Politics

AV Dharmareddy: శ్రీనివాసుడికే పంగనామాలు.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సిట్‌గారూ..!

అయోధ్య రామయ్యకు మాత్రమే వైసీపీ హయాంలో స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డూలు అందాయట. మిగిలిన భక్తులంతా అందుకున్నది కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలేనని ఒకరకంగా ధర్మారెడ్డి అంగీకరించారు.

AV Dharmareddy: శ్రీనివాసుడికే పంగనామాలు.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సిట్‌గారూ..!

కలియుగదైవం.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy)వారి లడ్డూ ప్రసాదం (Laddu Prasadam) ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. అలాంటి లడ్డూను అత్యంత నాణ్యతతో.. నిబద్దతతో తయారు చేసేవారు.. ఇప్పుడు కూడా తయారు చేస్తున్నారు. కానీ వైసీపీ హయాంలో నిర్వహించారా? లేదంటే అధికార పక్షం ఆరోపణలేనా? అన్న సందేహాలన్నీ ఇటీవలి కాలంలో పటాపంచలవుతూ వస్తున్నాయి. తాజాగా కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (AV Dharma Reddy)ని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తోంది. దీనిలో వాస్తవాలు తేటతెల్లమవుతున్నాయి.

సభ్యుల అంగీకారంతోనే..

అయోధ్య రామయ్యకు మాత్రమే వైసీపీ హయాంలో స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డూలు అందాయట. మిగిలిన భక్తులంతా అందుకున్నది కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలేనని ఒకరకంగా ధర్మారెడ్డి అంగీకరించారు. దైవ ప్రసాదంగానూ.. పరమ పవిత్రంగానూ హిందువులంతా భావించే లడ్డూ తయారీలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు.. సిట్ విచారణలో ధర్మారెడ్డి అప్పట్లో అదనపు ఈవోగా కొనుగోళ్ల కమిటీలో కీలకంగా వ్యవహరించారు. అలాంటప్పుడు నెయ్యి టెండరు నిబంధనల్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందని సిట్ ప్రశ్నించగా.. అదంతా సభ్యుల అంగీకారంతోనే జరిగిందని.. దీనికి అప్పటి ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బదులిచ్చారు. తాను చేసింది తప్పయితే.. వారూ తప్పు చేసినట్టేగా అని పేర్కొన్నట్టు తెలుస్తోంది.

అయోధ్య రామయ్య మాటేంటి?

తప్పు ఎవరు చేసినా తప్పే. దానికి తన, పర భేదం లేదు. పైగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో ఆయన ప్రసాదంలోనే ఇంత దారుణానికి పాల్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో తనకు ముడుపులేమీ అందలేదని ధర్మారెడ్డి తెలియజేసినట్టుగా సమాచారం. అయితే గతేడాది జనవరిలో నిర్వహించిన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తిరుమల నుంచి లక్ష లడ్డూలు పంపారు. ఈ విషయమై సిట్ ధర్మారెడ్డిని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే అయోధ్య రామయ్యకు మాత్రం స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డూలనే పంపినట్టుగా తెలిపారని సమాచారం. అయోధ్య రామయ్యకు ఓకే.. కనీసం శ్రీనివాసుడికైనా స్వచ్చమైన నేతితో తయారు చేసిన లడ్డూలను నైవేద్యంగా పెట్టారా? లేదంటే సాక్షాత్తు కలియుగ దైవం శ్రీనివాసుడికే పంగనామాలు పెట్టారా? అనేది తెలియాల్సి ఉంది.

ఎంత దారుణమైన అవినీతి?

ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ఓరోగానిక్‌ డెయిరీ (Bholebaba Organic Dairy)కి వైసీపీ హయాంలో కాంట్రాక్ట్ ఇచ్చారు. కనీసం దాని గురించిన అవగాహన మీకు ఉందా? వంటి ప్రశ్నలను సిట్ సంధించగా.. అవన్నీ అధికారులు చూసుకున్నారంటూ ధర్మారెడ్డి బదులిచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఆయన ‘నన్ను ఇన్వాల్వ్ చేయకండి సిట్ గారు’ అన్నట్టుగా చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. కిలో నెయ్యి రూ.25 ఏంటి? అసలు కిలో కాదు.. ఆ డబ్బుకు 50 గ్రాములైనా వస్తుందా? ఎంత దారుణమైన అవినీతి జరిగినట్టు? అందునా సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి విషయంలోనా? పోనీ టీటీడీకి ఏమైనా నిధులు తక్కువయ్యాయా? డబ్బు లేదా? ఎందుకు అంతటి దారుణానికి ఒడిగడినట్టు? కలియుగ దైవం విషయంలోనే ఇంత అవినీతికి పాల్పడితే.. మరి ఏపీలో ఇంకెంత అవినీతి జరిగి ఉంటుందోనని ప్రజలంతా చర్చించుకుంటున్నారు.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 13, 2025 3:05 AM