Politics

Arava Sridhar: రాజకీయాల్లో ఎలా కప్పెడదామా? అని చూస్తారు.. తస్మాత్ జాగ్రత్త..

రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం పదవులు అనుభవించడం ఒక్కటే కాదు, వందల కళ్లకు జవాబుదారీగా ఉండటం. ముఖ్యంగా వెకిలి చేష్టలకు దిగితే ఆ పతనం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి అరవ శ్రీధర్ ఎపిసోడ్ ఒక నిలువెత్తు నిదర్శనం.

Arava Sridhar: రాజకీయాల్లో ఎలా కప్పెడదామా? అని చూస్తారు.. తస్మాత్ జాగ్రత్త..

రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం పదవులు అనుభవించడం ఒక్కటే కాదు, వందల కళ్లకు జవాబుదారీగా ఉండటం. ముఖ్యంగా 'విలువలే మా ఆస్తి' అని చెప్పుకునే జనసేన పార్టీలో ఉంటూ, వెకిలి చేష్టలకు దిగితే ఆ పతనం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి అరవ శ్రీధర్ ఎపిసోడ్ ఒక నిలువెత్తు నిదర్శనం. సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునే స్థాయికి ఎదిగినా, బుద్ధి మాత్రం గడప దాటలేదన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. కానీ రాజకీయాల్లో నేతకు తప్ప మరో చేతికి విలువుండదు.

ఇష్టం లేకుంటే ఎందుకు చూసినట్టు?

ముఖ్యంగా రాజకీయాల్లో ఎవరిని ఎలా కప్పెడదామా? అని చూసేవారే ఎక్కువగా ఉంటారు. దీనికోసం స్ట్రింగ్ ఆపరేషన్స్‌కు సైతం వెనుకాడరు. ఒకమ్మాయి వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఆమె ఎవరు? ఏంటనేది ముందుగా విశ్లేషణ చేసుకోవాలి. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు కానీ రాజకీయాల్లో మాత్రం ఒక చేయి రాజకీయ నేతదైతే రెండో చేతికి పెద్దగా విలువ ఉండదు. ఆ విషయాన్ని నేతలంతా మైండ్‌లో పెట్టుకోవాల్సిందే. అలా పెట్టుకోకుండా చప్పట్లు కొట్టేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి టెక్నాలజీని అడ్డం పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. వీడియో బయటకు రాగానే 'అది నాది కాదు, అది ఏఐ సృష్టించిన డీప్ ఫేక్, ఎవరో నన్ను కావాలని ఇరికించారు' అని చెప్పడం ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. నిజమే అది. అడ్డంగా ఇరికించిందనడంలో సందేహమే లేదు. ఒక వ్యక్తి స్నానం చేస్తున్నప్పుడు వీడియో కాల్ మాట్లాడాడంటే ఇష్టంలేని మహిళ దానిని ఎందుకు చూసినట్టు? పోనీ నగ్నంగా వీడియో కాల్ చేస్తే దానిని కట్ చేయాలి కదా. అప్పుడే అతని నంబర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసి ఉండొచ్చు కదా. కానీ ఇవన్నీ ఎవరూ ఆలోచించరు. అనవసరం కూడా. అన్ని వేళ్లూ రాజకీయనేత వైపే మరలుతాయి. తస్మాత్ జాగ్రత్త.

పవన్‌కు నో రిమార్క్..

దొరికిపోయిన తర్వాత ఎన్ని సాకులు చెప్పినా అది సిల్లీగానే అనిపిస్తుంది. నిజాయితీగా తప్పు ఒప్పేసుకుని ఆ అమ్మాయిని కూడా పాయింట్ అవుట్ చేయగలిగితే ఎంతో కొంత మద్దతు లభిస్తుంది. కానీ దొరకగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనో.. 'అద్దంలో కనిపిస్తున్నది నేను కాదు, నా డూప్' అనో చెబితే అది నూటికి నూరు శాతం తప్పించుకునేందుకు చెప్పే కుంటి సాకులే అవుతాయి. దొరకనంత వరకూ అంతా దొరలే.. దొరికితేనే దొంగలు. అలాంటి దొంగలు రాజకీయాల్లోనే కాదు. ప్రతి రంగంలోనూ ఉన్నారు. దీనిని జనసేన నైతికతకు అంటగట్టలేం. మహిళల భద్రత, గౌరవం పరంగా ఇప్పటి వరకూ అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఎలాంటి రిమార్క్ లేదు. కానీ ఇలాంటి స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉంటాయని గ్రహించక చేసిన కొందరు నేతల తప్పిదాలను పార్టీ నెత్తినేసుకుని ఊరేగలేదు. చప్పట్లు కొట్టిన రెండు చేతులదీ తప్పే అయినప్పుడు ఒక చేతిని నిందించడమెందుకు? కానీ కొన్ని లక్షల మంది ప్రజానీకానికి జవాబుదారిగా ఉన్నాడు కాబట్టి.. తెలిసి చేసినా.. తెలియక చేసినా శిక్ష అనుభవించాల్సిందే.

పడిపోవడమేముంది?

తప్పైతే జరిగిపోయింది. చర్య తీసుకోకుంటే పార్టీకే నష్టం. గతంలో కొందరు నేతలు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు 'మా వాడు కాబట్టి వెనకేసుకొద్దాం' అనుకుని తప్పు చేశారు. ఫలితంగా ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు జనసేన ఆ తప్పు చేయకూడదు. కంచె చేను మేయడం మొదలుపెడితే, రైతుకు నష్టం తప్పదు. రాజకీయ నాయకులంటే పై నుంచేమీ ఊడి పడలేదు. వారు మనలోని వారే.. మనతోటి వారే. అయితే కొన్ని లక్షల మందికి నాయకుడిగా ఉంటారు కాబట్టి తన వైపు నుంచి ఎలాంటి పొరపాట్లూ జరగకుండా చూసుకోవాలి. పబ్లిక్ ఏరియాలో ఉన్నా, ప్రైవేట్ లో ఉన్నా.. ఇప్పుడు ప్రతి స్మార్ట్‌ఫోన్ ఒక స్పై కెమెరా అని మైండ్‌లో పెట్టుకుంటే మంచిది. వ్యక్తిగత బలహీనతలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని గుర్తు పెట్టుకోవాలి. రాజకీయాల్లో ఎదగడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఒక ఎమ్మెల్యే స్థాయికి రావడమంటే దాని వెనుక ఎంతో కష్టం.. ఎన్నో నిద్రలేని రాత్రులుంటాయి. ఇక పడిపోవడమేముంది? ఇలాంటి ఘటన ఒక్కటి చాలు.. అధ: పాతాళానికి పోతారు. అరవ శ్రీధర్ విషయంలో జనసేన తీసుకున్న 'సస్పెన్షన్' నిర్ణయం సహేతుకమైనదే. ప్రతి ఒక్క నేతకూ ఇదో కనువిప్పు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 29, 2026 12:24 PM