Sajjala Ramakrishna Reddy: ఆయన తగ్గారు.. సజ్జల స్టార్ట్ చేశారు..
‘మంగలమ్మా మంగలమ్మా నీ తల ఎక్కడ అంటే.. చాటలో ఉందని చెప్పిందట’ సజ్జల వ్యవహారశైలి కూడా అలాగే ఉంది. ఉన్న వాస్తవాన్ని పక్కనబెట్టి.. లేని వాటి గురించి గొప్పలు చెబుతున్నారు.
అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. ఆ అతితోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) తన పార్టీ వైసీపీ (YCP)ని పతనం దిశగా నడిపించారు. వైనాట్ 175 (Y Not 175) అంటూ చెలరేగి పోయారు. చివరకు కనీసం 15 సీట్లు కూడా రాలేదు. 11 స్థానాల్లో సరిపెట్టుకుని.. ఏపీ అసెంబ్లీ (AP Assembly) మొహం కూడా చూడకుండా వైఎస్ జగన్ (YS Jagan) బెంగుళూరు ప్యాలెస్‌కు పరిమితమయ్యారు. అంతకు ముందు ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన పార్టీకి పట్టిన దుర్గతి ఇది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని.. ఏదో చేద్దామనుకుంటే అసలుకే ఎసరొచ్చింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇది చూసైనా వైసీపీ ముఖ్య నేతలకు జ్ఞానోదయం అయినట్టు లేదు.
ట్రోలర్ మెటీరియల్‌గా..
గర్వం ఉన్న చోట గెలుపు ఉండదని అంటారు. ఇది అక్షరాలా నిజం. దీనికి ఎవరూ అతీతులు కారు. వైఎస్ జగన్ పార్టీ ఓటమి తర్వాత కాస్త తగ్గారనుకుంటే ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తయారయ్యారు. ఆయన ఏకంగా మరో మెట్టు ఎక్కి వైనాట్ 200 అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘మంగలమ్మా మంగలమ్మా నీ తల ఎక్కడ అంటే.. చాటలో ఉందని చెప్పిందట’ సజ్జల వ్యవహారశైలి కూడా అలాగే ఉంది. ఉన్న వాస్తవాన్ని పక్కనబెట్టి.. లేని వాటి గురించి గొప్పలు చెబుతున్నారు. మొత్తానికి సజ్జల ట్రోలర్ మెటీరియల్‌గా మారుతున్నారనడంలో సందేహమే లేదు. ఇప్పటి వరకూ వైనాట్ 175 అని జగన్ అడ్డంగా బుక్కయ్యారు. పెద్ద ఎత్తున ట్రోల్స్‌ను ఎదుర్కున్నారు. ఇటీవలి కాలంలో ఈ వైనాట్ 175ని ఏపీ ప్రజానీకం మరచిపోయిందనుకుంటే.. ఇప్పుడు సజ్జల (Sajjala Ramakrishna Reddy) తయారయ్యారు.
ఏది అభివృద్ధి?
"అలు లేదు, చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం" అని డీలిమిటేషన్ ఇంకా జరగనే లేదు.. సజ్జల (Sajjala) మాత్రం 200 సీట్లకు నిచ్చెనలు వేస్తున్నారు. వైనాట్ 200 అంటూ మొదలు పెట్టారు. ఈసారి జగన్ గెలిస్తే 30 ఏళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతారంటూ వ్యాఖ్యలు చేయడం వలన సాధించేదేంటి? రెండు కాళ్లు లేని వ్యక్తి నేను కానీ లేస్తే ఉరికించి ఉరికించి కొడతా అన్నాడట. అలాగే ఉంది సజ్జల పరిస్థితి. గెలిస్తే అని అంటున్నారు.. అప్పట్లో గెలిచారుగా.. ఏది అభివృద్ధి? ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. అప్పుల పాలు చేసి చివరికి రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారు. ఈసారి గెలిస్తే అభివృద్ధి చేస్తామంటే ఎవరు నమ్ముతారు? పైగా రిషికొండ ప్యాలెస్ (Rishikonda Palace) ఒకటి. అది చూసిన వారెవరైనా వైసీపీని గెలిపించే ప్రయత్నం చేస్తారా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
నవ్విపోదురుగాక..
5 దశాబ్దాలలో జరగాల్సిన అభివృద్ధిని 5 సంవత్సరాలలో చేసి చూపించిన నాయకుడు జగన్ అని సజ్జల పొగడ్తలలో ముంచెత్తారు. నవ్విపోదురుగాక.. నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉంది సజ్జల వ్యవహార శైలి అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లోనూ జగన్ కీలక పాత్ర పోషించారట. మరి అలాంటి జగన్‌ను బీజేపీ (BJP) ఎందుకు వదిలేసిందో చెప్పాలి కదా. కీలక పాత్ర పోషించిన వ్యక్తిని ప్రధాని మోదీ ఎందుకు పక్కనబెట్టేసినట్టు? దీనికి కూడా సమాధానం చెబితే బాగుంటుందని టీడీపీ నేతలు అంటున్నారు"తప్పులు చేసేవాడు తలవంచడు.. తిప్పలు పడేవాడు అబద్ధం ఆడడు" అని.. అధికారాన్ని పోగొట్టుకున్నా కూడా తమదే పై చేయి అన్నట్టుగా వ్యవహరించడం వైసీపీ (YCP) నేతలకే చెల్లుతుందని టీడీపీ నేతలు (TDP Leaders) విమర్శిస్తున్నారు. అతి విశ్వాసం గతి చేటని.. ఉన్న దానితో సంతృప్తి చెందకుంటే ఉన్నది.. ఉంచుకున్నది రెండూ పోతాయని వైసీపీ కార్యకర్తలే అంటున్నారు. జగన్ వైనాట్ 175 అంటేనే 11 సీట్లు.. ఇప్పుడు సజ్జల ఏకంగా వైనాట్ 200 అంటున్నారు. మరి జనాలు ఏం చేస్తారో చూడాలి.