BRS: హరీశ్ రావు చేతికి కారు స్టీరింగ్?.. కేటీఆర్ గ్రాఫ్‌కు ఎండ్ కార్డ్!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. గులాబీ తోటలో ముసలం మొదలైందా?.. పదేళ్లపాటు తిరుగులేని శక్తిగా వెలిగిన బీఆర్ఎస్ (BRS) పార్టీ ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారిందా?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. గులాబీ తోటలో ముసలం మొదలైందా?.. పదేళ్లపాటు తిరుగులేని శక్తిగా వెలిగిన బీఆర్ఎస్ (BRS) పార్టీ ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారిందా? వరుస ఓటములు ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సెగలు మరోవైపు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో, ఇప్పుడు 'వారసత్వ పోరు' బహిర్గతమవుతోందా? ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న అపర చాణక్యుడు, కట్టప్ప హరీశ్ రావు (Harish Rao) ఇప్పుడు తన విశ్వరూపం చూపించబోతున్నారా? అంటే అవుననే సమాధానాలు సీనియర్ల నుంచి వస్తున్నాయి.
పంక్చర్ అయిన కారు.. మారుతున్న డ్రైవర్?
ఒకప్పుడు బుల్లెట్ వేగంతో దూసుకెళ్లిన గులాబీ కారు.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత షెడ్డుకు చేరింది అనుకుంటే, ఇప్పుడు ఏకంగా ఇంజిన్‌కే రిపేర్ వచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నాయకత్వంలో వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ చతికిలపడటంతో కేడర్‌లో నమ్మకం సన్నగిల్లింది. సరిగ్గా ఇదే సమయంలో సిద్ధహస్తుడు హరీశ్ రావు పేరు తెరపైకి రావడం గమనార్హం. 'పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు' అన్నట్లుగా, కేటీఆర్ సోషల్ మీడియా బ్రాండింగ్ కంటే, హరీశ్ గ్రౌండ్ లెవల్ పాలిటిక్సే పార్టీని కాపాడగలవని సీనియర్లు భావిస్తున్నారు.
ముదురుతున్న వైరం!
మహాభారతంలో కర్ణుడిలా ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీ కోసం నిలబడ్డ హరీశ్ రావుకు ఇప్పుడు కాలం కలిసి వస్తోందా? కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే పంచాయతీ ఎన్నికల ఫలితాలు తారుమారవ్వగా.. అటు హరీశ్ మాత్రం తన కంచుకోట సిద్దిపేటను చెక్కుచెదరకుండా కాపాడుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెతను గుర్తు చేస్తూ.. సొంత నియోజకవర్గంలోనే పట్టు కోల్పోయిన కేటీఆర్, రాష్ట్ర స్థాయిలో పార్టీని ఏం గెలిపిస్తారని ఉత్తర తెలంగాణ సీనియర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
హరీశ్ ప్రకటన.. తెలంగాణ భవన్‌లో వణుకు!
సాధారణంగా పార్టీకి సంబంధించిన ఏ కీలక నిర్ణయమైనా తెలంగాణ భవన్ నుంచి లేదా కేటీఆర్ కార్యాలయం నుంచి రావాలి. కానీ, ఈ నెల 19న శుక్రవారం జరగాల్సిన బీఆర్ఎస్ ఎల్పీ (BRSLP) సమావేశాన్ని 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్వయంగా హరీశ్ రావు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా.. పార్టీ కంట్రోల్‌ను నెమ్మదిగా తన చేతుల్లోకి తీసుకుంటున్నారా హరీశ్? ఇది కేసీఆర్ ఇచ్చిన గ్రీన్ సిగ్నలా లేక హరీశ్ సాగిస్తున్న సైలెంట్ విప్లవమా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
రహస్య భేటీలు, మాస్టర్ ప్లాన్ ఏంటి?
కేటీఆర్ కేవలం 'ట్విట్టర్ కింగ్' గానే మిగిలిపోతున్నారని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. అందుకే వారంతా ఇప్పుడు హరీశ్ రావు ఇంటికి క్యూ కడుతున్నారు. "అయ్యా హరీశ్ గారూ.. మీరు పగ్గాలు పట్టకపోతే కారు తుక్కు కింద అమ్ముకోవాల్సిందే" అని వారు మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. 500లకు పైగా పంచాయతీల్లో పట్టు నిలుపుకున్న హరీశ్ పవరే పార్టీకి శ్రీరామరక్ష అని క్యాడర్ నమ్ముతోంది. ఇటు మేనల్లుడు.. అటు కన్నకొడుకు! ఇప్పుడు కేసీఆర్ ఎటువైపు మొగ్గు చూపుతారు? గుమ్మడికాయంత కొడుకు ఉన్నా.. గురివింద గింజంత మేనల్లుడు మేలు అని పార్టీ శ్రేణులు భావిస్తున్న తరుణంలో గులాబీ బాస్ మనసు మార్చుకుంటారా? ఒకవేళ కట్టప్పకు పార్టీ పగ్గాలు ఇస్తే.. కేటీఆర్ పరిస్థితి ఏంటి? బావ కింద బావమరిది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? లేక పార్టీ రెండు ముక్కలవుతుందా? అన్నది పెద్ద ప్రశ్నగానే మిగిలింది.
ఏ నిమిషానికి.. ఏమి జరుగునో!
బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు 'నివురు గప్పిన నిప్పు'లా ఉన్న ఈ అసమ్మతి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. హరీశ్ రావు వేస్తున్న ఒక్కో అడుగు కేటీఆర్ పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేస్తుందా లేక పార్టీని మళ్ళీ ఫీనిక్స్ పక్షిలా లేపుతుందా? మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకోవాలంటే హరీశ్ రావుకు అధ్యక్ష పదవి ఇవ్వాలా? లేక కేటీఆర్ నాయకత్వమే సరైనదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి!
ప్రజావాణి చీదిరాల