Politics

P Chidambaram: ముంబై ఉగ్రదాడుల తర్వాత యూఎస్ ఆపకుంటే పాక్‌ను మట్టుబెట్టేవాళ్లమే..

2008 ముంబై ఉగ్రదాడుల (Mumbai Terror Attacks) గురించి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం (Former Union Home Minister P Chidambaram) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

P Chidambaram: ముంబై ఉగ్రదాడుల తర్వాత యూఎస్ ఆపకుంటే పాక్‌ను మట్టుబెట్టేవాళ్లమే..

2008 ముంబై ఉగ్రదాడుల (Mumbai Terror Attacks) గురించి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం (Former Union Home Minister P Chidambaram) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అప్పటి యూపీఏ ప్రభుత్వం (UPA Government) తొలుత పాక్‌తో యుద్ధం చేయాలని నిర్ణయించిందని.. కానీ తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి, అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ (External Affairs Ministry) వైఖరి కారణంగా నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని చిదంబరం (Chidambaram) పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు (BJP Leaders) పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ముంబై ఉగ్రదాడి అనంతరం కొద్ది రోజులకే చిదంబరం (Chidambaram) కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ ఉగ్రదాడి అనంతరం జరిగిన పరిణామాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అది నా నిర్ణయం కాదు..

పాక్‌పై యుద్ధ నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పేందుకు ప్రపంచం మొత్తం ఢిల్లీకి వచ్చిందని ఆయన తెలిపారు. తాను కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తనతో పాటు అప్పటి ప్రధానిని కలిసేందుకు అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శిగా ఉన్న కొండోలీజా రైస్ (ex-United States Secretary of State Condoleeza Rice) ఢిల్లీకి వచ్చారని చిదంబరం సదరు ఇంటర్వ్యూలో తెలిపారు. తనతో యుద్ధ ఆలోచనను విరమించుకోవాలని కొండోలిజా రైస్ (Condoleeza Rice) చెప్పగా.. అది తన నిర్ణయం కాదని.. ప్రభుత్వ నిర్ణయమని చెప్పినట్టు వెల్లడించారు. తనకు ఆ సమయంలో ఎలాంటి అధికారిక రహస్యాలను బయటకు వెల్లడించాలని లేదని.. సైలెంటుగా పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని తన మనసుకు అనిపించిందని తెలిపారు. ముంబై ఉగ్రదాడుల తర్వాత యూఎస్ ఆపకుంటే పాక్‌ను మట్టుబెట్టి ఉండేవాళ్లమేనని చిదంబరం (Chidambaram) పేర్కొన్నారు.

ఆ దాడిలో 175 మంది మృతి

అప్పటికే యుద్ధం విషయమై తాను ప్రధాని సహా ఇతర ముఖ్యులతో చర్చించినట్టు చిదంబరం వెల్లడించారు. దాడి సమయంలోనూ ప్రధాని తనతో చర్చించారన్నారు. నవంబర్ 26, 2008న లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)తో అనుబంధంగా ఉన్న 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదుల బృందం ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్ (Chhatrapati Shivaji Maharaj Railway station), ఒబెరాయ్ ట్రైడెంట్ (Oberoi Trident), తాజ్ మహల్ ప్యాలెస్ (Taj Mahal Palace), టవర్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్‌లపై దాడులు చేసి విధ్వంసం సృష్టించింది. ఈ దాడిలో 175 మంది మరణించారు. ఈ దాడికి ప్రధాన కారకుడైన అజ్మల్ కసబ్‌ (Ajmal Kasab)ను 2012లో ఉరి తీశారు. కాగా.. చిదంబరం వ్యాఖ్యలు బీజేపీ నేతలకు ఏమాత్రం రుచించలేదు. ముంబై దాడుల తర్వాత విదేశాల ఒత్తిడి వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Union Minister Pralhad Joshi) విమర్శించారు.

హోంమంత్రిపై సోనియా పెత్తనమేంటి?

ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా (Shehzad Poonawala), ముంబై దాడుల తర్వాత చిదంబరం హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి తొలుత ఇష్టపడలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పాక్‌పై సైనిక చర్య తీసుకోవాలని కోరుకున్నారని, కానీ అది అవలేదని అన్నారు. అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh), కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోనియా గాంధీ (Sonia Gandhi)లు.. కొండోలిజా రైస్ ప్రభావంతో దీనిని అడ్డుకుని ఉంటారని అన్నారు. సోనియా నుంచి ఎందుకు యూపీఏ ఆదేశాలు తీసుకోవాల్సి వచ్చింది? అసలు హోంమంత్రిపై సోనియా పెత్తనమేంటని పూనావాలా ప్రశ్నించారు. ముంబై దాడులతో పాటు.. 2007 సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు దాడి రెండు ఘటనల్లోనూ పాక్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చిందని పేర్కొన్నారు. అదే సమయంలో "హిందూ ఉగ్రవాదం" కథనాన్ని కూడా ప్రోత్సహించిందని పూనావాలా ఆరోపించారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 30, 2025 12:09 PM