Politics

Kavitha: బీఆర్ఎస్ బట్టలిప్పి రోడ్డుపై నిలబెట్టిన కవిత

ఇంతకీ కవిత ఏం చేయాలనుకుంటున్నారు. ఆమె గమ్యం ఎటువైపు? వంటి ప్రశ్నలకు నేడు సమాధానం అయితే దొరికింది. నేడు శాసనమండలి (Telangana Legislative Council) సాక్షిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

Kavitha: బీఆర్ఎస్ బట్టలిప్పి రోడ్డుపై నిలబెట్టిన కవిత

ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha).. బాధ, ఆవేదన ఇప్పుడెందుకు? ఇంతకాలం బీఆర్ఎస్‌ (BRS)లో ఉండి కనీసం నంబర్ 3 స్థానాన్ని సైతం కైవసం చేసుకోలేకపోయినందుకా? ఎందుకు ఇటీవలి కాలంలో కవిత అంతలా బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు? ఆవేదన చెందుతున్నారు. భావోద్వేగానికి గురై కంటతడి సైతం పెట్టుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఏం చేయాలనుకుంటున్నారు. ఆమె గమ్యం ఎటువైపు? వంటి ప్రశ్నలకు నేడు సమాధానం అయితే దొరికింది. నేడు శాసనమండలి (Telangana Legislative Council) సాక్షిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. శాసనమండలి నుంచి తానొక వ్యక్తిగా వెళుతున్నానని.. రాజకీయ శక్తిగా తిరిగొస్తానంటూ చెప్పారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ బట్టిలిప్పి రోడ్డుపై నిలబెట్టారు.

అన్నింటా అవినీతే..

బీఆర్ఎస్‌లో తనకు కట్టపెట్టిన బాధ్యతల్ని మనస్ఫూర్తిగా నిర్వర్తించానని.. అయితే ప్రశ్నిస్తే తనపై కక్ష కట్టారంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తనను అవమానించిందని.. ఈడీ, సీబీఐలతో పోరాడుతున్న సమయంలోనూ తనకు అండగా నిలవలేదని పేర్కొన్నారు. చివరకు తనను బీజేపీ జైలు పాలు చేయడానికి కూడా కేసీఆర్‌పై కక్ష తీర్చుకునేందుకేనని కవిత అన్నారు. ఇక వీటితో పాటు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతినంతా కవిత ఏకరువు పెట్టరు. అమరువీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగిందన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ ఒక్క వర్షానికే కొట్టుకుపోయిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు పింఛను ఇవ్వాలని పార్టీలో తాను కోరినా కూడా పట్టించుకోలేదని తెలిపారు. అమరవీరులను బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ గుర్తించలేదు సరికదా.. తెలంగాణ ఉద్యమం జరిగందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమైతే.. వాటిని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకున్నదే లేదని కవిత పేర్కొన్నారు.

అవినీతిపరుల పేరు చెప్పా..

బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించడం కోసం తాను ఎన్నోసార్లు అడిగానని.. కానీ అది జరగకపోవడం తనకు అవమానకరమన్నారు. కేసీఆర్‌ను అడిగే ధైర్యం తనకుందని ఎన్నో విషయాలు అడిగానన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌పై ఆరోపణలు వస్తే ఒక్కరంటే ఒక్క పెద్ద నాయకుడు కూడా మాట్లాడిన పాపాన పోలేదన్నారు. అప్పుడు తాను ప్రెస్‌మీట్‌ పెట్టి బలంగా మాట్లాడానని.. అవినీతిపరుల పేరు చెప్పానని కవిత అన్నారు. నాడు మొదలు.. నేటి వరకూ కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం హ‌రీష్‌రావును కవిత గుంట నక్కతో పోల్చారు. అలాగే ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి తోకే కుక్కను ఊపినట్టుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఆయనే పార్టీ నాశనానికి ప్రధాన కారణమన్నారు. హరీష్‌ను నమ్మితే మూసీలో కొట్టుకుపోవడం ఖాయమని కవిత పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో ‘జాగృతి’ పోటీ

మొత్తానికి కవిత కొత్త పార్టీని ప్రారంభిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. తాజాగా కవిత కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి అవతరించబోతోందని ఆమె ప్రకటించారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్‌ఎస్‌ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని... తనది ఆస్తుల పంచాయతీ కాదని.. ఆత్మగౌరవ పంచాయితీ అని కవిత పేర్కొన్నారు. తన పార్టీ విద్యార్థులు, నిరుద్యోగులు, అన్నివర్గాల కోసం పనిచేస్తుందన్నారు. అవమానభారంతో పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకున్నానని తెలిపారు. తాను ప్రజల కోసం వస్తున్నానని.. ఆశీర్వదించాలని కవిత కోరారు. తెలంగాణ జాగృతి.. రాజకీయ పార్టీగా మారుతుందని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి.. కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని పేర్కొన్నారు. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నానని.. రాజకీయ శక్తిగా తిరిగివస్తానని కవిత వ్యాఖ్యానించారు.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 5, 2026 1:38 PM