YS Jagan: చిల్లర చోరీని సమర్థించిన జగన్.. అడ్డంగా బుక్కయ్యారుగా!
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయాల్లోనే కాదు, ఆర్థిక రంగంలోనూ హాస్యాస్పదంగా మారాయి.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయాల్లోనే కాదు, ఆర్థిక రంగంలోనూ హాస్యాస్పదంగా మారాయి. తిరుమల పరకామణి దొంగతనం గురించి ప్రస్తావిస్తూ, 9 డాలర్లు అంటే రూ.72వేలు అని, ఇది చాలా చిన్న దొంగతనం అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ నోరు జారి చేసిన ఈ వ్యాఖ్యలు, విమర్శించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కూటమి నేతలకు పప్పులో నెయ్యిలా మారాయి.
జగన్ లెక్క ప్రకారం, 9 డాలర్లు రూ.72వేలు అయితే, ఒక డాలర్ విలువ రూ.8వేలు అయినట్టే! ఐదేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి, తరచూ విదేశాలకు వెళ్లే జగన్‌కు అమెరికన్ డాలర్ల విలువ తెలియదనుకోలేము. ఈరోజే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి విలువ పడిపోయిందని చెబితే, జగన్ ఏకంగా ఒక్క డాలర్‌ను రూ.8వేలు స్థాయికి తీసుకెళ్లి రూపాయికి విశ్వరూపం చూపించారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కాగితంపై రాసి ఇచ్చిన దాన్ని పదేపదే చూస్తూనే ఆయన ఈ తప్పు చేయడం, పొరపాటున 900 డాలర్లు అనబోయారనే వాదనకు కూడా ఆస్కారం లేకుండా పోయింది.
చిల్లర చోరీ వెనుక రహస్యం
జగన్ ఈ దొంగతనాన్ని చిన్న చిల్లర చోరీగా అభివర్ణించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఆయన చెప్పినట్లు అది కేవలం 9 డాలర్ల దొంగతనమే అయితే.. దొంగతనం చేసిన రవి కుమార్ టీటీడీకి వంద కోట్లకు పైగా ఆస్తులు ఎందుకు రాసిచ్చినట్లు? ఈ కేసులో అప్పటి వైసీపీ నేతలు అతనితో రాజీ పడాల్సిన అవసరం ఏమిటి? అతనిపై కేసును ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చిన్న దొంగతనం అని దొంగను సమర్థిస్తూ, త్యాగం చేసినట్లుగా మాట్లాడడం ద్వారా, పరకామణిలో జరిగినది చిల్లర దొంగతనం కాదని, పెద్ద తిమింగలం చేతివాటమని పరోక్షంగా ఒప్పుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఊరికే రాదు ఉలకబెట్టినా రాదు అన్నట్లుగా, రవికుమార్ వందల కోట్లు రాసివ్వడానికి గల అసలు కారణాన్ని జగన్ దాచిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అవినీతిని సమర్థిస్తున్నారా?
ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ధోరణి చిల్లర దొంగతనాలను చూసి చూడనట్లు వదిలేయాలి అన్నట్లుగా ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు జరగకుండా ఉంటాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా, మద్యం కుంభకోణం కేసులో రూ.3వేల కోట్లకు పైగా చేతివాటం ప్రదర్శించారని ఏసీబీ చెబుతున్న సందర్భంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జగన్ ఈ రూ.3వేల కోట్ల దొంగతనాన్ని కేవలం రాజకీయ కక్ష సాధింపుగా వాదిస్తున్నారు. పరకామణి దొంగతనాన్ని ఆయన సమర్థిస్తున్నారు కనుక, ఈ రూ.3వేల కోట్ల చిన్న దొంగతనాన్ని కూడా చూసి చూడనట్లు వదిలేయమని ఆయన కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారా అని రాజకీయ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు.
అనవసరపు వివాదంలో..
నిజానికి, మీడియా ముందు రకరకాల ప్రశ్నలు వచ్చినా, ఆయన కూటమి ప్రభుత్వం తమ నేతలను అడ్డగోలుగా కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నిస్తోందని ఒక మాట చెప్పి ఊరుకుంటే సరిపోయేది. అలా కాకుండా ఈ అంశాన్ని కెలుక్కుని మరీ నోరు జారడం వల్ల, చంద్రబాబు అండ్ కో నేతలకు బురద చల్లేందుకు తాంబూలం ఇచ్చినట్లయింది. జగన్ అనవసరపు వ్యాఖ్యల వలన ఈ వివాదంలో చిక్కుకున్నారనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఎక్కడో గుంట నక్క పడితే ఇక్కడ ఈ నక్క ఎందుకమ్మా ఏడ్చింది? అన్నట్లుగా, పరకామణి దొంగతనం గురించి మాట్లాడి కూటమి దాడికి అవకాశం ఇచ్చారని ఆయన పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.
ప్రజావాణి చీదిరాల