద్ధం చేస్తున్నారట. మరి పాదయాత్ర అయినా ఏపీలో చేస్తారాా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhrapradesh Politics) రసవత్తరంగా మారబోతున్నాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఇప్పటి వరకూ అసెంబ్లీ (AP Assembly) మొహం కూడా చూడని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అనూహ్య పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. తనను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించిన పాదయాత్ర ఫార్ములాను మరోసారి, మరింత శక్తిమంతంగా ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు. ఈ 'జగన్ 2.0 (Jagan 2.0) పాదయాత్ర' ద్వారా ఆయన తన తొలి పాదయాత్ర రికార్డును తానే బద్దలు కొట్టి, 2029 ఎన్నికల్లో గెలుపును పక్కా చేసుకోవాలని వ్యూహం రచిస్తున్నారు.
2019 ఎన్నికలకు (2019 Elections) ముందు, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర సుమారు 3,648 కిలోమీటర్లు, 14 నెలల పాటు సాగింది. పాదయాత్రకు ఫలితం ఎప్పుడూ బాగుంటుంది. అలాగే అవకాశం జగన్‌కు అలా 2019 ఎన్నికల్లో కలిసి వచ్చింది. జగన్ విజయానికి అదొక్కటే కారణమని చెప్పలేం కానీ అది కూడా ఒక కారణమే. ఆ తరువాత వైఎస్ వివేకా మర్డర్ (Viveka Murder), కోడికత్తి వంటి అంశాలన్నీ వైసీపీపై సింపతీకి కారణమయ్యాయి. మంచి మెజారిటీతో వైసీపీ విజయం సాధించింది. కానీ దానిని ఆయన వినియోగించుకున్నారా? అంటే అదీ లేదు. సంక్షేమంపై బాగానే ఫోకస్ చేశారు కానీ అభివృద్ధిని మరిచారు. రాష్ట్రాన్ని ఒకరకంగా సర్వనాశనం చేశారన్న అపవాదును మూటగట్టుకుని అప్పట్లో 151 సీట్లతో విజయం సాధించగా.. 2024 ఎన్నికల్లో కేవలం మధ్యలో 5 ఎగిరిపోయి 11 సీట్లకు పరిమితమయ్యారు.
పాదయాత్ర ఎందుకోసం చేస్తున్నట్టు?
ఇక ఇప్పుడు రెండోసారి పాదయాత్ర చేపట్టేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. పాదయాత్రను ఏకంగా 5వేల కిలోమీటర్ల దూరం, 16 నెలల పాటు సాగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది దేశంలోనే సుదీర్ఘ పాదయాత్రల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు, కార్యకర్తలు చెబుతున్నారు. అంతా ఓకే కానీ ఈ పాదయాత్ర ఎందుకోసం చేస్తున్నట్టు? అసలు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు గట్టి అస్త్రాలేమైనా చేతిలో ఉన్నాయా? అనేది ఏమీ తెలియదు. పాదయాత్ర మాత్రం 2026 చివరిలో లేదా 2027 మే నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర ప్రారంభించిన జగన్, ఈసారి రెండేళ్ల ముందే జనంలోకి వెళ్లడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఇప్పుడిప్పుడే మొదలవుతోందన్న భ్రమలో ఉన్న వైసీపీ దానిని అస్త్రంగా చేసుకుని ముందుకు సాగాలని గట్టిగానే భావిస్తోంది. ఆసక్తికర విషయాలు ఏంటంటే.. ఈ యాత్రలో ముఖ్యంగా వైఎస్ జగన్ నాడు తన హయాంలో ఏపీ ఎలా ఉంది? నేడు (కూటమి హయాంలో) ఎలా ఉంది? అనే అంశాన్ని ప్రధాన నినాదంగా తీసుకోనున్నారు.
జగన్ పాదయాత్రతో ఒరిగేదేముంది?
అసలు కూటమి ప్రభుత్వాన్ని అయితే వైసీపీతో పోల్చుకోవడానికే లేదు. అభివృద్ధిలో ఏపీ దూసుకెళుతోంది. రైతులకు కూడా చాలా బాగుంది. ఆటోవాలాలు, మహిళలు ఎవరిని తీసుకున్నా వారందరికీ న్యాయం చేస్తూ కూటమి ప్రభుత్వం గట్టిగా తన ఫుట్ ప్రింట్‌ను జనాల్లో వేస్తోంది. వైసీపీ విషయానికి వస్తే సంక్షేమ పరంగా తప్పితే ఏం చేసిందని? ఆసక్తికర విషయం ఏంటంటే.. జగన్ అందించిన సంక్షేమ పథకాలకు మరింత జోడించి మరీ కూటమి ప్రభుత్వం అందిస్తోంది. అలాంటప్పుడు జగన్ పాదయాత్రతో ఒరిగేదేముంది? బెంగుళూరులో ఉండి ఏదైనా ఘటన జరిగినప్పుడు ఏపీ వైపు తొంగి చూసి వెళితే ఇక్కడ ఏం జరుగుతుందనేది ఎలా తెలుస్తుంది? ఏపీలో ఉండి చూస్తే కదా తెలిసేది. పైగా జగన్‌లో అప్పటికీ ఇప్పటికీ మార్పే లేదు. చిన్న స్థాయి నేతలను దగ్గరకు కూడా రానివ్వరన్న అపవాదు ఉంది. తన చుట్టూ కోటరీని నిర్మించుకుని అది ఊదే బాకాలు వింటూ భ్రమలో ఉండిపోతే అసలు ఏపీలో ఏం జరుగుతోందో ఎలా తెలిసేది?
ఈసారి రాజధానులు ఐదవుతాయేమో..
మరో కామెడీ విషయం ఏంటంటే.. ముఖ్యంగా ఈ యాత్ర ద్వారా కేసులు, అరెస్టులతో సతమతమవుతున్న పార్టీ కార్యకర్తలకు, నేతలకు భరోసా కల్పిస్తారట. వాళ్లేమైనా అన్యాయంగా అరెస్ట్ అయ్యారా? దొంగసారాకు కొమ్ముకాసి అరెస్టైన వారు కొందరైతే ఏదో ఒక నేరంలో పాలు పంచుకున్న వారు కొందరు.. దొంగలకు, అవినీతి పరులకు భరోసా కల్పిస్తే జగన్ పరువు గంగలో కలవడం ఖాయం. తొలి యాత్ర సమయంలో నవరత్నాలు అనే బలమైన మేనిఫెస్టోను ప్రకటించిన జగన్, ఈసారి అంతకుమించిన హామీలతో మెగా మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఈసారి మూడు రాజధానులు కాస్తా ఐదవుతాయేమో చూడాలి. మొత్తానికి ఏం చేసినా బెంగుళూరు ఎలహంక ప్యాలెస్‌ను మాత్రం జగన్ వీడరు. ప్రస్తుతం పాదయాత్ర రూట్ మ్యాప్, సభల వివరాలు అన్నీ కూడా ఆ ప్యాలెస్‌లో కూర్చొనే సిద్ధం చేస్తున్నారట. మరి పాదయాత్ర అయినా ఏపీలో చేస్తారో లేదో చూడాలి.
ప్రజావాణి చీదిరాల