Politics

BJP: ఒకప్పటి కాంగ్రెస్‌లా బీజేపీ? ఎంపీ అర్వింద్ మాటల ఆంతర్యమేంటి?

కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సరైన నాయకుడు లేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఎవరికి వారే నాయకుడు కావడంతో ఇష్టారాజ్యంగా ఉండేది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో.. ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉండేది.

BJP: ఒకప్పటి కాంగ్రెస్‌లా బీజేపీ? ఎంపీ అర్వింద్ మాటల ఆంతర్యమేంటి?

కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సరైన నాయకుడు లేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఎవరికి వారే నాయకుడు కావడంతో ఇష్టారాజ్యంగా ఉండేది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో.. ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉండేది. అది చాలదన్నట్టుగా పీతల మాదిరిగా ఒకరినొకరు వెనక్కి లాగడంతోనే సరిపోయింది. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారానికి దూరమవడం కూడా ఇదే కారణం. రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చిన తర్వాతే ఆ పార్టీ ఫేట్ మారింది. ఇదంతా ఇప్పుడెందుకు అంటే ప్రస్తుతం బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది.

అలా బీజేపీలోకి కూడా గట్టి నేత ఎవరో ఒకరు వస్తే కానీ ఆ పార్టీ ఫేట్ తెలంగాణలో మారదా? ఇద్దరు కేంద్రమంత్రులు తెలంగాణ నుంచి ఉన్నా కూడా పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోంది తప్ప ఎదుగుతున్న దాఖలాలైతే లేవు. ఇప్పుడు మరో ట్విస్ట్ ఏంటంటే.. బీజేపీ నేతలు ఒకరంటే మరొకరికి పడుతున్నట్టుగా లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది వ్యవహారం. దీనికి ఉదాహరణే ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.

ఇకనైనా వదిలేయండి..

బీజేపీలో కోవర్టులున్నారంటూ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించడం విశేషం. 20 ఏళ్ల నుంచి పార్టీని పట్టి పీడిస్తున్నారు.. ఇకనైనా వదిలి వెళ్లాలని ధర్మపురి అర్వింద్ పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అవి తమ పార్టీలోని ఒక సీనియర్ నాయకుడిని ఉద్దేశించి చేశారన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఎవరు 20 ఏళ్లుగా పార్టీని పట్టి పీడిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఆ వ్యాఖ్యలు పార్టీలోని ఒక సీనియర్ నాయకుడిని ఉద్దేశించి చేసినట్టుగా చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ అర్వింద్ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనేది ఆసక్తికరంగా మారింది.

ఒకరంటే ఒకరికి పడటం లేదా?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి హిందూ మత ఓటు బ్యాంకు బాగానే ఉంది. కానీ దానిని బలోపేతం చేసే నేతలే కరువవుతున్నారు. వాస్తవానికి బీజేపీ ఏపీలో అధికారంలో ఉంది. అయినా కూడా అక్కడి కంటే ఆ పార్టీకి తెలంగాణలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ పార్టీని నడిపించే సారధులే సరిగా లేరు. 2019 నుంచి తెలంగాణలో అధికారాన్ని దక్కించుకునేందుకు ఆ పార్టీ అధిష్టానం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తమ పార్టీ నేతలకు అస్త్రశస్త్రాలన్నీ ఇచ్చి పంపుతోంది. కానీ అవన్నీ తెలంగాణకు రాగానే నిర్వీర్యమవుతున్నాయి. తెలంగాణలోని బీజేపీ అగ్ర నేతలకు ఒకరంటే ఒకరికి పడటం లేదని ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన స్థానాలను పరిశీలిస్తే ఇంకాస్త కృషి చేస్తే నెక్ట్స్ టైమ్ అధికారం పక్కా అనిపించింది. కానీ ఆ తరువాత సీన్ మారిపోయింది.

నమ్మకం సన్నగిల్లుతోందా?

ఆ తరువాత వచ్చిన బైపోల్‌లో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బీజేపీ ఏమాత్రం సత్తా చాటలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ నేతలకు ఏమైందో కానీ క్రమంగా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్‌ను ఏకంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భుజాన వేసుకున్నారు. కానీ ఫలితం దక్కించుకోలేకపోయారు. ఎన్నికలకు పార్టీ నేతలు సీరియస్‌గా తీసుకోవడం లేదా? లేదంటే ప్రజలకే ఆ పార్టీపై నమ్మకం సన్నగిల్లుతోందా? అనేది తెలియకుండా ఉంది. మొత్తానికి ఏదైతేనేం కానీ ప్రస్తుతం ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. ఇంతకీ 20 ఏళ్లుగా పార్టీని పట్టి పీడుస్తున్న ఆ నేత ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. ఈ క్రమంలోనే తమ పార్టీకి ఉత్తర తెలంగాణలో ఢోకా లేదు కానీ దక్షిణ తెలంగాణలో బలోపేతం కావాల్సి ఉందని అర్వింద్ తేల్చేశారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 20, 2026 6:31 AM