Kavitha Suspension: కేటీఆర్ పాత్ర ఎంత?
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. అని పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. రాజకీయాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఆలె నరేంద్రకు ఒక రూల్.. ఈటెల రాజేందర్‌కు ఇక రూల్.. కోదండరాంకు ఒకటి ఉండదు.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. అని పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. రాజకీయాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఆలె నరేంద్రకు ఒక రూల్.. ఈటెల రాజేందర్‌కు ఇక రూల్.. కోదండరాంకు ఒకటి ఉండదు. అందరికీ ఒకటే రూల్. కూతురు, కొడుకు, కుటుంబ బంధాలన్నీ ఇంటి వరకే.. పార్టీలో అంతా ఒకటే. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరైనా ఒకటే. వాళ్లందరినీ సస్పెండ్ చేస్తాం.. కూతురు కాబట్టి ఏం చేసినా ఊరుకుంటాం అంటే అసలుకే ఎసరొస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తన కూతురు కల్వకుంట్ల కవితపై చర్య తీసుకున్నారు.
అవును.. కవిత (Kalvakuntla Kavitha)ను బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కొంతకాలంగా కవిత పార్టీని ఇరుకునబెట్టే పనులు చేస్తూ వస్తున్నారు. తండ్రికి సుదీర్ఘ లేఖ రాసింది మొదలు.. ప్రతి ఒక్క ఎపిసోడ్‌లోనూ పార్టీ మొత్తం ఒక దారిలో నడుస్తుంటే.. కవిత మరో దారిలో నడుస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆమె సోదరుడు కేటీఆర్ (KTR)కు.. ఆమెకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని టాక్. చివరకు కేటీఆర్ ఆమెతో రాఖీ కూడా కట్టించుకోలేదు. ఇక తాజాగా కాళేశ్వరం (Kaleswaram) ఎపిసోడ్‌లోనూ పార్టీని ఇరుకున బెట్టే వ్యాఖ్యలు కవిత చేశారు. ఒకరకంగా చెప్పాలంటే.. కాళేశ్వరం ఎపిసోడ్‌లో తప్పంతా తమ పార్టీదేనని ఒప్పుకున్నారు. పైగా కేసీఆర్ మీద సీబీఐ (CBI) ఎంక్వైరీ వేశాక.. బీఆర్ఎస్ ఉన్నా.. లేకునా ఒకటేనన్నట్టుగా కవిత వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ఎపిసోడ్ (Kaleswaram Episode)లో తప్పంతా మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao), సంతోష్ (Santhosh)దేనని కవిత తేల్చారు. దీంతో కాళేశ్వరం విషయంలో తప్పు జరిగిందని ఆమె పరోక్షంగా అంగీకరించినట్టైంది.
వాళ్లు ఊరుకుంటారా?
కవిత ఒకరకంగా అంగీకరిస్తే కాంగ్రెస్ పార్టీ (Congress Party) నేతలు చూస్తూ ఊరుకుంటారా? కవిత ఒప్పుకున్నారంటూ నానా రచ్చ చేస్తున్నారు. మొత్తానికి క్రమశిక్షణా రాహిత్యంలో భాగంగా కవితను సస్పెండ్ చేయకుంటే పార్టీపై వ్యతిరేక సంకేతాలు కేడర్‌లోకి వెళతాయి. కాబట్టి కవితను సస్పెండ్ చేయక కేసీఆర్‌కు తప్పలేదనే చెప్పాలి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ తెలిపింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, టి. రవీందర్ రావు పేరిట ప్రకటన విడుదలైంది. కవిత వ్యవహారశైలి పార్టీకి నష్టం కలిగించేలా ఉందని.. ఈ క్రమంలోనే అధిష్టానం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ తెలిపింది. ఇటీవలి కాలంలో కవిత పార్టీతో విభేదిస్తూ.. కేవలం తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకలాపాలను మాత్రమే పర్యవేక్షిస్తున్నారు.
సస్పెన్షన్‌లో అదే ఇంట్రస్టింగ్..
కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయని తొలిసారిగా కవిత కొన్ని నెలల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి కవిత వర్సెస్ పార్టీ అన్నట్టుగా నడుస్తోంది. పైగా తాజాగా బీసీ రిజర్వేషన్ల అంశానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తే దానిని కూడా కవిత తప్పుబట్టారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కవితను కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.. అయితే ప్రస్తుతం ఈ సస్పెన్షన్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఏమైనా ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? లేదంటే దీని వెనుక కేటీఆర్ హస్తం ఏమైనా ఉందా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.